తెలంగాణ కొలిమి మళ్లీ అంటుకుంటున్నది. మళ్లీ నీళ్లలోంచే నిప్పు పుడుతున్నది. తమ ఒంటిపై నుంచే నదులు పారుతున్నా నోటికి నీళ్లందని తెలంగాణ భూముల ఎద బొగ్గుల కుంపటి వలె మారగా, దశాబ్దాల పాటు నిప్పులై రగిలిన ఆక్రందనలూ, ఆగ్రహాలూ 21వ శతాబ్దం తిరిగేసరికి పెను కొలిమి వలె అంటుకున్నాయి.యజ్ఞకుండంలో ‘సహేంద్ర తక్షకాయ స్వాహా’ పలికిన తెలంగాణ 2014 నాటికి స్వరాష్ర్టాన్ని సిద్ధింపజేసుకున్నది. జలరాశులను భూములపైకి మళ్లించుకున్నది.దశాబ్ద కాలం గడిచిన తర్వాత ఇప్పుడు కొత్త తక్షకులు పుట్టుకొస్తున్నారు. యజ్ఞకుండం మరొకమారు మండవలసి ఉన్నది.
పుట్టుకొస్తున్న నిప్పు లక్ష్యం ఈసారి నీళ్లు మాత్రమే కాదు. ఈ నేల తనను తాను పదేండ్ల పాటు పాలించుకొని అనేక లక్ష్యాలను సిద్ధింపజేసుకున్న తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వపు దారితెన్నులేని పాలన ఫలితంగా వెనుకటి అజెండాను సవరించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అందులో తిరిగి మొదటి అంశం నీళ్లే అవుతున్నది. ఇంకా మిగిలిన నీటిని ఇంటి ద్రోహుల సాయంతో పొరుగు దొంగలు తరలించుకుపోవడం. అదే సమయంలో, పదేండ్లలో సిద్ధింపజేసుకున్న లక్ష్యా లు అనేకం కాంగ్రెస్ పాలనలో తిరుగుముఖం పడుతున్నందున, వాటి పరిరక్షణ కూడా ‘తిరిగి అంటుకుంటున్న కొలిమి’ అజెండాలోకి రావలసి ఉంది. ఇక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు పోగుపడుతున్న ప్రజల నిరసనల రాక్షసి బొగ్గు తక్కువేమీ కాదు. ఆ విధంగా ఈ మూడూ కలియగా ఈ రోజున తెలంగాణ కొలిమి మళ్లీ అంటుకుంటున్నది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హనీమూన్ అన్నివిధాలా ముగిసిపోయింది. సంప్రదాయిక అర్థంలో హనీమూన్ కాలం మూడు నెలలు, లేదా వంద రోజులు. కానీ, ప్రజలు కోరకుండానే కాంగ్రెస్ తనకు తాను కొన్ని గడువులు ప్రకటించింది. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీపై సంతకం, 100 రోజులలో ఆరు గ్యారెంటీల అమలు, మొదటి సంవత్సరంలోనే యువతీ యువకులకు రెండు లక్షల ప్రభుత్వోద్యోగాలు, మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి, సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి, ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోపు కులగణన. ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో, సంక్షే మ పథకాల్లో మైనారిటీలతో సహా అన్ని వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు. కాంగ్రెస్ పార్టీ 42 పేజీల మ్యానిఫెస్టోలో ఇంకా అనేక హామీలున్నా యి గాని, వారు తమంతట తాముగా గడువులు ప్రకటించినవి మాత్రమే ఇక్కడ పేర్కొంటున్నాం.
తాము హామీ ఇచ్చి అమలుచేయని వాటి పట్ల కనిపిస్తున్నది అసంతృప్తి కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుపరచటం, లేదా కుదించటం ప్రజలకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నది. హామీ ఇచ్చి అమలు జరపని వాటి జాబితా తర్వాత చూద్దాము. అది, గడువులు దాటిపోయిన హామీల మాట. వాటిని తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ ప్రత్యేకంగా అంటున్నది బీఆర్ఎస్ పథకాల కుదింపు లేదా రద్దుల గురించి.
దళితబంధు. దళితులను తమ కాళ్లపై తాము నిలబడేట్టు చేసేందుకు ఉద్దేశించిన ఈ పథకం కింద కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున గ్రాంట్‌గా ఇవ్వటం మొదలుపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఒకేసారి ఇచ్చేంత డబ్బు బడ్జెట్లో ఉండదు గనుక, ప్రతి సంవత్సరం కొన్ని వేల కుటుంబాల చొప్పున ఇస్తూ పోగలమని ప్రకటించింది. ఇటువంటి పథకం దేశ చరిత్రలో ఇదే మొదటిది కావటం, ఆ తర్వాత కూడా ఎక్కడా ఆరంభించకపోవటంతో దేశ, విదేశాలలో ప్రశంసలు పొందింది. లబ్ధి పొందిన దళిత కుటుంబాల ఆర్థిక పరిస్థితి, జీవితాలు అనూహ్యంగా మారాయి. అది గ్రహించిన కాంగ్రెస్ పార్టీ దళిత వర్గాలను ఆకర్షించేందుకు తాము కేసీఆర్ ఇచ్చిన రూ.10 లక్షలకు మించి రూ.12 లక్షలు ఇవ్వగలమని ఆశ చూపింది. కానీ, గత రెండేండ్లలో కనీసం ఒక్క కుటుంబానికి కూడా ఇవ్వలేదు. కొత్త రూ.12 లక్షలు కాదు గదా, పాత రూ.10 లక్షలూ ఇవ్వలేదు. ఆ విషయమై ప్రశ్నలకు కూడా జవాబు లేదు. ఆ విధంగా ఆ పథకం నిలిచిపోయింది. బీసీ బంధు పరిస్థితి కూడా అంతే అయింది. బీసీలలోని ఒక ముఖ్య వర్గమైన యాదవులకు గొర్రెల పంపిణీ పథకం అర్ధాంతరంగా ఆగిపోయింది.
సామాజిక బలహీన వర్గాల పరిస్థితి ఇది కాగా, మరొకవిధంగా బలహీన తరగతి అని పరిగణించే మహిళలు, వారి సంతానం పరిస్థితి కేసీఆర్ పాలనలో ఏ విధంగా ఉండేదో, కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత ఏమైందో గమనించండి. గతంలో ఉండిన కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీం గురించి కొత్తగా చెప్పవలసింది లేదు. సుమారు 44 లక్షల మంది మహిళలు, పిల్లలకు లబ్ధి కలిగించిన ఈ పథకాల వల్ల, ఆ వర్గాలకు, వారి కుటుంబాలకు , పిల్లల చదువులకు కలిగిన మేలు అపారమైనది. ఐక్యరాజ్యసమితి మిలీనియం గోల్స్ లక్ష్యాల ప్రకారం చూసినా, మానవాభివృద్ధి సూచీ కొలమానాలను బట్టి అయినా మహిళలు, పిల్లలు, చదువులు, మాతాశిశు మరణాలు, ఆకలి నిర్మూలన, పోషకాహార లభ్యత, పేదరికం నిర్మూలన వంటి పలు లక్ష్యాల సాధనలో ఈ పథకాల పాత్ర ఉన్నది.
మొత్తం సంక్షేమ పథకాలన్నింటిలో వీటికి మించినవి లేవంటే అతిశయోక్తి కాబోదు. అందువల్లనే వీటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయులలో అంతటి గుర్తింపు లభించింది. అటువంటి గొప్ప పథకాలకు రేవంత్ ప్రభుత్వం ఉద్వాసన పలికింది. తల్లుల కోసం గత ప్రభుత్వం పై పథకాలకు మించి కూడా కొన్ని చేసింది. గర్భిణులకు ఇంటివద్ద పరీక్షలు, ఆస్పత్రికి వాహన ప్రయాణాలు, ఉచిత మందులు, సిజేరియన్ల బాధను విరగడ చేస్తూ ప్రభుత్వ ఆస్పత్రులలో సహజ ప్రసవాల వంటివి. వీటన్నింటి మేలు ఏమిటో ఆ మహిళలే చెప్పగలరు. ఇకపోతే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లు. వీటిని కొత్త ప్రభుత్వం ఆపనైతే లేదు గాని, తులం బంగారం కూడా ఇస్తామని ఆశచూపి వారి ఓట్లు సంపాదించి మోసగించారు. ఇస్తాము ఇస్తామని కొన్నాళ్లు ఆశచూపి, ధర పెరిగింది గనుక ఇవ్వలేమని ఇప్పుడంటున్నారు. ఈ పథకాలలో అనేకం బీఆర్ఎస్ తన మ్యానిఫెస్టోలో ముందుగా ప్రకటించకుండానే అమలుపరిచిందన్నది గమనార్హం.
మ్యానిఫెస్టోలోని హామీలన్నింటికీ గడువులు పెట్టలేదని, తమ పాలనకు ఇంకా మూడేండ్లున్నాయని, ఆ లోగా అమలుపరచగలమని ఇటీవల అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఆ మాటకు విలువ ఇచ్చి వదిలివేయవచ్చు. కానీ, పైన పేర్కొన్నట్టు గడువులు పెట్టుకున్న వాటి మాటేమిటి? అవే 18 వరకున్నాయి. అవి రెండేండ్లు గడిచినా అమలు కానప్పుడు తక్కినవి చేయగలరని నమ్మగలమా? పైన చెప్పుకున్నట్టు ఈ విధంగా గడువులు, గ్యారెంటీలు అని అమలుచేయనివి ఒక వైపు, కేసీఆర్ ప్రభుత్వం అమలుపరచగా ఆపివేసినవి మరొకవైపు, జల వనరులు, ప్రాజెక్టుల విషయమై తెలంగాణ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయటం, పథకాల నిర్మాణంలో తాత్సారం, అది చాలదన్నట్టు చంద్రబాబు పాలించే రాష్ర్టానికి అనుకూలంగా వ్యవహరిస్తుండటం అనే మూడింటి ప్రభావంతో తెలంగాణ రాజుకుంటూ వస్తున్నది. ఇవిగాక అసమర్థ పాలన, భూమి కబ్జాలు, పేదల ఇండ్ల కూల్చివేతలు, విచ్చలవిడి అవినీతి, తాజాగా చెక్‌డ్యాం పేల్చివేతల వంటి ఇతర విషయాల జాబితా సుదీర్ఘమైనది.
ఈ విధంగా రాజుకుంటూ వస్తున్న కొలిమి ఒక్కసారిగా భగ్గున మండిన ముహూర్తం ఈ నెల 21న కేసీఆర్ బయటకు రావటంతో వచ్చింది. ప్రభుత్వ వరుస వైఫల్యాలను, ప్రజల కడగండ్లను రెండేండ్ల కాలం గమనించిన ఆయన, సరైన అంశాలనే ప్రస్తావించటంతో బీఆర్ఎస్ పార్టీలోనే గాక మొత్తం తెలంగాణ ప్రజలలో ఒక్కసారిగా ఉత్తే జం కలిగింది. ఆయన నొక్కిచెప్పిన ప్రధానాంశం పాలమూరు-రంగారెడ్డి జల పథకం కాగా, దాని తో పాటు తెలంగాణ చిరకాల శత్రువు చంద్రబాబు తన పాత శిష్యుడు రేవంత్‌ను కీలుబొమ్మ గా మార్చుకొని సాగిస్తున్న కుయుక్తులను స్పష్టం గా బహిర్గతపరిచారు. తెలంగాణ జీవధార అయి, ఉద్యమ కాలమంతా ప్రధాన నినాదంగా ప్రజలను కదిలించిన నీరు, ఇతర రైతు సంబంధిత, గ్రామీణ సంబంధిత అంశాలు అగ్రభాగాన నిలువగా, వీరువారని గాక ప్రతి ఒక్క సామాజిక తరగతి కాంగ్రెస్ హామీలతో మోసపోయిన స్థితిలో, అంటుకుంటున్న కొలిమి తిరిగి ఒకప్పటి వలె తాళ ప్రమాణంలో మండక తప్పదు.
-టంకశాల అశోక్