రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు, బోధన తీరు, మౌలిక వసతులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టనున్నది. విద్యాశాఖ ఏర్పాటు చేసిన అకడమిక్ ప్యానెల్ బృందాలు తరగతి గదుల్లో బోధన విధానం, పాఠ్య ప్రణాళిక, సిలబస్ పూర్తయిన తీరు, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు వంటి అంశాలను పరిశీలిస్తారు. విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం సామర్థ్యాలను కూడా అంచనా వేయనున్నారు. ఉపాధ్యాయులకు అవసరమైన విద్యాపరమైన సహకారం అందించడం, పాఠశాలల్లోని గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, తాగునీటి సౌకర్యం, పారిశుధ్యం, మధ్యాహ్న భోజన పథకం అమలు, భోజనం నాణ్యత, విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలు తదితర అంశాలపైనా బృందాలు దృష్టి సారించనున్నాయి.
సర్కార్ బడుల్లో చదువు, బోధన, వసతుల అసలు పరిస్థితిని పర్యవేక్షించే పాఠశాల తనిఖీలు చాలా కాలంగా పడకేశాయి. ప్రధానంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్ న్యాయవివాదాల నేపథ్యంలో ఎంఈవో, డిప్యూటీ ఈవో, డీఈవో ఖాళీల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. విద్యాశాఖలో పనిచేస్తున్న డీఈవోలంతా ఇన్చార్జులే! వీరికి తరగతిలో ప్రత్యక్ష అనుభవం లేదు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎంఈవో ఇన్చార్జులుగా అదనపు బాధ్యతలు నిర్వహించడంతో కీలకమైన తరగతి బోధన పరిశీలన నామమాత్రమైంది. అంతేకాదు, విద్యావ్యవస్థలో బోధన కంటే బోధనేతర బాధ్యతలు ఎక్కువయ్యాయి. ఎంఈవోలపై ఒత్తిడి పెరిగింది. పర్యవేక్షణ గాడి తప్పింది. కొత్త నియామకాలు చేపట్టకుండా, పాఠాలు చెప్పే రెగ్యులర్ ఉపాధ్యాయులకే అదనపు బాధ్యతలు కట్టబెట్టడం వలన ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో మండలానికి ఇద్దరు ఎంఈవోలను నియమించాలనే ప్రతిపాదన చర్చనీయాంశంగా మారింది.
రాష్ర్టానికి కొత్తగా 33 జిల్లాలతో కూడిన రాష్ట్రపతి ఉత్తర్వులు 2018లో అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వుల్లోని పేరా 3(3)లో పంచాయతీరాజ్, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ఏకీకృతం గురించిన సవరణపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2021లో పంచాయతీరాజ్ శాఖలోని వివిధ పోస్టులను లోకల్ క్యాడర్లుగా వర్గీకరిస్తూ అదే ఏడాది 204 జీవోను ఇచ్చారు. విద్యాశాఖలోని పోస్టులను జీవో 158 ద్వారా, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను జీవో 245 ద్వారా, మండల, జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులను జీవోలు 256, 257 ద్వారా లోకల్ క్యాడర్లుగా వర్గీకరించారు. ఫలితంగా సుప్రీంకోర్టు/హైకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం వేర్వేరు లోకల్ క్యాడర్లుగా ప్రభుత్వ పాఠశాల, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులుగా వర్గీకరించినట్లు అయింది. అవసరమైతే న్యాయ సలహాలను కూడా స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 309 ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించి రెండు క్యాడర్లను ఏకీకృతం చేస్తూ సర్వీస్ రూల్స్ రూపొందించే అధికారం ఉన్నది. దీనివలన దశాబ్దాల తరబడి ఉపాధ్యాయుల పర్యవేక్షణ పోస్టుల భర్తీకి ఉన్న అడ్డంకి తొలగిపోతుంది.
రాష్ట్రవ్యాప్తంగా 66 పోస్టులకుగాను 64 డిప్యూటీ విద్యాధికారి పోస్టులు, 33 జిల్లాలకుగాను 26 డీఈవో పోస్టులు ఖాళీలు ఉండడంతో విద్యాపాలన కుంటుపడింది. పర్యవేక్షణ పడకేసింది. ఎడ్యుకేషన్ కోడ్ ప్రకారం జరుగాల్సిన విద్యాపాలన అటకెక్కింది. ఫలితంగా ఉపాధ్యాయుల పనితీరు, బోధన, హాజరు, మధ్యాహ్న భోజనం, యూనిఫారాల వంటి అంశాలను పర్యవేక్షించే అవకాశం లేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో 630 మండలాలు ఉండగా…363 మండలాలకు మాత్రమే ఎంఈవో పోస్టులు మంజూరయ్యాయి. గత ప్రభుత్వం మరో 125 పోస్టులు మంజూరు చేసింది. ఇంకా 142 కొత్త మండలాలకు ఎంఈవో పోస్టులు మంజూరు కాలేదు. ఇద్దరు ఎంఈవోల వ్యవస్థను అమల్లోకి తేవాలంటే ఆ 142తోపాటు కొత్తగా 630 ఎంఈవో పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయాలి. ‘రెండో ఎంఈవో వస్తే ఆ వ్యవస్థను తొలగించే అవకాశం ఉంటుంది. దానివల్ల 1,800 మంది ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాలలపై దృష్టి పెట్టవచ్చు. ప్రస్తుతం ఎంఈవోలు అటు పరిపాలనాపరమైన, ఇటు విద్యాపరమైన బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తున్నది. రెండో ఎంఈవో వస్తే వేర్వేరు బాధ్యతలు అప్పగించవచ్చు. ఫలితంగా పాఠశాలలపై పర్యవేక్షణ పెరుగుతుంది’. రాష్ట్ర విద్యామంత్రిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యాశాఖలో పర్యవేక్షణ పోస్టులను భర్తీ చేయడానికి, ఉమ్మడి సర్వీసు నిబంధనలను అమలు చేయడానికి చొరవ చూపి విధానపరమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలని ఉపాధ్యాయులు ఆశిస్తున్నారు.
(వ్యాసకర్త: విద్యారంగ విశ్లేషకుడు)
-కె.వేణుగోపాల్
98665 14577