ఈ తర్వాతి రెండు వ్యాసాలలో తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాలు 1952-1956 మధ్య ఎలా ఉండేవో తెలుసుకుందాం. అంటే కర్నూలులో రాజధాని ఏర్పర్చుకున్న ఆంధ్ర రాష్ట్ర నాయకులు తమ రాష్ర్టాన్ని ఎలా పాలించారు? ‘హైదరాబాద్ నగరం మీద దురాశతో విశాలాంధ్ర’ అని నినాదాన్ని పుట్టించి తమ ప్రజలను ఎందుకు వంచించారు’ అన్నది తెలుసుకోవటం చాలా ముఖ్యం. 1952 అక్టోబర్ నుంచి నెహ్రూ విశాలాంధ్రకు ఒప్పుకునేదాకా ఆంధ్ర రాష్ట్ర దుస్థితి, ఆంధ్ర రాజకీయ నాయకులు వాళ్ళ రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తించారో చూద్దాం!
ఆంధ్ర పాలకుల కథ; తెలంగాణ వ్యథ-5 తెలివి కొద్దిగా కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా 39 ఏండ్లు (1914-1952) ఉద్యమం చేసినప్పుడు తమ రాష్ట్రం మీద ప్రేమతో దాని భౌగోళిక స్వరూపం, వనరులు, వ్యవసాయం, విద్య, వైద్యం మొదలైనవి రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తాడు. కేసీఆర్ 2000లో ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి గంటల తరబడి జయశంకర్ గారితో చర్చలు, వివిధ రంగాల గురించిన సమాచారం, వీటిని ఎలా అభివృద్ధి పథంలో నడపాలన్న విషయాలు ఇతర మేధావులతో మథనం సాగించారు. అంతేకాదు, సైకిల్ మీద వీరమల్ల ప్రకాశ్ లాంటి నిబద్ధత కలిగిన తెలంగాణ ప్రేమికులతో పాటు గోదావరి, కృష్ణా నదులు పుట్టిన నాసిక్‌లో త్రయంబకం నుంచి (మహారాష్ట్ర) పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం (ఆంధ్ర)లో సముద్రంలో కలిసేదాకా గోదావరి వెంట ప్రయాణించి ప్రతి ఉపనది గురించి, అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఇక కృష్ణానది పుట్టిన మహాబలేశ్వర్ (మహారాష్ట్ర) నుంచి ఆంధ్రలోని హంసల దీవి దగ్గర సముద్రంలో కలిసేదాకా ఆ నదీ ప్రవాహం, ఉపనదుల సమాచారం క్షుణ్ణంగా తెలుసుకున్నారు.
అంతేకాదు, తెలంగాణలో విద్యారంగం తదితర అన్నిరంగాలలోని మేధావులను పిలిచి తెలంగాణ భవన్లో సమావేశాలు జరిపారు. రాష్ట్రం తప్పక సాధిస్తానన్న నమ్మకం, ఆ తర్వాత దానిని ఎలా బాగుచేయాలన్న తపన ఉన్న నాయకుడు మేధావి, మాతృభూమి ప్రేమికుడైతే అలాగే చేస్తారు. మరి ఆంధ్ర నాయకులు ఎలా ప్రవర్తించారు? 1927లోనే ఆంధ్ర ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని మద్రాసు శాసనసభ తీర్మానం చేస్తే, మద్రాసు తమకే కావాలన్న దురాశతో దాని పట్ల ఉత్సాహం చూపలేదు. ఇది మొదటి తప్పు. ఇక 1950లో రాష్ట్ర ఏర్పాటు చేసుకోండని చెప్తే తనకు ముఖ్యమంత్రి పదవి రాదని ఆంధ్రులు గొప్పగా పొగుడుకునే టంగుటూరి ప్రకాశం మద్రాసు లేకుండా రాష్ట్రం వద్దని తన స్వార్థంతో ఆ ప్రతిపాదన ఎత్తగొట్టాడు. ఇది రెండవ తప్పు. ఇక 1952లో శ్రీరాములు వ్యర్థ త్యాగం తర్వాత తానే ముఖ్యమంత్రిగా మద్రాసు లేని ఆంధ్ర రాష్ర్టాన్నే ఒప్పుకొని పదవిని పొందాడు ప్రకాశం. అదీ ఆయన ప్రేమ ఆంధ్ర ప్రజల మీద.
ఇక ఆయన నేతృత్వంలోనూ, తర్వాత అప్పటి రాజకీయ నాయకులు తమ రాష్ర్టాన్ని ఎంతపైకి తెచ్చారో చూద్దాం! రాజధాని దుస్థితి, ఇంకా రాష్ట్రం ఏర్పడకుండానే ఆ నాయకులు ఏం మాట్లాడారో చూద్దాం!‘ఆంధ్రలో జిల్లా ఆఫీసులు కట్టడానికే సరైన స్థలాలు లేవు. ఇక రాజధాని, దానిలో ఆఫీసులకు సరైన స్థలాలు ఎక్కడ దొరుకుతాయి?’ (ఆంధ్రపత్రిక 13.3.1954) అని కడప కోటిరెడ్డి అన్నారు. ‘మన సమస్యలన్నీ హైదరాబాద్‌ను రాజధానిగా సంపాదిస్తే తీరుతాయి. కానీ, ఆ నగరాన్ని మనం ఎట్లా సంపాదించుకోగలం? తెలివిగా, ఎట్లా అయినా దాన్ని సాధించటానికి నడుం కట్టాలి’ అని (ఆంధ్ర పత్రిక 2.6.1954) టంగుటూరి ప్రకాశం అన్నాడు. అంటే వాళ్ల రాష్ట్రం ఏర్పడుతుందనగానే పక్క చూపులు మొదలయ్యాయి అన్నమాట. అప్పటిదాకా రెండు దేశాలలో ఉన్న రాష్ర్టాలు ఎలా కలుస్తాయన్న సోయి లేకుండా, తమ కుట్రలు మొదలుపెట్టేశారు ఆంధ్రా రాజకీయ నాయకులు.
అప్పటిదాకా 1948 సెప్టెంబర్ నుంచి మొదట జనరల్ చౌధురీ పాలన, తర్వాత వెల్లోడి పాలనలో అష్టకష్టాలు అనుభవించి మార్చి 1952లో ఎన్నికల అనంతరం స్థానికులతో ప్రజా పాలన మొదలైంది కదా అని సంతోషిస్తూ, కుదుటపడటానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ రాష్ట్రం తమ మీద తెరవెనుక జరుగుతున్న కుట్రలు తెలియకుండానే కేవలం మూడు నెలలు మాత్రం ప్రశాంతంగా బతికారు. 1953, అక్టోబర్‌లో తమ రాష్ట్రం ఏర్పడకుండానే ఆంధ్ర నాయకులు విశాలాంధ్ర భజన మొదలుపెట్టారు. ఇక 1953 నుంచి 1956 దాకా వారి ఆర్థిక పరిస్థితి గమనిస్తే తమ రాష్ట్రం పట్ల వారి ఉదాసీనత, అభివృద్ధి చేయాలన్న పట్టింపు ఏ కోశానా లేకపోవడం, ప్రజల పట్ల బాధ్యతారాహిత్యం, అభివృద్ధి చేసే తెలివి లేశమైనా లేకపోవడం వారు కేవలం పదవీ కాంక్ష ఉన్న నాయకులుగా తేటతెల్లమైంది. ఉద్యమం అంటూ 150 ఏండ్లు కలిసి ఉన్నవారిని విమర్శించి విడిపోయిన ఈ అసమర్థ నాయకుల బికారి మాటలు చూడండి. నిండు సభలో వీరు మాట్లాడుకున్నవి ఈ విధంగా ఉన్నాయి.
‘ఉపాధ్యాయులకు నెలవారీ జీతాలివ్వడం కూడా కష్టతరమైపోతోంది.’ (బెజవాడ గోపాలరెడ్డి, 1.10.1954). ‘22 కోట్ల ఆదాయంలో 20 కోట్లు పాలనా ఖర్చుకే పోతున్నాయి.’ (బెజవాడ గోపాలరెడ్డి, 15.9.1954). ‘మనం 18 కోట్ల లోటుబడ్జెట్‌తో రాష్ర్టాన్ని ఈడుస్తున్నాం. ఉద్యోగుల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, కేంద్ర ప్రభుత్వ దయతో మనలను ఆదుకుంటే తప్ప! (నీలం సంజీవరెడ్డి, 5.11.1954). ‘ఎక్కడికెళ్లినా రైతులు నీళ్ల వసతి, కరెంటు కావాలని అడుగుతున్నారు. ఎక్కడినుంచి వాటిని తీసుకురావాలి? తెలియటం లేదు’ (25.2.1954 సంజీవ రెడ్డి). ‘రాష్ట్రం ఏర్పడిన రోజే 6 కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడేం చేయాలి?’ (25.1.1956, సంజీవరెడ్డి) ఈ రాష్ట్రం ఏర్పడకముందే మద్రాసు ఆర్థికమంత్రి ఆంధ్ర ప్రాంత నాయకుల అసమర్థత బయటపెట్టాడు. ‘ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే అమ్మకపు పన్ను (సేల్స్ టాక్స్) ఆదాయం అతి తక్కువ. అసలు ఆదాయం అనక్కరలేదు’. (భక్త వత్సలం, ఆర్థికమంత్రి మద్రాసు శాసనసభలో 31.1.1954). ఇక ఈ నాయకుల అసమర్థ పాలనలో పారిశ్రామిక రంగం ఎలా ఉండిందో చూద్దాం, అదీ ఆ నాయకుల మాటల్లోనే! ‘ఇతర దక్షిణాది రాష్ర్టాలతో పోలిస్తే మన రాష్ట్రంలో విద్యుచ్ఛక్తి చాలా తక్కువ. ఈ కారణంతో ఏ పరిశ్రమ స్థాపించటానికి వీలుపడదు’. (నీలం సంజీవరెడ్డి, ఆంధ్రపత్రిక, 7.10.1954) ‘ఆంధ్ర రాష్ట్రంలో బొగ్గు, నూనె లేవు. విద్యుచ్ఛక్తి చాలా ఖరీదుగా ఉంది. (బెజవాడ గోపాలరెడ్డి ఆంధ్రపత్రిక 7.10.1954) ‘ఆంధ్రలో పరిశ్రమలనేవే లేవు’. (ఆంధ్ర కామర్స్ ఛాంబర్స్ ఆంధ్రపత్రిక 20.1.1954)
మళ్లీ పక్క రాష్ట్రం మీద ఏడుపు: ‘తెలంగాణలో చాలా నమోదిత (రిజిష్టర్డ్) పరిశ్రమలున్నాయి’ (పీవీజీ రాజు, 28.11.1955 ఆంధ్రపత్రిక) తనకు లేదని ఏడిస్తే ఒక కన్ను పోయిందట, పక్కవాడికి ఉందని ఏడిస్తే రెండో కన్ను పోయిందని సామెత. ఇక రజాకార్ల విధ్వం సం, 1947 నుంచి మిలిటరీ పాలన, ఆంధ్ర వలస పాలకుల పాలనలో 2014 దాకా 67 ఏండ్లు అత్యంత అమానవీయ విధ్వంసం చెందిన తెలంగాణ ఒక మాతృభూమి భక్తుడు, ప్రజల పట్ల ఆదరం, గౌరవం ఉన్నవాడు, కేవలం మాటలు చెప్పడం కాకుండా అత్యద్భుతంగా, ఆలోచించగలిగిన మేధ, ప్రణాళికలు వేయగలిగిన ప్రజ్ఞ, వాటిని అమలుపరచగలిగిన ప్రతిభ, ధైర్యం ఉన్న ఉద్యమ నాయకుడు, మేధావి, నిబద్ధత కలిగినవాడైతే ఈ విధ్వంస రాష్ర్టాన్ని ఎట్లా తీర్చిదిద్దగలడో చూద్దాం! అన్నిరంగాల మీద పట్టు సాధించిన నాయకుడి పాలనలో రాష్ట్రం పదేండ్లలో సాధించిన విజయాలివి. పేదరిక నిర్మూలన జాతీయ స్కోరు 72, తెలంగాణ స్కోరు 91 శాతం, విద్యుత్తు సరఫరా జాతీయ స్కోరు 96, తెలంగాణ స్కోరు 100 శాతం, ఆర్థికాభివృద్ధి జాతీయ స్కోరు 68, తెలంగాణ స్కోరు 84 శాతం, శుద్ధమైన తాగునీరు జాతీయ స్కోరు 89, తెలంగాణ స్కోరు 90, నగరీకరణ జాతీయ స్కోరు 83, తెలంగాణ స్కోరు 86, అసమానతల తొలగింపు జాతీయ స్కోరు 65, తెలంగాణ స్కోరు 65, నాణ్యమైన విద్య జాతీయ స్కోరు 61, తెలంగాణ స్కోరు 64, ఆకలి బాధల తగ్గుదల జాతీయ స్కోరు 52, తెలంగాణ స్కోరు 58.
ఇక పేదరికం, ఆకలి సమస్యలు, ఆరోగ్యం, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, శుద్ధమైన తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్తు
సరఫరా, ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణ, నగరీకరణ మొదలైన 13 అంశాలలో నీతి ఆయోగ్ నివేదికలో 12 అంశాలలో తెలంగాణ అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది. వ్యవసాయరంగంలో అయితే దేశంలోనే మొదటి స్థానం దక్కించుకుంది తెలంగాణ.
పాతకాలంలోని నాయకులను వదిలేసినా, హైదరాబాదంతా తానే నిర్మించి ప్రపంచంలో ఈ నగరాన్ని నిలిపానని డప్పు కొట్టుకునే ఇప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి అప్పటి ఐదేండ్లు, ఇప్పుడు ఏడాది-ఆరేండ్లలో అమరావతిలో శాసనసభా భవనం, మండలి భవనం, కోర్టు నిర్మించాడా? క్వాంటమ్ వ్యాలీకి 44 వేల ఎకరాలు అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి 14 వేల ఎకరాలు కావాలన్నది ప్రజాహితమా? నాయకుల దురాశా? ప్రపంచంలో అతి పెద్దదైన హైదరాబాద్ విమానాశ్రయం 5,500 ఎకరాలలో ఉండగా 14,000 ఎకరాలు ఎందుకు? అనుయాయులకా? ఇప్పటికైనా తోటి ఆంధ్ర ప్రజలు మేల్కొని వారి నాయకుల స్వార్థం, అవినీతి అర్థం చేసుకోవాలి. లేకపోతే 1953లో ఏర్పడినవారి రాష్ర్టానికి ఈ 72 ఏండ్లు కాదు, ఇంకో 172 ఏండ్లు గడిచినా రాజధాని ఉండదు. జాగ్రత్త వహించండి!
-కనకదుర్గ దంటు
89772 43484