మన పొద్దు మనకు పొడిచే దాకా
రైతునూ రైతు కష్టాన్ని మింగిన
పెద్ద కొండ చిలువ ఈ భూమే!
గుండె పగిలిన చెరువులు
వెక్కిరిస్తూ పరుగెత్తే
కృష్ణా గోదావరీ నదులు
ఎడారిలోంచి ఎడారిలోకి ప్రవహించిన
దుర్మార్గపు కాలమది!
ఎవరు రాయలేదు చెప్పండి
ఆనాటి కన్నీటి భారతాన్ని?
ఊర్లకు ఊర్లు మనిషి జాడ కోసం
చూపును ఇంటి దర్వాజలకు వేలాడదీసేవి!
పాలనా పగ్గాలు చేతికొచ్చాకే
దృశ్యాలన్నీ సస్యశ్యామల తోరణాలైనవి
నదులు జింక పిల్లలై ఎగిరి గంతేసినవి
చెరువులు కుంటలు జల గీతాలైనవి!
అనతి కాలంలోనే
ఇక్కడి మట్టి బంగారమైంది
బంజరు పడావు భూములన్నీ
దేశానికి ధాన్యాగారాలైనవి!
హ్రస్వదృష్టి అనుయాయులు
భవిష్యత్తును కలగన లేరు
బురద చల్లే చేతులకు
పారిశుద్ధ్యం ఒంటబట్టదు!
వెలుగులు మొదలయ్యాక
చీకట్లన్నీ పాదాల కింద సర్దుకుంటాయి
పద పద దేశం ఆశగా ఎదురు చూస్తున్నది
ఇక్కడి వెలుగులు అంతటా పంచుదాం!!
-కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261