అంటే అన్నారంటారు కానీ!
బిల్ క్లింటన్, బిల్‌గేట్స్ వంటి గొప్ప గొప్ప వాళ్లను రప్పించగలిగిన నాయకుడినే (చంద్రబాబు) జైల్లో పెడుతారా? అని ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాటుకున్నారు. ఆ మాటకొస్తే చంద్రబాబు పట్ల టీడీపీ నేతల కంటే పవన్‌కే ఎక్కువ గౌరవం ఉన్నట్టు ఉంది. బాబు అరెస్టుపై టీడీపీ సీనియర్ నాయకురాలు పరిటాల సునీత స్పందిస్తూ జైల్లో చంద్రబాబుకు ప్రాణాపాయం ఉందని… మొద్దు శీనును జైల్లోనే చంపలేదా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతల దృష్టిలో చంద్రబాబునాయుడు, మొద్దు శీను ఒకటేనా? ఇదేమి పోలిక తల్లి అని అంతా విస్తుపోతున్నారు!
సెల్ఫ్ డిక్లరేషన్!
తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఇంకా ప్రకటించకముందే టికెట్‌కు దరఖాస్తు చేసుకున్న కొందరు స్వయం ప్రకటిత అభ్యర్థులుగా పోస్టర్లు, కటౌట్లు పెట్టుకొని ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగిందేమో అనుకుంటే పొరపాటే. ఎల్బీ నగర్లో జక్కిడి ప్రభాకర్ రెడ్డి, హన్మకొండలో నాయిని రాజేందర్‌రెడ్డి తమ నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించి, ఇంటింటికెళ్లి ప్రచారం చేసుకుంటున్నారు. ఎల్బీ నగర్ టికెట్ కోసం టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ మధుయాష్కి దరఖాస్తు చేసుకున్న చోటనే పరిస్థితి ఇలా ఉందంటే, మిగతా చోట్ల ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు!
విజిటింగ్ కార్డు కోసమా?
తెలంగాణలో బీజేపీది మూడో స్థానమేనని ఆ పార్టీ నాయకులతో సహా లోకమంతా కోడై కూస్తుంటే, మరి టికెట్ల కోసం 6 వేల దరఖాస్తులు ఎందుకొచ్చాయన్నది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్టు… అసలు విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు బయటపెట్టారు. ఢిల్లీకి వెళ్లినా, మరెక్కడికి వెళ్లినా కంటెస్టెటెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే గౌరవం! ఎలాగూ గెలిచేది లేదని తెలుసు. పైగా దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఫీజు కూడా లేదు. దీంతో కనీసం విజిటింగ్ కార్డులోనైనా కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్‌గా పెట్టుకునేందుకు ఓ దరఖాస్తు పడేస్తే పోలా అనుకున్నారట చాలామంది. అసలు విషయం అది!
వార్ రూమ్ అక్కడేనా?
కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీకి గులాములని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు ఎప్పుడూ అంటుంటారు. అనే వాళ్లు ఎలాగు అంటారని బీజేపీ అధినాయకత్వం అనుకుందేమో! తెలంగాణ ఎన్నికలపై ఢిల్లీలోనే వార్ రూమ్ ఏర్పాటు చేసి దానికి ‘మిషన్-75’ అని పేరు పెట్టారట. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి ఎలా ఉందో సర్వే కోసం అధిష్ఠానం పంపిన నాయకులు కూడా ఢిల్లీ, గుజరాత్, యూపీ వారే కావడం గమనార్హం.
– వెల్జాల