జనతా పార్టీ ప్రభుత్వ పతనానంతరం 1983లో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కన్యాకుమారి నుంచి రాజ్‌ఘాట్ వరకు భారత యాత్ర పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేసిన అనంతరం ఈ దేశ పరిస్థితి మీద చేసిన వ్యాఖ్య ఇది. ఇదేదో అలవోకగా ఊసుపోక చెప్పిన మాట కాదు. ఆరు నెలలకు పైగా సుదీర్ఘకాలం సుమారు 5 వేల కిలోమీటర్ల పొడవునా కొండలు, కోనలు, వాగులు, వంకలు, నదులు, దుర్గమారణ్యాలు దాటుతూ పాతిక ఇండ్లు కూడా లేని కుగ్రామాల నుంచి కాంక్రీట్ జంగిల్ వంటి మహా నగరాల దాక వందలాది గ్రామాలు, పట్టణాలు, నగరాలు, ఆవాసాలు అన్నీ సందర్శించి.. అక్కడి పరిస్థితులు పరిశీలించి ఆకళింపు చేసుకొని ఆ అనుభవంతో చెప్పిన మాటలివి.
Telangana | చంద్రశేఖర్ పర్యటన పొడవునా ఆకలి తాళలేక విషపు గడ్డలు తింటున్న వైనాలు, గుక్కెడు మంచి నీటికోసం కిలోమీటర్ల కొద్దీ కడవల మీద కడవలు పెట్టుకొని మహిళలు నడిచి వెళ్తున్న దృశ్యాలు.. పశువులు కొనలేక రైతు కుటుంబ సభ్యులే నాగలి లాగుతున్న ఘటనలు.. ఒక్కరంటే ఒక్కరు కూడా అక్షరాస్యుల్లేని గ్రామాలు… రహదారులు, మరుగుదొడ్లు, పాఠశాలల్లేని పల్లెలు.. ఇలా ఎన్నెన్నో బాధలు ఆయన చూశారు. అదే సమయంలో నిరక్షరాస్యులైన ప్రజలు కూడా వార్తలు వినడానికి గ్రామ పంచాయతీ రేడియో మైకుల ముందు గుమిగూడిన చైతన్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. ఆ రోజుల్లో ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలోని రేడియోలో వార్తలను ప్రజలంతా వినగలిగేలా బయట మైకు పెట్టి ప్రసారం చేసేవారు.
స్వాతంత్య్రం వచ్చి అప్పటికి నలభై ఏండ్లు. అయినా దేశ పరిస్థితిలో పెద్ద మార్పు లేదు. దారిద్య్రం, నిరక్షరాస్యత, ఆకలికేకలు, వలసలు… అన్నీ అప్పటిదాకా కేంద్రాన్ని ఏలిన జాతీయపార్టీలు దేశానికి వారసత్వంగా అందించిన కానుకలు! అప్పుడే కాదు… ఇప్పటికీ పరిస్థితి ఏమీ మారలేదు. దారిద్య్ర సాగరం వంటి ఈ దేశంలోని ప్రజల దుర్భర పేదరికాన్ని.. అవసరాలను.. అమాయకత్వాన్ని ఎన్నికల్లో నిస్సిగ్గుగా వాడేసుకొని కల్లబొల్లి హామీలిచ్చి ఆ తర్వాత కాడి పారేయడంలో అన్నింటికన్ని పార్టీలు ఆరితేరాయి.
ప్రజల అమాయకత్వం పెట్టుబడిగా దొంగ హామీల రాజకీయాలను నడపడంలో కాంగ్రెస్ ఆరితేరితే… మతాన్ని ఆలంబనగా చేసుకొని రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టడంలో నాలుగాకులు ఎక్కువే చదివిన పార్టీ బీజేపీ. దేశమంతా కొట్టుకునే ఈ రెండు పార్టీలు తెలంగాణ రాజకీయాల్లో మాత్రం చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ను దెబ్బ కొట్టడం అనే ఏకైక లక్ష్యంతో రాజకీయ సహజీవనం చేస్తున్నాయి. కాంగ్రెస్ కాలికి ముల్లు గుచ్చితే బీజేపీ కంట నీరుబుకుతుంటే.. బీజేపీ కాలికి దెబ్బ తాకితే కాంగ్రెస్ నొప్పితో బాధపడుతున్నది. ప్రతి వ్యవహారంలోనూ చీకటి రాత్రి షేక్‌హ్యాండ్ రాజకీయాలే.
తాజాగా Formula E race caseలో ఈ బంధం పట్టపగలు నగ్నంగా బయటపడింది. అసలు అవినీతికి ఆస్కారమే లేని అంశంలో రాష్ట్రం ఏసీబీ కేసు పెడితే.. ఆ వెంటనే కేంద్రం ఈడీ కేసు పెట్టడమే దీనికి ప్రబల సాక్ష్యం. అంతేకాదు, ఏదో జరిగిపోయినట్టు కాంగ్రెస్ కథలల్లి మీడియాలో వెదజల్లుతుంటే.. బీజేపీ నాయకులు అరెస్టు చేయాలని జైల్లో పెట్టాలని దానికి తాలింపు వేస్తున్నారు. కాంగ్రెస్ కక్షసాధింపు చర్యలకు దిగుతుంటే వెనకుండి బీజేపీ సహకరిస్తున్నది. వాస్తవానికి ప్రజల మేలు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం లేదా మంత్రులు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి నిర్ణయం క్యాబినెట్ తీర్మానం జరిగాకే చేయాలంటే కుదరదు. కొన్ని అంశాల్లో తక్షణమే స్పందించాల్సి ఉంటుంది. ముందు నిర్ణయం తీసుకొని తర్వాత క్యాబినెట్లో ఆమోదింపజేసుకోవడం అనేది ఒక సంప్రదాయంగా వస్తున్నది. ఫార్ములా రేసులో కూడా తక్షణ స్పందన అవసరం కాబట్టే రాష్ర్టానికి మేలు జరిగే నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వచ్చే ప్రభుత్వం క్యాబినెట్ దాన్ని ఆమోదించుకుంటుంది. ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అంతకుముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకుపోవాలి. అది పక్కనబెట్టి కక్ష సాధింపు చర్యలకు దిగడం అనైతికం. ఇదే పద్ధతిలో రేపు రాఫెల్ కొనుగోళ్ల విషయంలో ఇంకో ప్రభుత్వం వచ్చి దాన్ని తిరగదోడి విచారణ జరిపితే ఏం జరుగుతుంది? దేశీయ బొగ్గు కొనుగోళ్లకు విదేశీ బొగ్గు కోటా తప్పనిసరి నిర్ణయాన్ని తిరగదోడితే ఎవరు జైలుకు వెళ్తారు? అలాగే మూసీ సుందరీకరణ, లగచర్ల భూముల సేకరణ విషయంలో రాబోయే ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఏం జరుగుతుంది? ఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా… అంతిమంగా అది ప్రజల ప్రయోజనాల కోసమా? లేదా అన్నదే ముఖ్యం. అది వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు నడుపుతుంటే కేంద్రం దానికి వత్తాసు పలుకుతున్నది. ఇక్కడ ఏసీబీ కేసు నిలవదనే వార్తల మధ్య ఆగమేఘాల మీద ఈడీ కేసు నమోదు చేసింది. వేధింపులకు వ్యవస్థలను వాడుకోవడమనే దుర్మార్గమైన సంప్రదాయం పదేండ్ల నుంచే ప్రారంభమైంది.
ఆ మధ్య అదానీపై అమెరికాలో కేసు అంశం మీద పార్లమెంట్లో బీభత్సం సృష్టించిన రాహుల్, విచిత్రంగా గత కొంతకాలంగా ఆ అంశాన్ని ప్రస్తావించడం మానేశారు. ఈ మధ్య జరిగిన వివిధ ఎన్నికల్లో కూడా ఎక్కడా ఆ అంశాన్ని పెద్దగా లేవనెత్తినట్టు లేదు. అదే సమయంలో కాంగ్రెస్ విధానానికి భిన్నంగా తెలంగాణ, కర్ణాటకలో అదానీ వ్యాపారాలు విస్తరిస్తున్నారు. ఇది దేనికి సూచిక? మనకు తెలియదు.
దేశంలో అనేక రాష్ర్టాలున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్.. కొన్ని చోట్ల బీజేపీ అధికారంలో ఉన్నాయి. అక్కడ విపక్షంలో అనేక పార్టీలు ఉన్నాయి. సహజంగా విపక్షాలన్నీ కలిసి అధికార పార్టీ మీద పోరాటం చేస్తాయి. అలాగే ఏదైనా ఒక పక్షం మీద సర్కారు దమనకాండకు దిగితే మిగిలిన పక్షాలన్నీ కలిసికట్టుగా వ్యతిరేకిస్తాయి. తెలంగాణలో విచిత్రంగా విపక్ష బీఆర్ఎస్ నాయకులను ప్రభుత్వం వెంటాడి వేధిస్తున్నది. అయినా బీజేపీ ఇదేమని ప్రశ్నించడం లేదు. పైగా ఇంకా అరెస్టు చేయలేదు. జైల్లో పెట్టడం లేదు అంటూ ఆజ్యం పోస్తున్నది. కేంద్ర సంస్థలను కూడా రంగంలోకి దింపుతున్నది. ఇటు ప్రభుత్వం బీజేపీ నాయకుల మీద ఈగ వాలనివ్వడం లేదు. దీనికి తగ్గట్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఒక్కటంటే ఒక్క కీలక పోరాటం చేసిన దాఖలాల్లేవు.
ఆ మాటకొస్తే గట్టిగా విమర్శించిన సందర్భాలు కూడా లేవు. రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ మీద చీకటి రాజకీయాలతో విరుచుకుపడుతున్నాయి. నువ్వు ఇటు మొదలు పెట్టు.. నేను అటు అందుకుంటా.. అన్నట్టుంది వ్యవహారం.కాంగ్రెస్ మీద, రేవంత్ మీద రాష్ట్ర బీజేపీకి వల్లమాలిన అభిమానం. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల గడిచీ గడవకముందే ‘కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చేయాలని కేసీఆర్ కుట్ర పన్నారని’ బండి సంజయ్ కరీంనగర్లో ఆరోపించారు. కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులున్నారని ఆందోళన పడ్డారు. అలాంటిదేమన్నా ఉంటే కాంగ్రెస్ ఆందోళన పడాలి. హైరానా పడాలి. కాంతమ్మ నెల తప్పితే కనకమ్మకు నొప్పులొచ్చినట్టు.. మధ్యలో ఈయనకొచ్చిన బాధేమిటో? అర్థం కాదు. ఇంతేకాదు.. రేవంత్ మీద ప్రేమను బీజేపీ నాయకులు ఏనాడూ పెద్దగా దాచుకోలేదు. గత సెప్టెంబర్ 11న రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో రేవంత్ మీద తమకు నమ్మకం, గౌరవం ఉన్నాయని బండి సంజయ్ మీడియా ముందే ప్రకటించారు. గతంలో రేవంత్‌ను, ఆయన కార్యకర్తలను కేటీఆర్ వేధించారని బాధపడ్డారు. కేటీఆర్‌ను జైల్లో పెట్టాలని రేవంత్‌ను డిమాండ్ కూడా చేశారు.
ఇలా చెప్తూ పోతే ఎన్నో అంశాల్లో ఈ రెండు పార్టీల గొంతు ఒకటే.. రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు… వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాడిన పాట ఒకటే. ‘రాష్ర్టాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారు’ అని. సరిగ్గా ఇదే పాటను బీజేపీ కూడా పాడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత. పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ‘కేసీఆర్ లక్షల కోట్ల అప్పులు చేసి చిప్ప చేతికిచ్చాడు’ అనే ఆణిముత్యాన్ని పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్ వల్లె వేశారు. ఆరు గ్యారెంటీల బారినుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పాడుతున్న ఈ పాటనే బీజేపీ ఎత్తుకోవడం వెనుక ఏ లక్ష్యం ఉన్నట్టు? వాస్తవానికి ఏటా బడ్జెట్లో ఆస్తులు అప్పుల చిట్టా ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌కు తెలుసు. అయినా ఆరు గ్యారెంటీలు ప్రకటించారు. అలాంటపుడు ‘ఆచరణ సాధ్యం కాని హామీలు ఎందుకిచ్చారు?’ అని కాంగ్రెస్‌ను నిలదీయాల్సిన బీజేపీ, కాంగ్రెస్‌కు వత్తాసు పలికేలా మాట్లాడటం విచిత్రం. ‘బీఆర్ఎస్ పనైపోయింది’… అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం బీజేపీ ఆరున్నొక్క రాగంతో చేసిన ప్రచారం ఇది. అటూఇటుగా కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ ఖాళీ అవుతుందనే ప్రచారమూ చేసింది. 39 ముక్కలు చేస్తానన్నాడో మంత్రి పుంగవుడు. మరో మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ పని క్లోజ్ అని ప్రకటిస్తే… బీజేపీ ఎంపీ రఘునందన్ ఇంకో 15 నెలల్లో బీఆర్ఎస్సే ఉండదన్నారు. కిషన్‌రెడ్డి ఇదే అన్నాడు. అంటే.. ఈ రెండు పార్టీల మైండ్ వేవ్‌లెన్త్ ఒకే దిశగా పయనిస్తున్నాయనేది సుస్పష్టం. ఇక బీఆర్ఎస్ అగ్రనేతలపై కాంగ్రెస్ కేసులు, విచారణలతో వేధిస్తుంటే బీజేపీ వారిని అరెస్టు చేయాలని, జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తుంటుంది. ఈ విషయంలోనూ రెండింటి వేవ్‌లెన్త్ ఒకటే. పైకి మాత్రం ఈ రెండు పార్టీలు ఒకటి బీఆర్ఎస్-బీజేపీ ఒకటే అని ప్రచారం చేస్తే… మరో పార్టీ బీఆర్ఎస్-కాంగ్రెస్ ఒకటేనంటూ ప్రచారాలు చేస్తాయి.
మూసీ వ్యవహారమే చూడండి… రేవంత్ సర్కార్ మూసీ సుందరీకరణ పేరుతో అక్కడ వందల ఇండ్లను కూల్చివేసింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బీఆర్ఎస్ రాజకీయ పోరాటానికి దిగింది. బీఆర్ఎస్ రాజకీయ గ్రాఫ్ పెరుగుతుందనే సంకేతాలు రాగానే దానికి అడ్డుకట్ట వేయడానికి ఆ వెంటనే బీజేపీ రంగంలోకి దిగి పర్యటనలు, మూసీ నిద్రలు ప్రారంభించింది. అంతేకాదు, అసలు మూసీ బ్యూటిఫికేషన్ పథకం మొదలుపెట్టింది బీఆర్ఎస్సేనని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
అయితే, బీఆర్ఎస్ తలపెట్టిన పథకం ఏమిటి? రేవంత్ అమలు చేసిన పథకం ఏమిటి? మూసీ పొడవునా ఇండ్లను తొలగించి భారీ నిర్మాణాలు, కార్పొరేట్ కంపెనీల ఏర్పాటు అనేది రేవంత్ పథకమైతే.. మూసీ ప్రక్షాళన, ఇరువైపులా రహదారులు, పార్కులతో సుందరీకరణ అనేది బీఆర్ఎస్ ప్రణాళిక. రెండింటి మధ్య బడ్జెట్ విషయంలో కూడా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. అయినా అర్జెంటుగా బీఆర్ఎస్ గ్రాఫ్‌ను దెబ్బకొట్టి రేవంత్‌ను కాపాడాలనే తపన బీజేపీలో కనపడింది. ఇక ఫోన్‌ట్యాపింగ్ కేసు విషయంలో కాంగ్రెస్ రోజుకో ఆరోపణ చేస్తూ పోతుంటే బీజేపీ నేతలు అదే రాగంలో సీబీఐ విచారణ జరపాలన్నారు. గవర్నర్, ఈసీ కలుగజేసుకోవాలన్నారు. కేసీఆర్‌ను అరెస్టు చేయాలని కూడా అన్నారు. అదే పార్టీకి చెందిన రఘునందన్ కేసీఆర్‌ను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నిస్తారు. అంటే సబ్జెక్ట్ ఏదైనా బీఆర్ఎస్ను దెబ్బకొట్టడమే రెండు పార్టీల ఏకైక లక్ష్యమనేది తేలతెల్లం.
కృష్ణా జలాల విషయంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ కేంద్రం చేతికి అప్పగించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టింది. ఈ దశలో బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ రంగప్రవేశం చేసి అసలు కృష్ణా జలాల వాటాను ఏపీకి కేసీఆరే తాకట్టు పెట్టారని ఆరోపించారు. అంతేకాదు, ఆ వాటాను కేసీఆర్ వినియోగించకపోవడం వల్ల రాష్ట్రం పూర్తిగా ఎడారిగా మారిందని కూడా అన్నారు. మరి కేసీఆర్ ఏ నీటిని వాటా రాసిచ్చారో.. ఆ నీరు అందక రాష్ట్రంలో ఎక్కడ ఏ మడి ఎండిందో.. ఎక్కడ కొత్తగా ఎడారి పుట్టుకొచ్చిందో ఆయనకే తెలియాలి.
ఇంకా విచిత్రమైన విషయం ఏమంటే 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి ప్రకటిస్తే… అదే వేవ్లెన్త్లో బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటిస్తారు. ఇలాంటి ప్రకటన ఇస్తే గిస్తే కాంగ్రెస్ వాళ్లు చేయాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలు టచ్‌లో ఉండేది ఆ పార్టీ నాయకులతో కాబట్టి. మరి బీజేపీ నాయకులు ఈ విషయం ప్రకటించడమేమిటి? కాంగ్రెస్‌కు వెళ్లే వాళ్లు ముందుగా బీజేపీ దగ్గర పేరేమన్నా నమోదు చేసుకున్నారా?మనకు తెలియదు.
రేవంత్‌ను ‘లొట్ట…సు సీఎం’ అంటే కాంగ్రెసోల్లకంటే బండి సంజయ్‌కే ఎక్కువ కోపం వచ్చింది. సీఎంను పట్టుకొని అలా అన్నందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పార్టీకి చెందిన ఇంకో ఎంపీ ‘నీ పౌరుషం చచ్చిపోయిందా రేవంత్?’ అని రెచ్చగొట్టాడు. ‘నిన్ను అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఓటుకు నోటు కేసులో ఆరు నెలలు జైళ్లో పెట్టారు’ అంటూ గుర్తుచేశారు. ‘నువ్వు ఏమి చేయడం లేదు’ అంటూ వెక్కిరింతలకు దిగాడు. ఎందుకంత దుగ్ధ?
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ పుట్టిన పార్టీ తెలుగుదేశం. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీతో పోరాడితే ఆ బీజేపీతో కూటమి కట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఆ కూటమి ప్రభుత్వానికి చెందిన చంద్రబాబును రేవంత్‌రెడ్డి ఆహ్వానించి ఇరు రాష్ర్టాల మధ్య సమస్యల పరిష్కారం పేరుతో ఒక సమావేశం జరిపారు. దేశ రాజకీయాలు దృష్టిలో పెట్టుకున్నా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నా బీజేపీ ఒక పార్టీగా దీన్ని సమర్థించకూడదు. కానీ, చిత్రంగా రాష్ట్ర బీజేపీ ఈ సమావేశాన్ని స్వాగతించింది. బండి సంజయ్ ఈ సమావేశాన్ని ప్రస్తుతించారు.
పోయిన ఏప్రిల్‌లో రైతులు సాగునీటి సమస్యతో అల్లాడారు. ఈ సమస్యపై పోరాటంలో భాగంగా కేసీఆర్ కరీంనగర్ పర్యటన ప్రకటించారు. వ్యతిరేకిస్తే గిస్తే దాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించాలి. కానీ, చిత్రంగా బండి సంజయ్ ఆ పర్యటనను వ్యతిరేకించారు. కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు రావొద్దన్నారు. పదేండ్ల పాలనలో కేసీఆర్ రైతులను పట్టించుకోనేలేదన్నారు. వాస్తవానికి స్వాతంత్య్రానంతరం దేశంలో రైతు మాడల్ అమలుచేసిన రాష్ట్రం అంటూ ఏదన్నా ఉందంటే అది ఒక్క తెలంగాణే. కేసీఆర్ పాలన సాగిన పదేండ్లూ రైతులు కుదుటపడ్డారు. ఇటీవలి ఆర్బీఐ నివేదిక కూడా ఆ విషయాన్ని బయటపెట్టింది. గమ్మత్తేమిటంటే ఇక్కడి రైతుబంధును కాపీ కొట్టి కేంద్రం పీఎం కిసాన్ యోజన పథకాన్ని అమలుచేస్తున్నది. అయినా అవేవీ పట్టకుండా సంజయ్ కేసీఆర్ పర్యటన మీద అంతెత్తున ఎగిరారు. సరే.. కేసీఆర్ ఇవేవీ పట్టించుకోకుండా నల్లగొండ, సూర్యాపేట, జనగామల్లో పర్యటనలు జరిపారు. దీనికి ప్రజల్లో మంచి స్పందన లభించింది. ఆ వెంటనే బీజేపీ కూడా రైతు దీక్ష అంటూ రంగంలోకి దిగింది. కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో దీక్ష అని ప్రకటించి ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభించి మధ్యాహ్నం 2 గంటలకు.. అంటే 4 గంటల దీక్షతో సరిపెట్టారు. రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన సంఘటన లగచర్ల రైతుల తిరుగుబాటు. ఈ అంశంలో బీజేపీ ప్రభుత్వాన్ని పల్లెత్తి మాట్లాడింది లేదు. రైతులను ఓదార్చి సంఘీభావం చెప్పింది లేదు. రాజకీయ లబ్ధి అనే ఏకైక లక్ష్యంతో పార్టీని కొంతకాలం నిలబెడుతుందేమో గానీ బీజేపీ విపక్షంగా తన బాధ్యతను విస్మరించడాన్ని ప్రజలు సహించరు.
ప్రాచీన సాహిత్యంలో పాము,ఎలుక కథ ఒకటుంది. ఓ పాడుబడిన ఇంట్లో ప్రవేశించిన ఎలుక అక్కడ ఓ పెట్టెలో ఏదో ఆహారముందని భ్రమించి కష్టపడి దానికి రంధ్రం చేసి లోనికి ప్రవేశించింది. అందులో ఏముంది? ఎవరో ఓ పామును అక్కడ బంధించి ఉంచారు. చాలా రోజులుగా బయటకువెళ్లే మార్గం లేక, ఆహారం లేక చచ్చే స్థితిలో ఉన్న సదరు పాము; రంధ్రం ద్వారా లోనికి వచ్చిన ఎలుకను తినేసి
ఆ ఎలుక చేసిన రంధ్రం నుంచి హాయిగా బయటకు వెళ్లి పోయింది. ఇందులో ఎలుక ఎవరో.. పాము ఎవరో చెప్పనవసరం లేదు!!
రేవంత్‌ను ‘లొట్ట…సు సీఎం’ అంటే కాంగ్రెసోల్లకంటే బండి సంజయ్‌కే ఎక్కువ కోపం వచ్చింది. సీఎంను పట్టుకొని అలా అన్నందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పార్టీకి చెందిన ఇంకో ఎంపీ ‘నీ పౌరుషం చచ్చిపోయిందా రేవంత్?’ అని రెచ్చగొట్టాడు. ‘నిన్ను అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఓటుకు నోటు కేసులో ఆరు నెలలు జైళ్లో పెట్టారు’ అంటూ గుర్తుచేశారు. ‘నువ్వు ఏమి చేయడం లేదు’ అంటూ వెక్కిరింతలకు దిగాడు. ఎందుకంత దుగ్ధ?