మంత్రి పదవుల కోసం పైరవీలు చేయకండి. ఎవరైనా ఇప్పిస్తామని చెప్పినా నమ్మకండి’.. అని ఎన్డీయే పక్షాల భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయినా ఎవరు ఊరుకుంటారు.. ఎవరి ప్రయత్నాలు వారు చేయడం షరా మాములే కదా. కానీ, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాత్రం తనకు మంత్రి పదవి ఇస్తామన్నా వద్దంటానని సంచలన ప్రకటన చేశారు. మంత్రి పదవి వస్తే ప్రజలను కలవడం కష్టమవుతుందనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. రాజకీయ నాయకుల్లో పదవి వద్దనేవారు ఈ రోజుల్లో ఎవరుంటారు. విశ్వేశ్వర్‌రెడ్డి అలా ఎందుకన్నారనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో పోయినసారి నలుగురు ఎంపీలు గెలవగా ఒక మంత్రి పదవి దక్కింది. ఆ లెక్కన ఈ సారి 8 మంది గెలవడంతో రెండు మంత్రి పదవులు దక్కుతాయి. దీంతో తనకు ఎలాగూ మంత్రి పదవి రాదని తెలిసే విశ్వేశ్వర్‌రెడ్డి అలా ప్రకటించి ఉంటారని ఓ కమలనాథుడు అభిప్రాయపడ్డారు. మంత్రి పదవి వద్దనడం వెనుక అసలు మతలబు ఇదన్నమాట.
సర్వసత్తాక అమాత్యులు
ఏపీలో చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారానికి వెళ్తారా? అని సీఎం రేవంత్‌రెడ్డిని మీడియా ప్రతినిధులు అడగగా.. ఇలాంటి విషయాల్లో సొంత నిర్ణయాలు ఉండవు, అదిష్ఠానం వెళ్లమంటే వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. మరి ఖమ్మం టీడీపీ ఆఫీసులో జరిగిన విజయోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్లి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కేక్ ఎలా కట్ చేశారని ఈ సందర్భంగా గాంధీభవన్‌లో చర్చ జరుగుతోంది. ఖమ్మం మంత్రులకు అధిష్ఠానం అంటూ ఏమీ లేదని, అక్కడ ఎవరికి వారే అధిష్ఠానమని చర్చించుకుంటున్నారు. మిగతా మంత్రులు ఒకెత్తు అయితే.. ఖమ్మం మంత్రులు మరొకెత్తు, వారివి ఇండిపెండెంట్ పోర్టుఫోలియోలని చమత్కరిస్తున్నారు.
మీ సంగతి చెప్పండి బాస్!
కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ముఖ్య నాయకులకు వ్యక్తిగతంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ తన సిట్టింగ్ స్థానం బెంగళూర్ రూరల్‌లో ఓడిపోగా.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్ ఎంపీ సీటుతో పాటు ఆయన సిట్టింగ్ సీటు మల్కాజ్‌గిరిలోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు. ఇప్పుడు అక్కడా, ఇక్కడా బీజేపీ నేతలు వీరిద్దరిని టార్గెట్ చేస్తూ ఇదే అంశాన్ని అస్త్రంగా మలుచుకోవడంతో కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు.
సాకు దొరికిందోచ్!
ఏపీలో ఎవరూ ఉహించని ఫలితాలతో ఘోర పరాజయం పాలైన వైసీపీ నేతలకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఎంతో చేస్తే ఇలా ఎందుకైందన్నది తనకు అర్థం కావడం లేదని వైఎస్ జగన్ స్వయంగా వాపోయారు. కానీ, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం ఈవీఎంల ట్యాపరింగే తమ పార్టీ ఓటమికి కారణమని తేల్చేశారు. ఇక ఆ పార్టీ నేతలకు ఈవీఎంల సాకు దొరకడంతో తమను ఓడించింది ప్రజలు కాదు, ఈవీఎంలంటూ బృందగానం ఆలపిస్తున్నారు.
– వెల్జాల