తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమ పతాక రెపరెపల్ని తన అస్తిత్వంగా మలుచుకున్నాడొక ఉద్యమకారుడు. తన ఊపిరిని సైకిల్ చక్రాలుగా మార్చుకొని ఉద్యమ ఆకాంక్షను ప్రపంచం ముందు ఉంచిన ధీరుడతడు. ఉద్యమమే ప్రాణంగా కడదాకా పోరాడి అసువులు బాశాడు. అమరుడైనా ఆ బిడ్డడు చేసిన పోరాటం నేటికీ ఎందరికో స్ఫూర్తిని నింపుతున్నది. ఆ బిడ్డడే లంబాడీల వీరత్వాన్ని, తెగువను లోకానికి చాటిన ఉద్యమ వీరుడు జాదవ్ విలాస్‌రావ్ నాయక్.
నాజీల్లాంటి దుర్మార్గపు పరాయి పాలనను ధిక్కరిస్తూ తొలిదశ ఉద్యమకారులు చూపిన తెగువ, చేసిన త్యాగాలు మలిదశ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచాయి. పరాయి పాలకుల నుంచి మాతృభూమిని విముక్తి చేయడానికి జనులంతా తమ శాయశక్తులా పోరాడారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క దారి. ఈ ఉద్యమానికి సారథిగా ఆనాటి ఉద్యమకారుడు, ఈనాటి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందుండి నడిపించారు. ఆయన మార్గనిర్దేశంలో ప్రజలంతా నిర్విరామంగా కదం తొక్కారు. అటువంటి వీరుల్లో బంజారా యువ యోధుడు, తెలంగాణ ముద్దుబిడ్డ జాదవ్ విలా స్రావ్ నాయక్ ఒకరు. సైకిల్ యాత్ర ద్వారా తెలంగాణ సాధనకు విలాస్‌రావ్ కృషి చేశాడు.
పోరాటాలకు పురిటి గడ్డ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. రాంజీ గోండు, కొమురం భీం లాంటి వీరుల స్ఫూర్తితో ఆత్మబలాన్ని గుండెల్లో నింపుకొని ముందుకు కదిలాడు విలాస్‌రావ్. ఆయన నేటి ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో రెక్కాడితే గాని డొక్కాడని లంబా డీ కుటుంబంలో పుట్టాడు. కూలినాలి చేస్తూ బతుకీడుస్తున్న జాదవ్ గోపిబాయి, దేవుజీల బిడ్డ విలాస్. ఒక్క సెంటు భూమి కూడా లేని నిరుపేదలు. కొడుకును బాగా చదివించాలనుకున్నారు. కానీ ఇంటి పరిస్థితులు బాగలేక, చదివించే స్థోమత లేక విలాస్ చదువు మధ్యలోనే ఆగిపోయింది. పేదకుటుంబం కావడంతో కూలిపనికి వెళ్లక తప్పలేదు. విలాస్‌రావ్ చిన్నప్పటి నుండి సామాజిక స్పృహకలవాడు. కనుక ఎల్లప్పుడూ ప్రజలకోసం, దేశంకోసం ఆలోచించేవాడు. నలుగురికి మంచి జరుగుతుందంటే ధైర్యంతో దేనికైనా సిద్ధపడేవాడు. వచ్చిన కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరకుండా సుమారు మూడేండ్ల పాటు జీతం తీసుకోకుండా విఆర్వోగా నిస్వార్థ సేవచేసి స్థానిక ప్రజల్లో మంచిపేరును సంపాదించుకున్నాడు. అటువంటి ఆ యువకున్ని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మరింత ప్రభావితం చేసింది. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ పోరాటాన్ని ఆకళింపు చేసుకున్నాడు. సైకిల్ యాత్ర ద్వారా ప్రజా పోరాటానికి సిద్ధమయ్యాడు. అలా 2002 నుంచి సైకిల్ యాత్రగా బయలుదేరాడు. ఈ యాత్ర 2012 వరకు కొనసాగింది.
పరాయి పాలనలో నీళ్లు, నిధుల, నియామకాల విషయమేకాదు ప్రతి ఒక్క అంశంలోనూ అన్యాయం, వివక్ష కానవచ్చాయి. భాషా సాహిత్యాలు చిన్నచూపుకు గురయ్యాయి. 2001లో కేసీఆర్ ఎత్తుకున్న తెలంగాణ జెండాను తాను భుజాలకెత్తుకున్నాడు విలాస్. సొంత ఊరు నుంచి ప్రయాణం సాగించాడు. గ్రామస్థులు ఇ తని యాత్రను ఎంతో గొప్పగా స్వాగతించారు. తన ప్రయాణంలో భాగంగా గ్రామ గ్రామాన తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి ప్రసంగించాడు. తన ప్రచార రథం అయిన సైకిల్‌కు ఇరుపక్కలా తెలంగాణ జెండాలు, ముందువైపు నాయకుడు కేసీఆర్ ఫొటోను ఉంచుకున్నాడు. ఇతని యాత్ర ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్ మీదుగా కరీంనగర్, మంచిర్యాల గుండా ఆసిఫాబాద్ వరకు సాగింది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను వెలిబుచ్చుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తిరిగాడు. లగడపాటి రాజగోపాల్ లాంటి నాయకుల ముందుకు వెళ్లి నిర్భయంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతను వివరించి ‘విడిపోయి కలిసుందాం’ అన్న సందేశాన్ని వినిపించా డు. మొత్తంగా తెలంగాణలో ని పాత పది జిల్లాలతో పాటు ఆంధ్రా,మహారాష్ట్రలను కలుపుకొని 10 వేల కిలోమీటర్ల దూరం ఈ యాత్ర సాగింది.
ఆయన యాత్రను అడ్డుకోవాలని అనేక మంది ప్రయత్నించారు. నిజామాబాద్ జి ల్లా జానకంపేట బస్టాండ్‌లో నిద్రించినప్పుడు తన యాత్రకు బలాన్ని ప్రసాదిస్తున్న సైకిల్‌ను దొంగిలించారు కొందరు స్వార్థపరులు. మరోసారి ఖమ్మం సరిహద్దులో, విశాఖపట్నంలలో విలాస్‌ని బాగా కొట్టి సైకిల్‌ను లా క్కున్నారు. అయినా అధైర్యపడలేదు. తాను అడుగుపెట్టిన చోటల్లా ప్రజలు, నాయకులు ఎదురేగి స్వాగతం పలికారు. అతని ప్రసంగాలకు ముగ్ధులయ్యారు. విలాస్ యాత్రను గురిం చి ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలుసుకొని అతన్ని తనవద్దకు రప్పించుకొని భుజం తట్టా రు. తన్నీరు హరీష్‌రావు, కేటీఆర్, నారదాసు లక్ష్మణరావు తదితరులు విలాస్‌ను ప్రోత్సహిం చి యువతకు రోల్ మాడల్‌గా అతన్ని అభివర్ణించారు.తొమ్మిదేండ్లపాటు నిర్విరామంగా స్వరాష్ట్ర స్వప్నాన్ని కండ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఈ యాత్రను కొనసాగించాడు. ఈ క్రమంలో ఎన్నో బెదిరింపులు, దాడులను ఎదుర్కొన్నాడు.
2009లో చిదంబరం ప్రకటన వెనక్కి తీసుకున్నప్పుడు పట్టరాని దుఃఖాన్ని పంటికింద దాచుకొని తన సైకిల్ సంకల్ప యాత్రను కొనసాగించాడు. విద్యార్థి గర్జన, వంటావార్పు, రోడ్ల దిగ్బంధనం, సకల జనుల సమ్మె వంటి సహాయ నిరాకరణ కార్యక్రమాలలో పోరుబిడ్డలతో కలిసి ఉద్యమించాడు. 2012లో తెలంగాణ వాదాన్ని వినిపిస్తూ ఖానాపూర్ సభకు వెళ్తూ స్కూల్ బస్సు ఢీకొని ప్రమాదవశాత్తు మరణించాడు. విలాస్ అమరుడయ్యాడన్న వార్త తెలంగాణప్రజలను దుఃఖసముద్రంలో ముంచేసింది. విలాస్ మరణించిన రెండు సంవత్సరాలకు 2014 జూన్ 2 న తాను కలలుగన్న ప్రత్యేక తెలంగాణరాష్ట్రం ఆవిర్భవించింది. నేడు వినూత్న అభివృద్ధి పంథాతో దూసుకుపోతూ దశాబ్ది సంబురాలు జరుపుకుంటున్నది.
విలాస్‌కు భార్య, ముగ్గురు ఆడపిల్లలు, ఇద్ద రు అబ్బాయిలు ఉన్నారు. వీరిలో చిన్నవాడు మాతృగర్భంలో ఉన్నప్పుడే విలాస్ మరణించాడు. అతనికి ‘తెలంగాణ నాయక్’ (టీజీనాయక్) అని పేరుపెట్టారు. ఐదుగురు పిల్లల్ని సాకుతూనే భర్తమరణంతో కుంగిపోయిన విలాస్ భార్య కవితాబాయి 2018 ఫిబ్రవరి 18న కన్నుమూసింది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పిల్లలు అనాథలయ్యారు. దిక్కుతోచని స్థితిలో పిల్లలు 93ఏండ్ల తమ నానమ్మతో ఉంటున్నారు.
2001లో కేసీఆర్ ఎత్తుకున్న తెలంగాణ జెండాను తాను భుజాలకెత్తుకున్నాడు విలాస్. సొంత ఊరు నుంచి ప్రయాణం సాగించాడు. గ్రామస్థులు ఇతని యాత్రను ఎంతో గొప్పగా స్వాగతించారు. తన ప్రయాణంలో భాగంగా గ్రామ గ్రామాన తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి ప్రసంగించాడు. తన ప్రచార రథం అయిన సైకిల్‌కు ఇరుపక్కలా తెలంగాణ జెండాలు, ముందువైపు నాయకుడు కేసీఆర్ ఫొటోను ఉంచుకున్నాడు.
(వ్యాసకర్త:ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ)