‘నువ్వెవరో తెలుసుకో ముందు’ అంటుంది భారతీయ తాత్వికత. ఈ తత్వం మాటేమోగానీ భారతీయులకు ఇప్పుడు పౌరసత్వం పెద్ద చిక్కుముడిగా మారింది. ఇంతకూ నేనెవరు? అసలు నేను భారతీయుడనేనా? అయితే అందుకు రుజువేదీ అనే కొత్త విచికిత్స మొదలైంది. 36 లేదా 60 పేజీలతో జేబులో పట్టే చిన్న పుస్తకం సైజులో ఉండే భారతీయ పాస్‌పోర్ట్ అనేది చాలామందికి గర్వకారణంగా ఉంటుంది. సంబంధిత వ్యక్తి పేరుతోపాటుగా జాతీయతకు సంబంధించిన వివరాలు అందులో ఉంటాయి. అంతమాత్రాన అది పౌరసత్వానికి ప్రమాణ పత్రం ఎంతమాత్రం కాదు, ప్రధానంగా అదొక ప్రయాణ పత్రం మాత్రమేనని విదేశాంగ శాఖ ‘వర్గాలు’ వెలువరించిన స్పష్టీకరణతో దృశ్యం అస్పష్టమైపోయింది. ఇంకా చెప్పాలంటే సంక్లిష్టమైపోయింది. ఈ వివాదం దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీసింది. పౌరుడు కాకపోతే మరి పాస్‌పోర్ట్ ఎందుకు ఇచ్చినట్టు? అనే ప్రశ్నలు ఈ సందర్భంగా తలెత్తుతున్నాయి. మొత్తమ్మీద విదేశాంగ అనధికార వివరణతో తమ పౌరసత్వాన్ని ఏ పత్రాలు విశ్వసనీయంగా నిర్ధారిస్తాయో తెలియని గందరగోళంలో పడిపోయారు భారతీయులు.
పాస్‌పోర్ట్ పౌరపత్రం అని ప్రజలు సాధారణంగా విశ్వసిస్తారు. కానీ అది నిజం కాదని విదేశాంగ శాఖకు చెందిన ఓ అనామక అధికారి ద్వారా కేంద్రం ఎందుకు చెప్పించినట్టు? 1967 పాస్పోర్ట్స్ చట్టంలోని సెక్షన్ 20 సాంకేతికంగా కొన్ని అసాధారణ సందర్భాల్లో కొంతమంది స్థానికేతరులకు ప్రభుత్వం తాత్కాలిక ప్రయాణ పత్రాలుగా పాస్‌పోర్ట్‌లు జారీ చేయవచ్చని అనుమతిస్తుంది. కనుక పాస్‌పోర్ట్ పౌరపత్రం కానేకాదని ప్రభుత్వ అనుకూల మీడియా అర్థాలు తీస్తున్నది. పాస్‌పోర్ట్ పొందడంలో కఠినమైన నిబంధనలు ఉంటాయి. పత్రాల తనిఖీలు, పోలీసు ధృవీకరణల వంటివి పకడ్బందీగా జరుగుతాయి. అనేక శల్యపరీక్షల తర్వాత ఇచ్చే పాస్‌పోర్ట్ తమ భారతీయతను గుర్తించే అత్యున్నత ప్రమాణంగా ప్రజలు భావిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ నమ్మకాన్ని వమ్ముచేయడం విస్తృత స్థాయిలో ఆందోళనకు కారణమైంది. ‘తాంబూలాలిచ్చేశాం..తన్నుకు చావండి’ అన్నట్టుగా కేంద్రం పాస్‌పోర్టు పౌరసత్వ పత్రం కాదని చెప్పి చేతులు దులిపేసుకోవడం వెనుక ప్రభుత్వ ఆలోచన ఏమై ఉంటుందా? అని ఆలోచిస్తే ఒకింత ఆందోళన కలుగకమానదు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు ప్రభుత్వ సేవలు సార్వజనిక రూపంలో అందరికీ అందుబాటులో ఉండేవి. అలాగే పౌరసత్వం ఓ ప్రశ్నగా ఎన్నడూ లేదు. కానీ బీజేపీ పన్నెండేండ్ల పాలనలో ఓటుహక్కులు ఎగురగొట్టడం, సంక్షేమ పథకాల నుంచి మినహాయించడం సాధారణ అంశమైపోయింది. చివరికి పౌరసత్వమూ ఓ బ్రహ్మపదార్థమై కూర్చున్నది. రాజకీయ ఉద్దేశాలతో పౌరసత్వాన్ని నిర్ధారించే ప్రయత్నం జరుగుతున్నదా? అనే అనుమానాలు ఈ సందర్భంగా కలుగక మానవు.
పాస్‌పోర్ట్ కాకపోతే మరి ఏ పత్రం జాతీయతకు, పౌరసత్వానికి ప్రమాణంగా ఉంటుందనే ప్రశ్నలు ప్రజల మనసులో మెదులుతున్నాయి. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ.. ఈ రెండూ వ్యక్తిగత గుర్తింపు, నివాస రుజువులుగా చట్టబద్ధత పొందాయి. కానీ అవి పౌరసత్వ రుజువులు ఎంతమాత్రం కావు అనేది తెలిసిందే. జనన ధ్రువీకరణ పత్రాలు దేశంలో అందరికీ లేవు. ఈ నేపథ్యంలో స్పష్టమైన, ఏకీకృతమైన మార్గదర్శకాలను కేంద్రం రూపొందించాల్సి ఉన్నది. ఉన్నపళంగా పాస్‌పోర్ట్‌పై ఇచ్చిన వివరణను విపక్షం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. పౌరసత్వ నిబంధనలపై, ముఖ్యంగా జాతీయ పౌర పట్టికకు సంబంధించిన ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టిస్తున్నదని ఆరోపిస్తుండటం గమనార్హం. ఈ వైఖరి దీర్ఘకాలంగా ఉన్న చట్టపరమైన వ్యాఖ్యానమే తప్ప, ఇటీవలి విధాన మార్పు కాదని ప్రభుత్వం అంటున్నది. చాలాదేశాల్లో పాస్‌పోర్ట్‌తో పాటు పౌరసత్వ కార్డు అనుబంధంగా ఇచ్చే ఆనవాయితీ ఉన్నది. అలాంటి నిబంధనను ప్రవేశపెడితే సమస్య సమసిపోతుంది. కచ్చితమైన పత్రాన్ని నిర్ధారించకపోవడం పౌరసత్వంపై తీవ్రమైన చర్చకు ఆజ్యం పోస్తూనే ఉంటుంది.