‘యోగి ఆదిత్యనాథ్ ప్రసంగం నన్ను కట్టిపడేసింది. ఎందుకంటే ఆయన ప్రసంగంలో తమది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకోవడమే ఇందుకు కారణం. అత్యంత ఆదర్శప్రాయమైన రాష్ర్టాలుగా ప్రచారం చేసుకుంటున్న వాళ్ల రాష్ర్టాల నుంచే అతిపెద్ద అవినీతి కథలు బయటకు వస్తున్నాయి. అవినీతి గురించి మాట్లాడటానికి ఈ వారమే చాలా సరైనదని అనుకొంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అవినీతి అనే పదాన్ని ఎన్నిసార్లు విన్నానంటే, ఆ మాట వింటేనే తల గిర్రున తిరిగిపోతున్నది.’
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బొద్దింకలు చేపట్టిన ఆందోళన నుంచి జరుగుతున్న వరుస పరిణామాలు చూద్దాం. తాజాగా అయోధ్య రామాలయ వ్యవహారాల్లో అక్రమాలు బయటపడ్డాయి. అలాగే ఉజ్జయినిలో బంధుప్రీతితో జరిగిన భూకుంభకోణంలో డబుల్ ఇంజిన్ ముఖ్యమంత్రి చిక్కుకున్నారు. వీటిన్నింటినీ చూస్తూ అవినీతిని విస్మరించడం కష్టంగా మారింది. అయితే ఈ సారి జాతీయ రాజకీయాల్లో అవినీతి అకస్మాత్తుగా ఏ విధంగా పెరిగిపోయిందోనని నేను ఆలోచిస్తుండగానే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ టీవీలో ప్రసంగిస్తూ కనిపించారు.
యోగి నవ్వుతూ ఏమంటున్నారంటే ‘యూపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ’ వల్లే రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలిచింది అన్నారు. కానీ అది జరుగలేదు. కానీ పదేండ్లుగా యోగి ఆదిత్యనాథ్ ఉక్కు హస్తంతో (చాలా బుల్డోజర్లతో) పాలిస్తున్నారు. కానీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉన్నచోటనే భారీ కుంభకోణాలు బయటపడుతున్నాయి. అందుకే యోగి ప్రసంగం నన్ను కట్టిపడేసింది.
బుల్డోజర్ బాబా ప్రత్యక్ష పర్యవేక్షణలో అయోధ్య రామాలయం నిర్మించారు. కానీ ఆ గుడిలో భక్తులు విశ్వాసంతో కానుకలుగా సమర్పించిన బంగారం, వెండి, విలువైన ఆభరణాలు, నగదు లూటీ అయిన సంగతి ఆయనకు తెలియకపోవడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఆలయంలో ఏం జరుగుతున్నదో నిధుల ధర్మకర్తలు గుర్తించకపోవడం కూడా అంతే అసాధారణమైన అంశం. ఆలయానికి వచ్చే కానుకలను లెక్కించేందుకు కచ్చితమైన విధానాలు అనుసరించాలని ఎప్పట్నుంచో వస్తున్న సూచనను ఎందుకు విస్మరించారో కూడా వారు వివరణ ఇవ్వాలి. వరుసగా వెలుగులోకి వస్తున్న విషయాలను పరిశీలిస్తే బాధ్యతారాహిత్యం అనేది నేరపూరిత స్థాయికి చేరిందని స్పష్టమవుతున్నది.
ఐదేండ్లుగా నీట్ పరీక్ష కారణంగా వంద మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవల నీట్ పరీక్ష రద్దయిన తర్వాత మనస్తాపం చెందిన మరో యువకుడు గతవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నిరుడు ఎక్కువ మంది విద్యార్థులు నీట్‌కు బలయ్యారు. నీట్ పరీక్ష నిర్వహణలో గందరగోళానికి కారణమైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేయడం సరైనదే. ఇదే డిమాండ్‌తో ఆ పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టింది. కానీ మంత్రి స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే మంత్రికి ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా గంభీరమైన రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాలు ఎంత తక్కువగా ఉన్నాయో దీన్నిబట్టి స్పష్టమవుతున్నది.
ప్రజాస్వామ్యంలో సేవకులైన పాలకుల నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయడం పౌరుల హక్కు. కానీ ప్రధాన సేవకుడిగా చెప్పుకొనే వ్యక్తి, తన మంత్రులు, ముఖ్యమంత్రుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా తన ఇమేజ్ ఏ మేరకు దెబ్బతింటున్నదో గుర్తించడంలేదు. ముంబయిలో చాలా బహిరంగంగా అవినీతి జరుగుతున్నదన్న సంగతి మోదీకి తెలుసా? అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మంత్రులు ఒబెరాయ్ హోటల్లో బస చేస్తున్నారు. వారి రేంజ్ రోవర్స్, ల్యాండ్ క్రూయిజర్స్, బీఎండబ్ల్యూ కార్లను రోజంతా అక్కడే పార్కింగ్ చేశారు. ఈ మొత్తం అంతటికీ ఖర్చు ఎవరు భరించాలి? మహారాష్ట్ర వంటి మరో డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలు మనం మర్చిపోకూడదు.
పన్నెండేండ్ల క్రితం మోదీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ నేను తినను… ఎవరినీ తిననివ్వను అని ప్రజలకు వాగ్దానం చేశారు. ఇక్కడ తినడం అంటే తినడం కాదు. తాను అవినీతికి పాల్పడి జేబులు నింపుకోనని, ఎవరూ అవినీతికి పాల్పడకుండా చూస్తానని ఆయన ఉద్దేశం. కాంగ్రెస్ పాలనలో విజృంభించిన అవినీతి పట్ల ప్రజలు అప్పటికే విసిగివేసారిపోయారు. మోదీ హామీ జనాలను ఆకట్టుకున్నది. ఆ మాటను నమ్మి బీజేపీకి అధికారం కట్టబెట్టారు. కానీ ఇప్పుడు అవినీతి నాయకులు పెద్దఎత్తున పెరిగిపోయారు. మోదీ ఎప్పుడో చెప్పిన మాటపై కట్టుబడి ఉంటారని ప్రజలు కూడా ఆశించడంలేదు.
ఏదైనా కొత్త అవినీతి, కుంభకోణం బయటపడ్డప్పుడు.. ఎవరైనా ప్రశ్నిస్తే బీజేపీ అధికార ప్రతినిధులు ఏమంటారంటే, ‘కాంగ్రెస్ హయాంలో ఇంతకంటే పెద్దఎత్తున అవినీతి జరిగింది’ అని చెప్తుంటారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే, కర్నాటకలో కూడా ముఖ్యమంత్రి వైదొలగాలని అంటుంటారు. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి ఆస్తులు కూడా అంతే మిస్టరీగా మారాయని సమర్థించుకుంటారు.
అసలు నిజం ఏంటంటే ఎవరైనా సులభంగా ధనవంతులు కావాలంటే రాజకీయాలకు మించిన మార్గం లేదు. అందుకే చాలామంది తామే అధికారంలో కొనసాగాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఇది కేవలం హిందుత్వ నేతలు అధికారం చేపట్టినప్పటి నుంచి మాత్రమే ఇలా లేదు. కానీ మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఏమైనా మార్పు తీసుకొస్తారని చాలామంది అనుకున్నారు. కానీ మోదీ ఆ పని చేయలేకపోవడం ఆయన వైఫల్యాల్లో ఒక స్పష్టమైన అంశం. గత వారం ఉజ్జయినిలో జరిగిన భూకుంభకోణం గురించి ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో కథనం ప్రచురితమైంది. కానీ జాతీయ స్థాయిలో ఇతర మీడియా మొత్తం ఈ స్థాయికి ఎదగకపోవడం బాధాకరం. మీడియా లొంగిపోయినట్టుగా వ్యవహరించడం గమనిస్తున్నాం.
(ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో)
-తవ్లీన్‌సింగ్