రాలి పడిపోయిన పువ్వు నిజమే చెబుతుంది
విత్తనమై మొలకెత్తి అందరికీ చలువ నీడనిస్తానని
ఎండిపోయిన బీడుపొలం కాలానికై ఎదురుచూస్తుంది
పచ్చనిపంటనై పదిమందికి ఆసరా అవుతానని
ముళ్ళబాటన పరుచుకున్న పల్లేరులు హామీ ఇస్తున్నవి
పల్లెపల్లెన పూలబాటలై పదిమందిని పలకరిస్తానని
ఎడారిని తలపించిన తెలంగాణ మాగాణం వాగ్దానం చేస్తుంది
పసిడి సిరులను కురిపించే ధాన్యాగారమవుతానని
వట్టిపోయి నెర్రెలిచ్చిన చెరువులు నవ్వుతూ సమాధానమిచ్చినవి
రైతులు పండించే పంటలకు నిత్యం ఆదరువు అవుతామని
నీళ్ళు పల్లాలకే కాదు ఎత్తుకు
పరుగెత్తుతాయని తెలంగాణ సాక్ష్యమిచ్చింది
గాయపడిన దేహం ఒంటరితనాన్ని అనుభవిస్తుంది
ఆగామి వసంతంలో ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతానని
అస్తమించిన సూర్యుడు పహారా కాస్తూనే ఉంటడు
ఉషాకిరణంలా నిత్యం శుభోదయమై ప్రభవిస్తానని
శిథిలమైపోయిన తెలంగాణ లక్ష్యానికై పోరాడింది
శిఖరాయమానమై తొలిపొద్దును పొడుస్తానని
దశాబ్దాల గోసను శాంతితో యుద్ధం చేసింది
అమరుల త్యాగాలతో తెలంగాణ సిద్ధింపజేస్తానని
అరవై ఏళ్ళ కల సాకారమై మన నుదుటన
పచ్చబొట్టయ్యింది ఆత్మగౌరవ ఉద్యమమే
ఊపిరిగా కాలాన్ని ఎదిరించింది
ఇప్పుడు…
ఎక్కడా శిథిల రాగాల ఆలాపనలు
వినబడవు మరెక్కడా గాయాల గుర్తులు
దర్శనమియ్యవు ఇపుడు దర్శనమిచ్చేది
నిత్యం ప్రగతికాంతులే
ఇపుడు వెన్నెలై కురిసేది నిత్యం
సంక్షేమపథకాలే తెలంగాణ అడవి
గాచిన వెన్నెల కాదు అడవి
పూచిన పున్నమి వెన్నెల
అడవి పూచిన పున్నమి వెన్నెల
-డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
9032844017