నేను రెండొద్దులు పోన్జెయ్యకుంటే సాలు మా అజ్జిరాలు ఆగమాగమైతది. ‘పోరడు పోన్జెయ్యపాయెన’ని మా చెల్లెండ్లను, తమ్ముళ్లను పోన్ గల్పియ్యిమని బతిలాడుతదట. ఇంటికి వోయినప్పుడు మావోళ్లు నాతోని శెప్తరు. ఎప్పట్లెక్కనే ఏదో పని మీద ఉండి నిన్న, మొన్న అజ్జిరవ్వకు పోన్జెయ్యలే. కతం, రానే అచ్చే అజ్జిరవ్వ నుంచి పోన్..
‘హల్లో చెప్పమ్మా..’
‘హల్లో… ఏడున్నవ్ రా, ఏం జేత్తున్నవ్ రా..?’
‘ఇంకేడుంటనే, పట్నంలనే ఉన్న’
‘మరి పోనే జేత్తలెవ్వు, ఒక్క ముచ్చట మాట్లాడేటందుకు తీరుతలేదా తీరికలేకుంటా అంతగనం సంపాయిస్తున్నావ్రా?’
‘గడియ రికాం లేదు, గవ్వ రాకట లేదే..’
‘మర్రెనటా.. మనకు శాత్రాలు తక్కువొస్తయా గని, ఇంతకు తిన్నవా, లేదా?, ఏం కూర..?’
‘మా తిన్న గని… నువ్వు తిన్నవా మరి’
‘నేన్గూడ తిన్న గని…’ అని ఏదో ముచ్చట అడుగవోతున్నది గని అడిగేటందుకు అనుమానవడుతున్నది.‘ఏందే అమ్మా..
ఏదో అడ్గవొయి ఆగవడ్తివి?’
‘ఏ, ఏం లేదురా’
‘ఏమన్న పైసల్ గావాల్నాయే..?’
‘ఓ ఇగ నువ్విత్తే నేను ముల్లె గట్టుకున్న తియ్, ఇంటికొచ్చినప్పుడు నువ్వే నా బొడ్లె సంచి సదురకుంటా మా సాల్ తియ్, ఎన్కట మీ అయ్యగూడ గిట్లనే బొడ్ల సంచి ఏడవెట్టినా పోశమ్మ మాయం జేసినట్టే జేత్తుండె’
‘మరేంటిదే…’
‘ఏం లేదురా.. కేసీఆర్ 20 తారీఖు నాడు మానకొండూర్ అత్తుండని ఇనవడ్తున్నది. నిజమేనారా?’
‘నిజమేనే కేసీఆర్ మన మానకొండూరుకు అత్తున్నడు. ఎందుకే గా ముచ్చట అడ్గవడ్తివి..’
‘అయ్యో.. గట్లంటున్నవేందిరా? మన మానకొండూరుకు కేసీఆర్ అత్తే ఆయ్నెను నన్ను గల్పిత్తవారా?’
‘ఎందుకే? కేసీఆర్ను నువ్వు గల్సి ఏం జేత్తవే?’
‘అయ్యో గట్లనవడ్తివేంది బిడ్డా? ఉన్న ఇల్లు, తిన్న రేవు మర్వద్దు బిడ్డా..’ అని గతాన్ని యాజ్జేసింది అజిరవ్వ.
2022, డిసెంబర్ 11. మమ్మల్నిడ్శివెట్టి వోయిన బాపును దోల్కొని నిమ్స్ నుంచిబైటికి అచ్చినం. తెల్లారి బాపును దానం జేసినంక… ‘వారీ… ఊరు గాని ఊరాయె.. పల్లె గాని పల్లెనాయె.. గా పట్నంకు తీస్కవొయి గంతగనం కర్సువెట్టుకున్నా బాపు దక్కకవాయె బిడ్డా’ అని ఏడ్వవట్టింది.
‘అమ్మా.. బాపు మనకు దక్కకపాయె అనే బాధొక్కటేనే.. బాపును బతికించుకునేటందుకు నేనొక్కన్నే గాదు, కేసీఆర్ ప్రభుత్వమే మస్తు ప్రయత్నం జేసిందే. సీఎం కేసీఆర్ ఆఫీసులకెళ్లి శానామంది నిమ్స్ డాక్టర్లతోని మాట్లాడిర్రె.. నా చేతిగుంట ఒక్క రూపాయి గూడ వెట్టనియ్యలేదు వాళ్లు’ అన్జెప్పిన.
ఆ ముచ్చటను యాజ్జేస్కున్న అజ్జిరవ్వ.. ‘ఆపదొచ్చిందని ఊరు గాని ఊరికి వోతే మనసొంటి పేదోళ్లను గూడ అక్కున చేర్చుకున్న మంచి మనిషిరా కేసీఆర్. ఆయ్న ఇప్పుడు మానకొండూరుకు అత్తుండని దెల్సి మనం గల్వకుంటె పద్ధతి అనిపిచ్చుకోదురా..’ అన్జెప్పవట్టింది.
‘సరే.. మా గల్పిత్త గని. ఇంతకు మానకొండూరుల ఎవ్వలొత్తున్నరే’..
‘ఇంకెవ్వలొత్తర్రా.. కాంగ్రెసోళ్లే రోజు అత్తున్నరు, పోతున్నరు. వాళ్లకు ఓట్లప్పుడే ప్రజలు గుర్తుకొస్తరాయె.. అందుకే కాలుగాలిన పిల్లి లెక్క రోజు తిర్గుతున్నరు…’
‘అయ్యో రాములా… అట్లగాదె, అచ్చే ఎలచ్చన్లల్ల ఎవ్వల్ గెలుస్తున్నరంటున్నా..’
‘ఒహ్హో అట్లనా, ఇంకెవ్వలు గెలుత్తర్రా… మోయేడు (తొలిపొద్దు కార్యక్రమంలో భాగంగా) మన బాపుతోని పోట్వా దిగి నీకు పంపిండు సూడు గాయ్ననే గెలుస్తడు’..
‘మరి కాంగ్రెసోళ్లు బాగనే తిరుగుతర్రు అంటున్నవ్ గదనే. వాళ్లు పైసలిత్తే నువ్వేం జేస్తవే…?’
‘నేన్దీస్కుంటనా బిడ్డా.. తీస్కుంటే నువ్వూకుంటవా? అయినా పైసలు వాళ్లే ఇయ్యవట్టిరి, తీసుకునేటోళ్లు పైసలియ్యిమని ఏమన్న అడుగుతున్నరా బిడ్డా. అయినా ఎవలన్న పైసల్ ఇయ్యంగ అద్దంటరారా?.. ఇచ్చినోళ్లు ఇస్తర్రు, తీస్కునేటోళ్లు తీస్కుంటర్రు గనీ ఓటు మాత్రం కారుకే అంటుర్రురా.. తెలంగాణ పార్టీ రాకుంటే తెలంగాణ ఆగమైతది గాదు బిడ్డా. ఈ ముచ్చట మనోళ్లందరికెర్కె. మీదికి ఎవ్వలంటలేరు గని, పోతరు సక్కగా కారుకే గుద్దుతర్రా ఓటు’
‘సరే తియ్యే నేనుంటా ఇగ. నీతోని ముచ్చట వెడ్తే ఒడ్శిపాడు గాదు..’
‘అయితమాయెగని కేసీఆర్ను కల్పిచ్చుడు మాత్రం మర్శిపోకు బిడ్డో. మనం మర్యాద దప్పినోళ్లమైతం.’
‘సరేనమ్మా.. బాపుతోని సెల్ఫీ పోట్వ దిగినా రసమయే నిన్ను కేసీఆర్ను గల్పిత్తడు తియ్..’ ఆనంగల అజ్జిరవ్వ నవ్వులు పకపకా ఇనవడ్తున్నయి. అజ్జిరవ్వ నవ్వుతే ఎట్లుంటదో ఎర్కేనా? సేమ్ రామశిల్క లెక్కనే..!