తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనన్య త్యాగాల ఫలితం. లెక్కలేనన్ని ఆటుపోట్లు, ఒడిదుడుకులు ఎదుర్కొని పోరాడటంతో రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. టీఆర్ఎస్ అధినేత ఉద్యమ నాయకుడు కేసీఆర్ నేతృత్వంలో సబ్బండ వర్గాలు ఈ మహోద్యమంలో పాల్గొని విజయం సాధించడంతో రాష్ట్ర సాధన పరిపూర్ణమైంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ‘రైతుబంధు’ పథకం నేడు దేశానికే ఆదర్శవంతమైనది. అప్పుల బాధ తప్పి, నీటి గోస తీరి నేడు అన్నపూర్ణగా రాష్ట్రం భాసిల్లుతున్నది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు మొదలైన పథకాలతో తెలంగాణ దేశంలోని ఇతర రాష్ర్టాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నది.
నాడు ఎక్కడ చూసినా నెర్రెలు- మట్టి నిండిన ఒర్రెలు కనిపించేవి. సాగు మొత్తం ఆగమైందే అని దిగాలు పడ్డ తెలంగాణ ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ అయింది. ఎంత అద్భుతం! అందుకు ఎన్ని ప్రణాళికలు కావాలి, ఎంత ఆచరణాత్మక కృషి జరగాలి? మీకు వ్యవసాయం వస్తదా? అని ప్రశ్నించిన నోళ్లతోనే మీకే వ్యవసాయం వస్తదని చెప్పించాలంటే ఎంత సమర్థవంతమైన నాయకత్వం కావాలి? ఎంతటి అకుంఠిత కార్యాచరణ అవసరం. ఇంత మహాద్భుతం జరిగింది కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే అనడంలో సందేహం లేదు. కరోనా కష్టకాలంలోనూ దేశంలో రైతుల నుంచి వరిధాన్యం సేకరణలో ద్వితీయస్థానంలో ఉన్నది తెలంగాణ.
20, 30 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు కట్టడానికే దేశంలోని ఇతర రాష్ర్టాల పాలకులు ఎన్నో ఏండ్ల సమయం తీసుకుంటున్నరు. ఈ తరుణంలో 200 టీఎంసీల నిల్వ సామర్థ్యం, అవసరాన్ని బట్టి దాదాపు 500 టీఎంసీల వరకు సామర్థ్యం ఉండే కాళేశ్వరం లాంటి అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని కేవలం మూడేండ్లలో పూర్తిచేసి ప్రారంభించడం కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శనం.
ఈ నిలువెత్తు ప్రగతిని మరే రాష్ట్రంలోనైనా చూడగలమా? అవసరం కోసం రాజకీయాలు చేసేవాళ్లు, అవకాశాల కోసం రాజకీయాలు చేసేవాళ్లు ఎన్నైనా మాట్లాడుతుంటారు. కానీ, బాధ్యతలను భుజాలపై మోసే నాయకత్వానికే తెలుస్తుంది కదా ప్రజల జీవితాలను ప్రగతిపథం వైపు ఎట్లా నడిపించాలో! ఇదంతా రాష్ర్టాన్ని దేశ పటంలో సమున్నతంగా నిలబెట్టడం ఆత్మగౌరవం, అస్తిత్వాన్ని కాపాడుతూ పాలన అందిస్తున్న కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమైంది.
తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు భారీ ప్రాజెక్టులను నిర్మిస్తూనే మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులను సైతం అంతే వేగంగా నిర్మించింది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏండ్ల తరబడి సాగదీతకు గురై, వెనక్కి నెట్టివేయబడ్డ కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎల్లంపల్లి, భీమా, మిడ్‌మానేరు, సింగూరు, కొమ్రం భీం, నీల్వాయి, జగన్నాథ్‌పూర్, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ప్రాజెక్టులను పూర్తిచేసింది. ఇక చనఖా-కొరటా, సదర్మట్, సీతమ్మసాగర్, గట్టు ప్రాజెక్టులు చివరిదశలో ఉండగా సమ్మక్క బ్యారేజీ ఇప్పటికే పూర్తయింది. ఇవేకాదు, నీటిపారుదల రంగంలో రికార్డులు తిరగరాస్తూ 11 నెలల్లోనే ఖమ్మంలో భక్తరామదాసు, జోగులాంబ గద్వాల జిల్లాలో తుమ్మిళ్ల ఎత్తిపోతలను పూర్తిచేసింది. ప్రాజెక్టులన్నీ పూర్తయితే దాదాపు కోటిన్నర ఎకరాలకు సాగునీరందుతుంది. తెలంగాణలోని ప్రతి అంగుళం భూమికి సాగునీరు చేరుతుంది. ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ వ్యవసాయ వృద్ధికి తోడ్పడుతున్నాయి. సంకల్పించిన ప్రాజెక్టులన్నీ పూర్తయితే దేశంలో తెలంగాణ వ్యవసాయరంగం ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
తెలంగాణ వచ్చేనాటికి విస్తీర్ణ యోగ్యమైన కోటి 40 లక్షల ఎకరాల భూమిలో సగానికి కొంచెం అటూ ఇటుగా రైతులు సాగు చేసేవారు. కానీ నేడు 2 కోట్ల 5 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. అంటే 50 శాతానికి పైగా వృద్ధి చెందింది. వ్యవసాయరంగం ఏటా 14.5 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తూ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదుగుతున్నది. ఈ ప్రగతి అప్రతిహతంగా కొనసాగాలి. మనమందరం ఈ అభివృద్ధిలో భాగస్వాములం కావాలి. ప్రతీ ఒక్కరు తనవంతు సహకారం ప్రభుత్వానికి అందించాలి. పాడి పంటలు స్వయం సమృద్ధి, ఆత్మగౌరవ తెలంగాణ నిర్మాణం చేస్తూ ముందుకు సాగుతున్న కేసీఆర్‌కు మనందరి తోడ్పాటునందిద్దాం. కలసికట్టుగా ఉండి అభివృద్ధి తెలంగాణను నిర్మించుకునే దీక్షలో పాలు పంచుకుందాం.
తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం పట్ల బీజేపీ శ్రద్ధ ఎప్పుడూ ప్రశ్నార్థకమే. ప్రాంతీయ అస్తిత్వాలను, జాతీయపార్టీలు ఏనాడూ పట్టించుకోలేదు. గడిచిన ఐదారు దశాబ్దాల్లో జరిగిందిదే. జాతీయస్థాయి పథకాల గురించి మాట్లాడే బీజేపీ తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదు. కాళేశ్వరానికి కానీ ఇక్కడి మరొక నీటి పథకానికి కానీ జాతీయహోదాను ఇవ్వలేదు, ఆర్థిక సహాయం చేయలేదు. పసుపు బోర్డుపై చేసిన వాగ్దానం అటకెక్కింది. కాజీపేట వర్క్‌షాపు కాగితాల్లో మురిగింది.
తెలంగాణ ఆత్మగౌరవం గురించి కానీ బడుగు బలహీన వర్గాల ఉన్నతిని గురించి కానీ ఆ పార్టీకి ఉన్న శ్రద్ధ ఎంతనో తెలంగాణ ప్రజలకు తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుస పరాజయాలు పొందిన ఈ పార్టీ టీఆర్ఎస్కు ఏ మాత్రం ప్రత్యామ్నాయంగా నిలువలేదని ప్రజలకు స్పష్టమైంది. తెలంగాణ అస్తిత్వాన్ని వచ్చే దశాబ్దాలకు కూడా కాపాడగలిగిన యువనాయకత్వం కూడా టీఆర్ఎస్కే ఉన్నది. ప్రాంతీయ అస్తిత్వాలను, ఆత్మగౌరవాన్నీ కాపాడగలిగేది ప్రాంతీయ పార్టీలే అని చాలా రాష్ర్టాల్లో రుజువైంది. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడగలిగేది నేడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ మాత్రమేనని ప్రజల్లో స్థిరభావం ఏర్పడింది.
ఇటీవల అందరూ తమ దృష్టిని కేంద్రీకరించి ఉన్న మునుగోడు ఉప ఎన్నికలో అధికారం కోసం పాకులాడే పార్టీలు ఒకవైపు, తెలంగాణను బలమైన రాష్ట్రంగా తీర్చిదిద్ది సబ్బండవర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచటానికి కృషిచేస్తున్న టీఆర్ఎస్ మరోవైపు ఉన్నాయి. ప్రజలు దూరదృష్టితో ఆలోచించి టీఆర్ఎస్ పక్షాన నిలబడి ఉద్యమ పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఢిల్లీని ప్రతిపక్షాలు నమ్ముకుంటే, టీఆర్ఎస్ పార్టీ గల్లీ ప్రజలనే నమ్ముకున్నది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ వ్యతిరేకులకు ప్రజలే బుద్ధిచెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.
(వ్యాసకర్త: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి)
పువ్వాడ అజయ్ కుమార్