దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శూన్యత ఏర్పడిన వేళ.. భారత ప్రజానీకం తెలంగాణ మాడల్‌తో సక్సెస్ అయిన ‘భారత రాష్ట్ర సమితి’ వైపు చూస్తున్నారు. గుణాత్మక మార్పు, సమాఖ్య స్ఫూర్తే లక్ష్యంగా ‘అబ్ కీ బార్..కిసాన్ సర్కార్’ నినాదంతో బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరుకొంటున్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం చూస్తున్న పొరుగు రాష్ర్టాల ప్రజలు.. సీఎం కేసీఆర్ పాలనను కావాలనుకుంటున్నారు.
పార్టీలు కాదు.. గెలవాల్సింది ప్రజలేనని, వారి ఆకాంక్షలను నెరవేర్చడమే అసలైన రాజకీయ మని నమ్మే వ్యక్తి సీఎం కేసీఆర్. అందుకే ఆయన ప్రజలను గెలిపించేందుకు బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టారు. దేశంలో ప్రత్యామ్నాయం లేకుండా పోయిందనే విష యం మొన్నటి రెండు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ రిజల్ట్ ద్వారా స్పష్టమైంది. అందుకే రేపు కర్ణాటక ఎన్నికలతో కదనరంగంలోకి దూకి, దేశంలో ప్రత్యామ్నాయ పార్టీగా బీఆర్ఎస్ అవతరించబోతున్నది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్.. మూడు చోట్ల అధికారంలో ఉన్న బీజేపీ.. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లో ఓడిపోయి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గుజరాత్లో గెలిచింది. ఢిల్లీ మహా నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అసలు శక్తి బయటపడింది. ఢిల్లీ ప్రజలు ఆప్‌కు పట్టం కట్టారు. గత ఎన్నికల్లో (36.08 శాతం) కన్నా ఈసారి సుమారు రెండున్నర శాతం అధికంగా (39.1శాతం) ఓట్లు తెచ్చుకొని కూడా బీజేపీ అధికారానికి దూరం కావడం.. దేశ రాజధానిలో కమలానికి వీచిన ఎదురుగాలికి ప్రత్యక్ష సాక్ష్యం. దేశంలో ఐదు రాష్ర్టాల్లో ఒక లోక్‌సభ, ఆరు అసెంబ్లీ స్థానాలకు తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లోనూ కమలం పార్టీకి ఎదురుగాలి తప్పలేదు. గెలిచిన ఒక్కచోట గుజరాత్ ఫలితాలను పెద్ద విజయంగా అభివర్ణించే కంటే, బలహీన ప్రత్యర్థుల మీద పైచేయిగానే చూడాలి.
బీజేపీ గెలుపులో ప్రతిపక్ష పార్టీల వైఫల్యం ఉన్నది. అందుకే గత ఎన్నికల్లో బీజేపీకి గట్టిపోటీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈసారి దారుణంగా పడిపోయింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ గుజరాత్ వైపునకు మళ్లితే చాలా మైలేజ్ ఉంటుందని, ఫలితాలు మరోలా ఉంటాయని అనుకున్నప్పటికీ, రాహుల్ అటువైపే చూడలేదు. సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ గుజరాత్‌కు వెళ్లలేదు. ఎన్నికల బాధ్యతల్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు అప్పగిస్తే, ఆయన ప్రయత్నాలు వృథా అయ్యాయి. గత ఎన్నిక ల్లో 41.44 శాతం ఓటు బ్యాంకుతో 77 సీట్లు గెలుచుకొని బీజేపీ కి దీటుగా నిలబడిన కాంగ్రెస్ ఈసారి 17 సీట్లు, 27.3 ఓట్ల శాతంతో సరిపెట్టుకున్నది. ఫలితంగా బీజేపీకి 52.5 శాతం ఓట్లు పడ్డాయి.
ఢిల్లీ, పంజాబ్ రాష్ర్టాల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీపార్టీ గుజరాత్‌లోనూ ప్రభావం చూపుతుందని భావించినా, అది 5 సీట్లకే పరిమితమైంది. ఆప్ గుజరాత్ ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయింది. అదీగాక గుజరాత్లో ప్రధాని మోదీ అంతా తానై ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌లో ఆయనను ఢీకొట్టే నేత కరువయ్యాడు. ఏతా వాతా తేలిందేమిటంటే.. గుజరాత్లో బీజేపీది విజయం అనే కంటే ప్రతిపక్షాల వైఫల్యం అనడమే కరెక్టు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వరాష్ట్రం అవడమే కాకుండా జాతీయ నాయకత్వం, కేంద్ర పాలనతో బీజేపీ ఊదరగొట్టినా, హిమాచల్ ప్రదేశ్‌లో ఆ పార్టీ 37 ఏండ్ల సంప్రదాయానికి గండి కొట్టలేకపోయింది. 1985 నుంచి ఇప్పటివరకు, పాలకపక్షానికి ప్రజలు తిరిగి పట్టం కట్టింది లేదక్కడ. నిజంగా మోదీ చరిష్మా, కేంద్రప్రభుత్వ పాలనపై విశ్వాసం ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఎందుకు గెలవలేకపోయింది? మోదీ ఇంద్రజాలం ఇక్కడ ఎందుకు పనిచేయలేదో ఎవ్వరూ మాట్లాడరు. ప్రతిపక్ష కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయం సాధించగా, ప్రజలు అధికార బీజేపీని 25 స్థానాలకు పరిమితం చేశారు. ధరల పెరుగుదల, ఆపిల్ రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, ప్యాకింగ్ అట్టపెట్టెలపై జీఎస్టీ విధింపు, అదానీ గ్రూపు ఇక్కడి ఆపిల్స్కు తక్కువ ధర ఇవ్వడం, ఉద్యానవన పంటలను కార్పొరేటీకరణ చేస్తున్నారన్న ఆగ్రహంతో రైతులు బీజేపీని తరిమికొట్టినంత పనిచేశారు.
అయితే ఎక్కడో ఒకటి రెండు రాష్ర్టాల్లో తప్పితే, అటు కాంగ్రె స్, ఇటు ఆప్ సహా దేశంలో ప్రతిపక్ష పార్టీలు ప్రత్యామ్నాయ పార్టీలుగా ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. నువ్వా? నేనా? అన్న స్థాయిలో బీజేపీతో తలపడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే! అందుకే దేశ ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. పార్టీకి రాజముద్ర లభించిన మొదటి రోజే.. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనుమడు లాంటి వ్యక్తులు పార్టీలో చేరడం విశేషం. మోదీ నియంతృత్వాన్ని, బీజేపీ ప్రభుత్వ అరాచకాలను ఎదురించి పోరాడే ఏకైక నాయకుడు కేసీఆరేనని దేశం మొత్తం నమ్ముతున్నది. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దుకున్నామని, కానీ, దేశంలో నీటి వసతి లేక దాదాపు 44 కోట్ల ఎకరాల భూమి సాగుయోగ్యం కాకుండా పోయిందని ప్రశ్న లేవనెత్తిన ఏకైక వ్యక్తి కేసీఆర్. దేశంలో ఏటా 70 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతున్నా ఎందుకు మళ్లించలేకపోతున్నారనే విషయంలో మోదీని నిలదీసి దేశ ప్రజల్లో ఆలోచన రేకెత్తించారు. అందుకే కేసీఆర్‌పై దేశ ప్రజలకు నమ్మకం కుదిరింది.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపారు కేసీఆర్. ఇప్పుడు దేశంలోని140 కోట్ల ప్రజలను గెలిపించేందుకు బీఆర్ఎస్తో వచ్చారు. ఇక బీజేపీ ఆటలు సాగబోవు. సంక్షేమం, అభివృద్ధి ఎజెండాతో అసలైన ప్రత్యామ్నాయంగా దేశ ప్రజలకు బీఆర్ఎస్ అవతరించబోతున్నది. దీన్ని ఏ శక్తీ ఆపలేదు.
(వ్యాసకర్త : టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి)
-సయ్యద్ నజీం అహ్మద్
9032316234