కులం గురించిన చర్చ ఈ రోజు కొత్తగా జరుగుతున్నది కాదు. కానీ, ఈ చర్చ వచ్చిన ప్రతీసారి కొన్ని కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. మరిన్ని కొత్త చర్చలు తెర మీదకొస్తున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకుంటున్న బీసీ కులగణనకు సంబంధించిన చర్చ కూడా పలు ఆలోచనలకు తావిస్తున్నది. గత అనుభవాలే మూల కారణం.
కులం ఆధారంగానే మన దేశ సామాజిక వ్యవస్థ నిర్మాణం జరిగింది. ఇప్పటికీ అదే కొనసాగుతున్నది. కొందరు నాయకులు మినహాయిస్తే కులం విషయంలో అందరూ ఆ తాను ముక్కలే. ఎన్నికలు వచ్చాయంటే చాలు, బీసీల మీద అన్ని పార్టీలకు వల్లమాలిన ప్రేమ పుట్టుకొస్తుంది. గత ఎన్నికలకు ముందు భారత్ జోడోయాత్ర సందర్భంగా రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు వర్తింపజేస్తామని బాహాటంగానే ప్రకటించారు. ఇక్కడ జరిగిన కామారెడ్డి డిక్లరేషన్‌లో ఈ విషయంపై మరింత స్పష్టత ఇచ్చారు. 42 శాతం రిజర్వేషన్ కూడా కల్పిస్తామని చెప్పారు. దానికి కొనసాగింపుగానే కావచ్చు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కులగణన చేయాలని 2024, అక్టోబర్ 11 నాడు జీవో నెంబర్ 18 విడుదల చేసింది. 60 రోజుల్లో కులగణనను పూర్తిచేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా బీసీ కమిషన్‌కు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో ఉన్న దాదాపు 134 బీసీ కులాలకు సంబంధించి జనాభా లెక్కలు తేల్చే వ్యవహారం కొలిక్కి వచ్చినందుకు బీసీ సంఘాలు నిజంగానే తెగ సంబురపడిపోతున్నాయి. ఇందుకు చొరవ తీసుకున్న ప్రభుత్వానికి అభినందనలు కూడా తెలిపాయి.
ఇంతవరకు బాగానే ఉంది. కులగణన పూర్తయిన తర్వాత వచ్చిన ఆ లెక్కల ఆధారంగా కులాల ప్రాతిపదికన ఈ ప్రభుత్వం రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించనుందా? 42 శాతం రిజర్వేషన్‌ను ఎలా అమలుచేస్తారు? మొత్తం రిజర్వేషన్ల శాతం 50 శాతానికి మించొద్దని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించిన నేపథ్యంలో బీసీలకు 42 శాతం ఎలా సాధ్యమవుతుంది. కులగణన చేసినంత మాత్రాన సరిపోతుందా? తద్వారా రావలసిన ఫలాలు, అందాల్సిన అదనపు ప్రయోజనాలు లేనప్పుడు ఈ లెక్కలు తేల్చే వ్యవహారం వల్ల ఉపయోగం ఏమిటన్నది ఇప్పుడు కొత్తగా ఉద్భవిస్తున్న ప్రశ్న.
నిజానికి దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. వారికి తీరని అన్యాయం జరిగిందనే విషయం రూఢీ అవుతున్నది. ఇంతకు మించి వారికి ఏదో చేయాలనే చాలామంది నాయకులు అనుకుంటున్నారు. కానీ, ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల లెక్కలు తేల్చి ఎవరెంతో.. వారికి అంత అనే మాట అంటున్నది. కానీ, ఇది సాధ్యమేనా?
బీసీల రాజకీయ సాధికారతను కల్పించే విషయంలో ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిపైన చాలామందికి అనుమానాలుంటాయి. ఇప్పుడు అదే జరుగుతున్నది. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఎన్ని అమలయ్యాయి? మిగిలినవి ఎందుకు అమలుకాలేదు? ప్రభుత్వం వద్ద నిధులు లేవా? లేక చిత్తశుద్ధి లేదా? ప్రభుత్వ పనితీరును ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇట్లా చాలా విషయాలు జనం చర్చల్లో ఉన్నాయి. కానీ, బీసీ కులగణన విషయానికి వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే బీసీల రాజ్యాధికారం కోసం ఆలోచిస్తుందా? ఆచరిస్తుందా? నిజంగానే బీసీల కోసం పనిచేస్తుందా? ఆ దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తుందా? ఇలాంటి ప్రశ్నలు గత ఏడు దశాబ్దాల కాలంలో సింహభాగం అధికారంలో ఉన్న ఏకైక పార్టీగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని చూసిన ఎంతోమంది మదిలో తలెత్తుతున్నవి.
దేశవ్యాప్తంగా బీసీల కోసం చిత్తశుద్ధితో పనిచేసే పార్టీలు, నాయకుల కోసం టార్చిలైట్ వేసుకొని వెతకాల్సిన స్థితి ఉన్నది. దానికితోడు బీసీ కులగణన విషయంలో బీహార్ రాష్ట్ర అనుభవం కూడా ఉన్నది. వారు మొత్తం 65 శాతం రిజర్వేషన్లను ఆ రాష్ట్రంలో అమలుచేయగా సుప్రీంకోర్టు దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేయటం అందరికీ తెలిసిన విషయమే. 50 శాతానికి మించి ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు ఉండరాదని నొక్కి వక్కాణించి చెప్పడం గమనించదగిన విషయం.
ఇక్కడ కూడా కులగణన అనంతరం ఎటూ తేల్చకుండా వదిలేస్తారా అనే సందేహాలు తెలంగాణలోని బీసీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం ఎలాగూ ఇవ్వకతప్పని అనివార్య స్థితి. ఇక మిగిలేది 29 శాతం. కులగణన అనంతరం కులాల ప్రాతిపదికన జనాభా శాతాన్ని దృష్టిలో పెట్టుకొని నిజంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే 63 శాతానికి మించి రిజర్వేషన్లు అమలుచేయాల్సి ఉంటుంది. లేదంటే పెద్ద మనసుతో ఈ ప్రభుత్వం జనరల్ సీట్లలో సైతం బీసీలకు కులాల ప్రాతిపదికన సీట్లు ఇచ్చి బరిలో నిలిపి తమ చిత్తశుద్ధిని చాటుకోవాల్సి ఉంటుంది. మొన్న ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చిందో అందరికీ తెలుసు. అలాంటిది త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ కేటగిరి సీట్లలో బీసీలకు ఇచ్చేంత పెద్ద మనసు ఈ ప్రభుత్వానికి, ఈ పాలకులకు ఉంటుందా? అనే విషయాన్ని బీసీ సంఘాలు ఆలోచించుకోవాలి. నిజంగా అంత పెద్ద మనసుంటే తెలంగాణలో ఉన్న మొత్తం గ్రామ పంచాయతీలు 12,769 గ్రామాల్లో 42 శాతం అంటే 5,363 గ్రామ పంచాయతీలకు సర్పంచులుగా బీసీ కులాలకు చెందినవారు ఎన్నిక కావడం ఖాయం. అంతేకాదు, వేలాదిమంది వార్డు మెంబర్లు, 540 మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీపీలుగా 226 మంది, 32 జిల్లా పరిషత్ కార్యాలయాల్లో జిల్లా పరిషత్ చైర్మన్లుగా 14 మంది, ఇంకా జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా వందలాది మంది ఎన్నికయ్యే అవకాశాలు లేకపోలేదు.
ఈ గణాంకాలు వినడానికి, చూడటానికి బీసీలకు కానీ, బీసీ సంఘాల నాయకులకు కానీ ఎంతో సంతృప్తినిస్తాయనటంలో సందేహం లేదు. కానీ, ఆచరణ సాధ్యమైనప్పుడే ఈ సంతృప్తి మిగులుతుంది. కేవలం కులగణన చేసి రిజర్వేషన్లు అమలుచేయకపోతే విస్తరు వేసి వడ్డన చేయకుండా అవమానపరిచినట్టే భావించి బీసీలు అదే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పే అవకాశాలున్నాయి. లెక్కల్లో తమ శాతం తెలిసి, తమ బలం ఏంటో వారికి అర్థమైన తర్వాత తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోతే తిరుగుబాటు అనేది తప్పకుండా వస్తుంది. అదే జరిగితే, దాదాపు 60 శాతానికి పైగా బీసీ జనాభా కులాలవారీగా లెక్క తేలితే, కనీసం వారికి ఇచ్చిన మాట ప్రకారం 42 శాతం అమలు చేయకపోతే జరగబోయే పర్యవసానాన్ని సైతం ఈ ప్రభుత్వం ముందే గుర్తిస్తే మంచిదేమో. ఏదేమైనా లెక్కలు తేల్చే పనికి పూనుకున్నందుకు ఒక పక్క అభినందనలు చెప్తూనే, మరోపక్క వారిచ్చిన మాటను పదే పదే గుర్తుచేస్తూ ఇచ్చిన రిజర్వేషన్ హామీని సాధించుకునే దిశగా కలిసికట్టుగా బీసీ సంఘాల నాయకులు ముందడుగు వేస్తే బాగుంటుంది.