రాష్ట్ర సంపద పెంచి ప్రజలకు పంచిన పాలన పోయింది. సంపద పెంచలేక చతికిలబడిన పాలన వచ్చింది. పదేండ్ల అభివృద్ధి గతవైభవమైపోయి, అప్పులతో పూట గడిపే స్థాయికి రాష్ట్రం దిగజారింది. ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి అప్పు చేసేందుకు అనుమతించాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి పైరవీలు చేసుకోవడం మనం చూస్తున్నాం. రాష్ట్ర ఆదాయం ఇక పెరిగేందుకు అవకాశాలు లేవని ఆయన చెప్పకనే చెప్తున్నారు. ఓ వైపు ఇలా అప్పుచేసి పప్పుకూడు విధానం అనుసరిస్తూనే మరోవైపు అట్టహాసపు కార్యక్రమాలు చేపట్టి ఆర్భాటం చేస్తున్నారు.
అందులో మనకు ముఖ్యంగా కనిపించేవి ఫుట్‌బాల్ సంబురం, తెలంగాణ రైజింగ్ సమ్మిట్. ఓ వైపు అన్నదాతలు యూరియా దొరుకక, రుణవిముక్తి కాక, రైతుభరోసా అందక నానా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పింఛన్లు పెరగలేదు. కల్యాణలక్ష్మి కదలడం లేదు. మరోవైపు ఉద్యోగాల హమీపై కాంగ్రెస్ సర్కారును యువత నిలదీస్తున్నది. జీతాల పెరుగుదలకు ఉద్యోగులు, బెనిఫిట్స్ కోసం పదవీ విరమణ చేసి న ఉద్యోగులు పోరుబాట పడుతున్నారు. మ బ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్న చందాన తయారైంది తెలంగాణ ప్రజల పరిస్థితి. కడుపులో పెట్టుకుని కాపాడే నేత పోయి కడుపుమంటతో రగిలిపోయే నేత పాలనలో సమస్యలు రోజురోజుకూ వెల్లువెత్తుతున్నాయి. ఈ సమస్యల నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడలకు సీఎం రేవంత్ పాల్పడుతున్నారని పైకి తెలిసిపోతూనే ఉన్నది. మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు సమస్యలను గాలికి వదిలేసి సరదాలు తీర్చుకుంటున్నారు సీఎం రేవంత్. సాకర్ దిగ్గజం లయనెల్ మెస్సీతో ఫుట్‌బాల్ ఆట పేరిట ఖర్చుచేసిన రూ.100 కోట్ల ప్రజాధనంతో సాధించిందేమిటి అనే ప్రశ్నకు సమాధానం దొరకదు. ఆ సొమ్మును గ్రామీణ ప్రాంతా ల్లో క్రీడల ప్రోత్సాహానికి ఖర్చుచేస్తే పుణ్యం పురుషార్థం దక్కేవనడంలో సందేహం లేదు.
బీఆర్ఎస్ హయాంలో ఈ ఫార్ములా రేస్ నిర్వహణపై కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా సీఎం రేవంత్ నానాయాగీ చేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. అదొక ప్రతిష్ఠాత్మకమైన పబ్లిక్ ఈవెంట్. పైగా అది రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వాహన తయారీరంగానికి ఊతం ఇచ్చే సదాశయంతో నిర్వహించిన కార్యక్రమం. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా ఆ ఈవెంట్‌పై అడ్డగోలుగా ఆరోపణలు చేసింది కాంగ్రెస్ నాయకత్వం. అధికారం చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ ఆ ఈవెంట్లో ఏదో జరిగిపోయినట్టు గాయి గాయి చేయడం తెలిసిందే. అది హైదరాబాద్ నగరాన్ని ఫార్ములా ఈ-రేస్ మ్యాపులో నిలిపి, గౌరవాన్ని ఇనుమడింపజేసిన కార్యక్రమం. పైగా ఆ ఈవెంట్ వల్ల రాష్ర్టానికి రూ.700 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. మరి ఫుట్‌బాల్ ఈవెంట్ ఏ తరహా కిందికి వస్తుంది? కొన్ని నిమిషాల సీఎం సొంత సరదా కోసం వందకోట్లు నీళ్లల్లో పొయ్యడం ఏమిటి? పార్ములా రేస్ కంపెనీకి చెల్లింపుల గురించి అవాకులు చెవాకులు పేలినవారికి ఇది దండగమారి ఖర్చుగా కనిపించడం లేదా? పరిపాలన గాలికి వదిలేసి నిమిషం పాటు బంతాట ఆడేందుకు చేసిన ఖర్చుకు అసలు లెక్కాపత్రం ఉన్నదా? ప్రజలకు వివరించాల్సి ఉన్నది.
ఇక తెలంగాణ రైజింగ్ పేరిట నిర్వహించిన తమాషా గురించి ఎంత తక్కువగా చెప్పుకొంటే అంత మంచిది. చెట్టు పేరు చెప్పుకొని కాయ లమ్ముకున్నట్టు ఉజ్వల తెలంగాణ పేరుతో ఉత్తుత్తి సమ్మిట్ నిర్వహించారు. ఫార్మా భూము ల్లో ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ దందాకు తెరతీశారు. ఆ టెంట్లతోపాటే వందకోట్ల ప్రజాధ నం గాలికి ఎగిరిపోయింది. అక్కడ నేల మీద కొత్త తెలంగాణ తల్లి విగ్రహం పడి ఉన్న తీరు సీఎం రేవంత్ అస్తిత్వ సోయికి అద్దం పట్టింది. తెలంగాణ వాదులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలం?