అబద్ధపు హామీలు, దుష్ప్రచారాలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే పంథాను కొనసాగిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ, కేసీఆర్‌పై బురదజల్లుతూ మరోసారి విద్యావంతులు, పట్టభద్రులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. కానీ, ఐదు నెలల పాలనలోనే కాంగ్రెస్ సర్కార్ మోసాలను గ్రహించిన పట్టభద్రులు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విధానం, పాలకుల అసమర్థత గురించి పండితుల నుంచి పామరుల వరకు అందరికీ అర్థమైపోయింది. గ్రాడ్యుయేట్లు ఈ విషయాన్ని గ్రహించడంలో కాస్త ముందే ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని విద్యావంతులు నిశ్చయించుకున్నారు. అందులో భాగంగానే పార్టీలకు అతీతంగా అభ్యర్థులను చూసి ఓట్లు వేయాలని వారు భావిస్తున్నారు. పోటీలో ఉన్నవారిలో ఉత్తమమైన అభ్యర్థికే పట్టం కట్టాలని అనుకుంటున్నారు. ఈ తరుణంలో పోటీ చేస్తున్నవారిలో రాకేశ్‌రెడ్డి అందరికంటే ఉత్తమమైన, మెరుగైన అభ్యర్థి అనే చర్చ తెరమీదకు వస్తున్నది. రాకేశ్‌రెడ్డి లాంటి ఉన్నత విద్యావంతున్ని ఎన్నుకుంటేనే తమ సమస్యలు చట్టసభల వరకు వెళ్తాయని పట్టభద్రులు, మేధావులు , నిరుద్యోగులు భావిస్తున్నారు.
అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. గతంలో ఆయన ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించారనే విషయాన్ని విద్యావంతులు గ్రహించారు. కావాలనే పని గట్టుకొని మరీ ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలపై విమర్శలు చేశారని తెలుసుకున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ఆయన పూటకో పార్టీ మారిన విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఎంతోమంది నాయకులు, సాధారణ ప్రజలు, వివిధ సంస్థలను బ్లాక్మెయిల్ చేసి, జర్నలిజం ముసుగులో ఆయన అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని చట్టసభలకు పంపిస్తే సొంత పనులను చక్కబెట్టుకుంటారే తప్ప విద్యావంతుల తరపున పోరాడరు. ఈ విషయాలన్ని ప్రస్తుతం ప్రజాక్షేత్రంలో చర్చకు వస్తున్నాయి.
ప్రశ్నించే గొంతుక అంటూ చెప్పుకొనే మల్లన్న కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశంసించారే తప్ప ఎక్కడా ప్రశ్నించలేదు. జ్యాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తలేదు. మెగా డీఎస్సీ గురించి మాట్లాడలేదు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ మాట తప్పినా ప్రశ్నించలేదు. పైగా ‘రైతుబంధు అడిగిన వాళ్లను చెప్పుతో కొడతా’ అంటూ అన్నదాతల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారు. మొత్తంగా ఈ ఐదు నెలల కాలంలో ఆయన చేసింది ప్రభుత్వాన్ని ప్రశంసించడం, ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్‌ను విమర్శించడమే.
యువత, విద్యావంతుల సమస్యలపై పోరాడాలంటే నాయకులలో పట్టుదల, దృఢ సంకల్పం, నాయకత్వ లక్షణాలు ఉండాలి. విద్యావంతులకు కావాల్సింది ప్రశ్నించే గొంతుక. ఆ విషయంలో రాకేశ్‌రెడ్డిని మించినవారు లేనే లేరు. ఉద్యోగ నోటిఫికేషన్లు సహా నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం లభించాలంటే ఆయనతోనే సాధ్యపడుతుంది. రాకేశ్‌రెడ్డిపై ఎలాంటి అవినీతి మరకలు లేవు, వివాదాలు లేవు. ఆయనది మచ్చలేని వ్యక్తిత్వం. అందుకే రాకేశ్‌రెడ్డిని గెలిపించి బీఆర్ఎస్ను మరింత బలపరచాలని విద్యావంతులు భావిస్తున్నారు.
జి.రాజేశ్ నాయక్
96035 79115