రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి.. రాష్ట్రంలో, దేశంలో తమకంటూ ఒక గుర్తింపును, గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకున్న నాయకులు చివరికి కుమారుల కోసమో.. కూతుళ్ల కోసమో తమ రాజకీయ జీవితాలను పణంగా పెట్టి మౌనంగా రిటైర్ అవ్వాల్సిన పరిస్థితులు కొని తెచ్చుకుంటున్నారు. అటువంటి నేతల కారణంగా రాజకీయాల్లో అధికారమే తప్ప విలువలకు స్థానం ఉండదని పదేపదే నిరూపితమవుతున్నది.
భారతదేశ రాజకీయం విలువల వలువలు ఎప్పుడో విప్పేసింది. రాజకీయాల్లో ప్రవేశించిన నాటి నుంచి జీవితాంతం తనకంటూ ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసి.. చివరి నిమిషంలో కొడుకు కోసమో.. కూతురు కోసమో పార్టీ మారడంతో అంతకాలం నిర్మించుకున్న ప్రతిష్ట ఒక్కసారిగా మసకబారుతుంది. కడియం శ్రీహరి, కే కేశవరావులు దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నవారే. కే కేశవరావుకు 84 ఏండ్లు కాగా.. కడియం శ్రీహరికి 71 ఏండ్లు వచ్చాయి. కేశవరావుది కాంగ్రెస్‌లో సుదీర్ఘమైన రాజకీయ జీవితం. జాతీయస్థాయిలో పార్టీ కోసం అనేక బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన నాయకుడాయన. తెలంగాణ ఉద్యమం విజయవంతమై ఫలితాన్నిస్తున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన కేశవరావు అక్కడ కూడా సముచిత స్థానాన్నే పొందారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆయనను నెత్తిన పెట్టుకున్నారు. తన తర్వాతి స్థానాన్ని అప్పజెప్పారు. ఎన్ఆర్ఐగా ఉన్న కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మిని జీహెచ్ఎంసీ మేయర్‌ను చేశారు. కానీ, ఇప్పుడు 84 ఏండ్ల వయసులో కేశవరావు తన కూతురు కోసం తన రాజకీయ జీవితానికి తానుగా ముగింపు పలికారు. ఆయన బయటకువచ్చి కేసీఆర్‌ను ఏమీ అనలేరు.. అలాగని కూతురు నిర్ణయాన్ని కాదని ఉండలేరు. ఇక తప్పక ఏవో సమర్థింపు మాటలు చెప్పుకొంటూ పార్టీ మారారు.
కడియం శ్రీహరిది కూడా అదే పరిస్థితి. టీడీపీలో అత్యంత వేగంగా ఎదిగిన వ్యక్తి కడియం శ్రీహరి. 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన మార్కెటింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1995లో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవటానికి ప్రధానమైన ఉపకరణంగా కూడా ఆదిలాబాద్ నాయకుడు నగేశ్‌తో పాటు, కడియం శ్రీహరి చంద్రబాబుకు బాగా ఉపయోగపడ్డారు. శ్రీహరి, నగేశ్‌లను ఎన్టీఆర్ సస్పెండ్ చేయడాన్ని కారణంగా చూపించే.. ఆనాడు ఎన్టీఆర్‌పై చంద్రబాబు డ్రామాకు తెరలేపారు. తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్లో చేరిన కడియం శ్రీహరికి తొలి క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. గత ఐదేండ్ల నుంచి తన కూతురు కావ్యను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడం కోసం ఆయన పక్కా వ్యూహంతో ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ వ్యూహంలో భాగంగానే లెక్కలు వేసుకొని మరీ ఆమెతో ఒక సామాజిక సేవా ట్రస్ట్‌ను ప్రారంభింపజేసి.. ప్రజలకు సేవలు చేయించారు. సామాజిక దృక్కోణంలో ఆమె పేరుతో వ్యాసాలూ అచ్చయ్యాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కడియంకు ఉన్నత స్థానం కల్పించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కడియం కూతురు కావ్యకు టిక్కెట్ కూడా ప్రకటించారు. కానీ, శ్రీహరి తానుగా ఒక సర్వే చేయించుకున్నారట. అందులో ఆయన కూతురు ఓడిపోతుందని వచ్చిందట. దీంతో తొలి ఎన్నికల్లోనే ఓటమి పాలైతే కష్టమని, అధికార పార్టీ నుంచి పోటీ చేస్తే గెలువచ్చునేమో అన్న భ్రమతో.. భయపడి హడావుడిగా ఆయన కాంగ్రెస్‌లో చేరిపోయారు.
కాంగ్రెస్ కురువృద్ధ నాయకుడు డి.శ్రీనివాస్ రాజకీయ పరిస్థితీ ఇదేవిధంగా ముగిసిపోయింది. రెండుసార్లు తన హయాంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన డి.శ్రీనివాస్.. 2018 ఎన్నికల్లో తన కొడుకు అరవింద్ కోసం బీఆర్ఎస్ పార్టీకి దూరమైపోయారు. పార్టీలో ఉండి కూడా.. తన క్యాడర్‌తో బీజేపీకి ఓటు వేయించడం ద్వారా కేసీఆర్ కూతురు కవిత ఓటమికి కారణమయ్యారు.
ఆ తర్వాత మొన్నటికి మొన్న మరో కొడుకు సంజయ్ కోసం కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. రాజకీయం అన్నది ఫక్తు వ్యాపారంగా మారిన ఈ రోజు ల్లో.. తమ తర్వాత తమ వారసులను అదే వృత్తిలో కొనసాగించేందుకు నాయకులు దేనికైనా సిద్ధపడుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో దేశం మొత్తం మీద ఈ ధోరణి మనకు స్పష్టంగానే కనిపిస్తున్నది. 60, 65 ఏండ్లు పైబడిన నాయకులు తమ వారసులకు బెర్తులు సిద్ధం చేస్తున్నారు. కానీ, రాజకీయాల్లో వారసత్వం అన్నది కేవలం ఎంట్రీ టిక్కెట్ లాంటిదే. ఒక్క సారి ఎంట్రీ ఇచ్చాక పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే.. ఎం తటివారికైనా అధోగతే. ఈ విషయాన్ని తండ్రులు గ్రహిస్తే.. తమ రాజకీయ జీవితాలను ఇలా పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాదు.
-కోవెల సంతోష్ కుమార్