సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇడుపులపాయలలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులు ఆర్పించారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంటికెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అయితే చంద్రబాబు నాయుడికి వీర విధేయుడు. ఒకవైపు అసలు సిసలైన తెలంగాణవాదులమని చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీ ప్రస్తుత రాష్ట్ర సారథులకు తెలంగాణను వ్యతిరేకించిన నాయకులు తమ రాజకీయ గురువులా?. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని ఉక్కుపాదాలతో అణచివేసినవారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్న నాయకులు ఏ విధంగా గురువులు అవుతారన్న సోయి కూడా లేకుండా పోయింది. భట్టి, కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నట్టు అని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు.
షర్మిల కంటే పాల్ నయం
వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నట్టు షర్మిల ప్రకటించడంతో నిన్నమొన్నటి దాకా ఆమె వెంట తిరిగిన నాయకులు ఇప్పుడు షర్మిల కంటే కేఏ పాల్ నయం అంటున్నారు. పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ కనీసం ఎన్నికల్లో పోటీ చేసింది. కానీ ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండానే షర్మిల తన పార్టీని అగ్గువకు కాంగ్రెస్‌కు అమ్మేయడం ఏమిటని వారు వాపోతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండానే అమ్ముడుపోయే పార్టీ అని తెలిసి ఉంటే ‘పాదాల మీద నడిచే’ పాదయాత్రలో అసలు పాల్గొనేవాళ్లమే కాదంటున్నారు. షర్మిల పార్టీకి ఇంత తొందరగా కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుందని అంచనా వేయలేకపోయామని ఆ నాయకులంతా ఇప్పుడు లబోదిబో మంటున్నారు.
ఎన్ఆర్ఐ వింగ్ అప్పగించారా?
తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ విదేశీ పర్యటనలు చేస్తున్నారు. అక్కడ పార్టీ అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎప్పుడూ విదేశాలకు వెళ్లని బండి ఇప్పుడే ఎందుకు వెళ్లినట్టు అని ఆరా తీస్తే.. పదవి నుంచి తప్పించడంతో నారాజ్‌గా ఉన్నాడని.. బహుశా ఆయనకు ఎన్ఆర్ఐ వింగ్ బాధ్యతలు అప్పగించినట్టు ఉన్నారని బీజేపీ కార్యాలయంలో సెటైర్లు వేస్తున్నారు!
ఆముదం చెట్టే మహా వృక్షం
బీజేపీలో చేరికలు లేక చతికిలబడిన నాయకులకు ధైర్యాన్ని నూరిపోసే పనిని తెలుగు చానల్స్ భుజానికి ఎత్తుకున్నాయి. పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినా బీజేపీకి పెరిగిన వలసలు అంటూ న్యూస్ చానల్స్ ప్రసారం చేస్తున్న కథనాలతో కమలనాథులు మానసిక ఆనందం పొందుతున్నారు! బీజేపీలో చేరే చోటా మోటా నాయకులకు కూడా అంతటి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటనీ ఒక చానల్ రిపోర్టర్‌ను ప్రశ్నిస్తే, ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం కదా అంటూ కొత్త భాష్యం చెప్పారు.
– వెల్జాల