ఇతర అణగారిన సామాజిక వర్గాల వలె స్త్రీలు కూడా చరిత్రలో పాత్రధారులుగా, చారిత్రక వ్యక్తులుగా విస్మరణకు గురయ్యారు. వాళ్లు భర్తలు, కొడుకుల చాటునో, దానం ఇచ్చిన రాణీవాస స్త్రీలుగానో మిగిలిపోయారు. వేళ్ల మీద లెక్కించ దగ్గమంది పేర్లే చరిత్ర పుటల్లో యోధురాళ్లుగా, రాజకీయ చతురత ప్రదర్శించినవాళ్లుగా, నిర్ణాయక పాత్రను నిర్వహించిన వాళ్లుగా శాసనాల్లో నమోదైంది. కాకతీయుల రాజకీయం గొప్పదే కావచ్చు కానీ వాళ్లను అనుమకొండకు చేర్చిన ఘనత మాత్రం ఒక స్త్రీకి దక్కుతుంది. కాకతీయులు స్వతంత్ర రాజులుగా ఎదిగే క్రమంలో నిర్ణాయకమైన పాత్రను పోషించిన ఆమె పేరు విరియాల కామవసాని.
కురవి నుంచి అనుమకొండకు: ఆధారాల ప్రకారం కాకతిలో వెన్న రాజుతో మొదలైన కాకతీయ కథ కురవికి చేరిన తర్వాత కొంతకాలంలోనే అంతరించే స్థితికి చేరింది. 3వ గుండన, ఎర్ర, బేతియల తర్వాత 4వ గుండ (క్రీ.శ.955-995)ల గురించి ఆధారాలున్నాయి. 4వ గుండన రాష్ట్రకూట సామంత రాజుగా ఉన్నప్పుడే క్రీ.శ.973లో రాష్ట్ర కూటులను ఓడించి కళ్యాణి చాళుక్యులు అధికారంలోకి వచ్చారు. 4వ గుండన కళ్యాణి చాళుక్య సామంతుడిగా మారకుండా స్వతంత్రంగా ఉండే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలోనే కళ్యాణి చాళుక్య సామంతుడైన విరియాల ఎర్ర నృపతి చేతిలో మరణించాడు. కాకతీయ వారసుడైన గరుడ బేత అప్పటికింకా చిన్నవాడు. ఒకవైపు కాకతీయ వంశం రాజ్యం పోగొట్టుకొని కనుమరుగయ్యే సమయంలో కాకతీయ వంశాన్ని తిరిగి నిలబెట్టింది విరియాల కామవసాని.
వరంగల్ జిల్లా గూడూరులో క్రీ.శ.1124లో కళ్యాణి చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్ల (ఆరో విక్రమాదిత్య) పాలనాకాలంలో జారీచేసిన శాసనం దొరికింది. ఈ శాసనమే కాకతీయులకు కామవసాని చేసిన మేలుకు సాక్షి. తండ్రినీ, రాజ్యాన్నీ పోగొట్టుకున్న పిల్లవాడు బేతను తీసుకొని పల్లవరాయ నియోగానికి (కొలువుకు) వెళ్లి ఆయన ద్వారా కళ్యాణి చాళుక్య చక్రవర్తిని ఒప్పించి అనుమకొండ విషయాన్ని గరుడ బేతకు ఇప్పించింది. దీంతో అనుమకొండకు కాకతీయులు చేరుకున్నారు. ఇది సుమారు క్రీ.శ.1000 ప్రాంతంలో జరిగి ఉండాలి. అప్పటినుంచి కాకతీయుల కథకు అనుమకొండ, ఆ తర్వాత దానిపక్కనే ఉన్న ఓరుగల్లు కేంద్రమైంది.
ఈ కామవసాని ఎవరు?: అసలు ఈ కామవసాని ఎవరు, ఎందుకు కాకతీయులను అంతరించకుండా కాపాడిందనే దానికి గూడూరు శాసనంలోనే వెతుక్కోవాలి తప్ప ఇంకో శాస్త్రీయ ఆధారం లేదు. కాకతీయులు అంతరించిన మూడు శతాబ్దాల తర్వాత కా.సె.సర్వప్ప రాసిన సిద్ధేశ్వర చరిత్రలో కామవసాని బేతకు అనుమకొండను ఇప్పించిన ఘట్టం ఉంది కానీ పేర్లు మారిపోయాయి. కామవసాని బదులు కుంతలదేవి అనీ, గరుడ బేత పేరు ఎరుక దేవరాజ అని ఉన్నది. విరియాల కామవసాని గుండనను చంపిన విరియాల ఎర్ర నృపతి భార్య. శాసనంలో చాలా అందంగా ఎర్ర నృపుని అంగన (భార్య) అని ఉంది. పరబ్రహ్మ శాస్త్రితో పాటు చాలామంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం కామవసాని బేతకు మేనత్త. శాసనంలో కామవసాని మే(ల్గ)రుండని బేత భూవిభుని అని ఉంది కానీ మేనత్త అని తెలుపుతున్న పదం లేదు. ఏదేమైనా గరుడ బేతకు తన భర్త చేసిన అన్యాయానికి పరిహారంగా అనుమకొండను ఇప్పించిందనుకోవాలి. ఈ రోజుల్లో సాని అనే పదానికి అవమానకరమైన అర్థం ఉంది కానీ మధ్యయుగాల్లో సాని అంటే స్త్రీ అని అర్థం. అంతెందుకు ఇప్పటికీ వాడుకలో ఉన్న దొరసాని అనే పదానికి అర్థం దొర భార్య అనే కదా!
అనుమకొండ మొదటి పేరు అర్మకొండనా?: ఇప్పటి హనుమకొండ పట్టణానికి దాదాపు 1200 ఏండ్ల చరిత్ర ఉన్నది. గణపతిదేవుడి సోదరి మైలాంబిక వేయించిన బయ్యారం శాసనంలో తొలి కాకతీయులలో ఒకడైన గరుడ బేత అనుమ, కొండ అనే ఇద్దర్ని చంపి అనుమకొండ పేరుతో ముఖ్య పట్టణంగా చేసుకొని పాలించాడని ఉన్నది. దీన్ని పుక్కిటి పురాణంగానే భావించాలి. ఎందుకంటే గరుడ బేత కంటే ముందే క్రీ.శ.872లో రాష్ట్రకూట రాజు మొదటి అమోఘ వర్షుడి కాలంలోనే జారీచేసిన కాజీపేట శాసనంలోనే అనుమకొండ ప్రస్తావన శ్రీమద్ అర్మకొండగె శ్రావణమాస శుద్ధ పక్షద అని ఉన్నది. 1933లోనే నిజాం ప్రభుత్వ ఆర్కియాలజీశాఖ ఈ శాసనాన్ని రికార్డు చేసింది. ఈ శాసనం ప్రకారం అనుమకొండ మొదటిపేరు అర్మకొండ అయి ఉంటుంది. శ్రీమద్ అర్మకొండ అని అన్నారంటే రాష్ట్రకూట కాలం అంటే క్రీ.శ. 8 లేక 9 శతాబ్దాల నాటికే ఒక పట్టణంగా ఎదిగి రాష్ట్రకూట, కళ్యాణి చాళుక్య కాలాల్లో అనుమకొండ ఒక విషయం (అంటే ఇప్పటి జిల్లా పరిపాలనా విభాగం)గా ఏర్పడిందని తెలుస్తున్నది. అందుకే ఇప్పుడు ప్రచారంలో ఉన్న హన్మకొండ మూలాల్లో హనుమ, అనుమ లేక కొండ వంటి పదాలు, కథల్లేవు. మరి ఆర్మకొండ అంటే అర్థం ఏమిటనేది ఇంకా పరిశోధించాల్సిన విషయం.
ఇదీ తొలి కాకతీయులు కళ్యాణి చాళుక్య సామంతులుగా అనుమకొండ పాలకులైన సందర్భం. కాకతీయులు ఎదిగే క్రమంలో అనుమకొండను చేరుకోవడం ముఖ్యమైన మలుపు. ఎందుకంటే అనుమకొండ అప్పటికే ఒక పట్టణంగా, విషయంగా ఎదిగినందున కాకతీయులకు కావలసిన అన్ని వనరులు సమకూరడమే కాదు, ఉత్తర తెలంగాణలోనే ముఖ్య కేంద్రంగా ఎదుగుతున్నది. అందుకే క్రీ.శ.11వ శతాబ్దం నుంచి సుమారు క్రీ.శ.1350 వరకు అంటే రాబోయే దాదాపు మూడు దశాబ్దాల తెలంగాణ చరిత్ర అనుమకొండ, ఓరుగల్లు (వరంగల్) కేంద్రంగా నడిచింది.
డా. ఎం.ఎ. శ్రీనివాసన్
81069 35000