ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిబద్ధత, నైతికత లోపిస్తున్నాయా? నాయకులకు కొదవ లేదని చెప్పుకొనే చోట నాయకత్వ లోపం ప్రజా సంక్షేమానికి, రాష్ర్టాభివృద్ధికి గుదిబండగా మారిందా?.. అవును, ఏపీ దురవస్థకు అసమర్థ నాయకత్వం, చిత్తశుద్ధి లోపమే ప్రధాన శాపం. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సమాంతరంగా ప్రయాణాన్ని ప్రారంభించాయి. విడిపోయినా, సోదర రాష్ర్టాలుగా ముందడుగు వేసే ప్రయత్నం చేశాయి. కానీ, ఆంధ్రప్రదేశ్లో వెర్రితలలు వేసిన స్వార్థ రాజకీయం రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది.
ఒక సివిల్ సర్వీస్ అధికారిగా అభివృద్ధి ప్రణాళికలను అమలుచేయడంలో ఉన్న అనుభవంతో చెప్తున్నా.. చిత్తశుద్ధి లేని రాజకీయం ప్రజా సంక్షేమానికి ప్రమాదకరం. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయ రాజకీయం ఇప్పుడు దేశానికి అత్యవసరం. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే ఇదొక్కటే మార్గం. దేశ ప్రగతికి ఇది మరో స్వాతంత్య్ర పోరాటం.
విభజన తర్వాత అవశేష రాష్ర్టానికి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో విజ్ఞులైన ఏపీ ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. ఆయనకున్న క్వాలిఫికేషన్ ఆయన సీనియారిటీ మాత్రమే కాదు, అప్పటి పొత్తులు కూడా ప్రధాన కారణమే. కానీ, ప్రజల ఆశలు అడియాసలు కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. రాజకీయాలే పరమావధిగా ముందుకుసాగిన చంద్రబాబు రాష్ర్టాన్ని అధోగతి పాలుచేశారు. ప్రధాన సమస్యల పరిష్కారాలను అటకెక్కించి రాష్ర్టాన్ని అయోమయంలోకి నెట్టేశారు. అత నికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అన్నందుకు యువకుడైన జగన్మోహన్రెడ్డిని ఏపీ ప్రజలు విశ్వసించారు. వైసీపీకి అధికారం ఇచ్చారు.
ఈసారి పెనం మీదినుంచి పొయ్యిలో పడ్డట్టయింది జనం పరిస్థితి. తప్పులను సవరించుకోకపోగా, వితండవాదంలో నియంతలను మించిపోయారు జగన్. విపక్షాలను పట్టించుకోరు. నిపుణుల సలహాలు అక్కర్లేదు. మేధావులు, అనుభవజ్ఞులు ఎవరైనా గొంతెత్తితే వారిని అణిచివేయడమే ఆయన లక్ష్యం. ఆయన పాలనలో మానవీయత లేనే లేదు. కోర్టు తీర్పులను కూడా లెక్కచేయరు. ఈ రెం డు ప్రభుత్వాల పనితీరును చూసిన తర్వాత ఏపీ ప్రజలు అలో లక్ష్మణా అని మంచిరోజుల కోసం ఎదురుచూడటం మినహా మరో మార్గం లేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు.
వెన్నెముక లేని పార్టీలు అవసరమా?: సినిమా ఆకర్షణతో జనసేన చేసిన ప్రయత్నాల్లో కూడా స్వార్థ రాజకీయం మినహా రాష్ట్ర ప్రయోజనం అనే మాటే లేకుండాపోయింది. అందుకే నాయకులకు కొదవ లేకపోయినా నాయకత్వ లేమి ఏపీని వేధిస్తున్నదనే మాట ఒప్పుకోవాల్సిందే. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అభివృద్ధిలో కేంద్రం చేయూతతోపాటు రాష్ట్ర ప్రభు త్వ చిత్తశుద్ధి కూడా ముఖ్యమైనది. ఈ విషయంలో టీడీపీ సర్కార్, జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైనాయి. తమ కుర్చీలను కాపాడుకోవడం కోసం నాలుగేండ్లు అంటకాగి ప్రత్యేక హోదాను టీడీపీ తుంగలో తొక్కింది. కాకి లెక్కలతో పోలవరాన్ని, గ్రాఫిక్ మాయాజాలంతో రాజధాని నిర్మాణానికి సమాధి కట్టింది. మరోవైపు, సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను జగన్ సర్కార్ కేంద్రం ముందు తాకట్టు పెట్టింది. మూడు రాజధానుల పేరుతో ప్రాంతీ య వైషమ్యాలను, సంక్షేమం పేరుతో కులాల చీలికలను వైసీపీ ప్రభుత్వం పెంచి పోషిస్తోన్నది. ఈ రెం డుపార్టీల అవసరాలను, మూడో పార్టీ అచేతనత్వాన్ని ఆసరాగా చేసుకొని ఏపీని తమ గుప్పిట్లో పెట్టుకోవ డంలో కేంద్రంలోని బీజేపీ నూటికి నూరు శాతం విజయవంతమైంది.
తెలంగాణ దార్శనికత ఆదర్శం: సంకుచిత రాజకీయాలకు భిన్నంగా అడుగులు వేస్తున్న ఏకైక నేతగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిలుస్తారు. రాష్ట్ర విభజన సందర్భంలో పడిన విమర్శల రాళ్లతో తెలంగాణకు ఆయన పునాదులు వేశారు. ఎనిమిదేండ్లలో బంగారు తెలంగాణను ఆవిష్కరించారు. దేశంలో చెలరేగుతున్న విభజన, విద్వేష రాజకీయాలపై అనేక సందర్భాల్లో సీఎం కేసీఆర్ వ్యక్తపరిచిన అభిప్రాయాలు అమూల్యమైనవి. జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన ఎంతో క్లిష్టమైన అంశాల ను కూడా ప్రజలకు సులువుగా అర్థమయ్యే రీతిలో కేసీఆర్ వివరించే తీరు ఎంతో గొప్పది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లవుతు న్నా.. వ్యవసాయం, ఆరోగ్యం, తాగు, సాగునీరు, తదితర రంగాల్లో దేశం వెనుకబడే ఉన్నది. ఈ సమయం లో తెలంగాణ అభివృద్ధి నమూనా దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. సాటి తెలుగు రాష్ర్టానికి అలాంటి ఫలాలు అందాల్సిన పనిలేదా? కులతత్వంతో, కుళ్లు రాజకీయాలతో ఏపీ ప్రజ లు మగ్గాల్సిందేనా? ఈ ప్రశ్నలకు సమాధానమే భారత్ రాష్ట్ర సమితి విస్తరణ. ఏపీ ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఇది. రాజకీయ స్వార్థాన్ని భరించాలా? మహోజ్వల భారత నిర్మాణంలో తెలంగాణ తో కలిసి అడుగులు వేయాలా? ఈ వెన్నెముక లేని పార్టీలను నమ్ముకుంటే అధోగతి పాలు కావడమే.
ఒక సివిల్ సర్వీస్ అధికారిగా అభివృద్ధి ప్రణాళిక లను అమలుచేయడంలో ఉన్న అనుభవంతో చెప్తు న్నా.. చిత్తశుద్ధి లేని రాజకీయం ప్రజా సంక్షేమానికి ప్రమాదకరం. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయ రాజకీయం ఇప్పుడు దేశానికి అత్యవసరం. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే ఇదొక్కటే మార్గం. దేశ ప్రగతికి ఇది మరో స్వాతంత్య్ర పోరాటం.
(వ్యాసకర్త: అధ్యక్షులు, బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్)
-డాక్టర్ తోట చంద్రశేఖర్