అగ్గువ... అగ్గువ... బై వన్ గెట్ టూ ఫ్రీ. ఇదేదో దసరా షాపింగ్ ఆఫర్ అనుకుంటే నోటా బటన్ నొక్కినట్టే. తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రా పార్టీల టికెట్ల కోసం పెట్టిన బంఫర్ ఆఫర్ ఇది. ఒక్క టికెట్‌కు ఐప్లె చేస్తే ఆఫర్ కింద రెండు టికెట్లు ఫ్రీ.
అగ్గువ… అగ్గువ… బై వన్ గెట్ టూ ఫ్రీ. ఇదేదో దసరా షాపింగ్ ఆఫర్ అనుకుంటే నోటా బటన్ నొక్కినట్టే. తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రా పార్టీల టికెట్ల కోసం పెట్టిన బంఫర్ ఆఫర్ ఇది. ఒక్క టికెట్‌కు ఐప్లె చేస్తే ఆఫర్ కింద రెండు టికెట్లు ఫ్రీ. ఉదాహరణకు షర్మిల టికెట్‌కు దరఖాస్తు చేస్తే తల్లి విజయమ్మకు, భర్త బ్రదర్ అనిల్‌కు ఫ్రీగా టిక్కెట్లు. పైగా దరఖాస్తు ఫీజు కూడా లేదని రాజన్న రాజ్యం పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించగా, ప్రజాశాంతి పార్టీ కూడా సేమ్ టు సేమ్ ఆఫర్ ఇచ్చింది. అయితే షర్మిల కంటే తనకే రేటింగ్ ఎక్కువ కాబట్టి దరఖాస్తు ఫీజుగా రూ.10 వేలు పెట్టిన్నట్టు కేఏ పాల్ అంటున్నారు. పొలాలు రాసిచ్చి… కోట్లు కుమ్మరించి టికెట్లు కొనేకంటే మా టికెట్లు తీసుకోవచ్చు కదా? అని పాల్ నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. ఒక్క దరఖాస్తు ఫీజు విషయంలోనే వారికి (వైఎస్ఆర్టీపీ) తమకు తేడా ఉందన్నారు. సిస్టర్ షర్మిల పార్టీ డ్రైవర్లకు, సెక్యూరిటీ గార్డులకు కూడా పప్పుబెల్లాల్లా టికెట్లు పంచి పెడుతుంటే… మీరు ఫీజు పెట్టడం ఏమిటని తమ పనివాళ్లు తనపై గుర్రుగా ఉన్నట్టు పాల్ వాపోయారు.
ఓస్…అంతేనా?
కాంగ్రెస్ టికెట్లు ప్రకటించిన వెంటనే బీ ఫారాలు చేతికివ్వరట. గ్రామదేవత గుడి ముందుకు తీసుకెళ్లి ఒకవేళ గెలిస్తే (డౌట్) పార్టీ మారనని, మారాల్సి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఒట్టు వేయాలని కండీషన్ పెట్టబోతున్నారట. రాజీనామా చేయకపోతే ఏం చేస్తారు? చేస్తే గీస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఎమ్మెల్యే పదవికైతే ఢోకా ఉండదు కదా? ఓస్ ఇంతేనా? దానిదేముంది… ఒట్టు వేస్తే పోలా అని టికెట్ ఆశిస్తున్న నేతలు చాలా లైట్ తీసుకుంటున్నట్టు వినికిడి.
శుభం పలకరా మొగడా
శుభం పలకరా మొగుడా అంటే ఆ అశుభం మాటలేంటి? అని కమలానాథులు తెగ ఇదై పోతున్నారు. తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారేనని ఒకవైపు అమిత్ షా, మోదీ బల్లగుద్ది చెప్తుంటే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఏమో హంగ్ వస్తుందన్నారు. అంటే దీనర్థం బీజేపీకి అంత సీన్ లేదని పరోక్షంగా చెప్పినట్టే కదా? అని రాష్ట్ర నాయకులు ఢీలా పడిపోయారు.
ట్రైలర్ హిట్
ఒక సినిమాలో పెండ్లి కూతుర్ని హీరో బ్యాచ్ కిడ్నాప్ చేసి పట్టుబడుతుంది. అందులో ఒకడ్ని స్తంభానికి కట్టేసి మొత్తం కిడ్నాపర్స్ ఎంతమంది ఉన్నారని ప్రశ్నిస్తారు. అక్కడ గుమిగూడిన వారిలో ఉన్న ఫ్రెండ్స్ వైపు చూస్తూ టోటల్ ఫైవ్ అని అంటాడు. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాటలు వింటుంటే… అచ్చం ఇదే సీన్ గుర్తుకువస్తున్నది. తమ పార్టీ నుంచి టోటల్‌గా సీఎం రేసులో ఫైవ్ మెంబర్స్ ఉన్నామని చెప్తున్నారు. తనకు సీఎంగా చాన్స్ వస్తే తొలి సంతకం బెల్ట్‌షాప్‌ల రద్దుపై పెడుతానని, ఇతరులకు చాన్స్ వస్తే వారు దేనిమీద సంతకం పెడుతారో తెలియదని అంటున్నారు. మొత్తమ్మీద కాంగ్రెస్ ట్రైలరే ఇంత రంజుగా ఉంటే టికెట్లు ప్రకటించాక అసలు సినీమా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.