మా నాన్నకు 80 ఏండ్ల పైచిలుకు! స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆరేడేండ్ల వయసుంటదేమో! మొన్నెప్పుడో కూర్చున్నప్పుడు తెలంగాణ- రాజకీయం మాటల్లోకి వచ్చింది. అప్పటి హైదరాబాద్ సీతారాంబాగ్ సంస్కృత విద్యాపీఠంలో చదువుకొని, తెలుగు ఉపాధ్యాయుడైన నాన్న, నాటి హైదరాబాద్ స్టేట్ విముక్తి పోరాటం నుంచి నేటిదాకా తెలంగాణ గురించి తాను చదువుకున్న, తాను చూసిన, విన్న సంగతులను చెప్తూ వచ్చిండు.
భూస్వామ్య దౌర్జన్యం ఎట్లా ఉండేది? రజాకార్ల దుర్మార్గాలేమిటి? వాటిని ప్రజలు ఎట్లా ఎదుర్కొన్నరు? నిజాంను సర్దార్‌పటేల్ ఎట్లా లొంగదీసుకున్నడు? తెలంగాణ, ఆంధ్ర విలీనం ఎట్లా జరిగింది? హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో ఆంధ్రుల పరిస్థితి ఎట్లుండేది? తర్వాత తెలంగాణ వాళ్ల పని ఏమైంది?
ఇట్లా సిద్దిపేట పక్కనే మా ఊరు కావడంతో అప్పటికే ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కేసీఆర్‌ను నిశితంగా గమనిస్తూ వచ్చారు నాన్న. ‘తెలంగాణంటూ వస్తే గిస్తే కేసీఆర్‌తోనే రావాలి, లేకపోతే ఎన్నటికీ రాదు’ అని ఆయన ఉద్యమజెండా ఎగరేసిన తొలి సంవత్సరంలోనే చెప్పిన నాన్న, రాష్ట్రం వచ్చేనాటికి మన స్థితి ఏమిటో చెప్తుంటే, మనఃస్థితి తట్టుకోదు. కన్నీళ్లు ఆగవు. అదొక కష్టాల కథ. మన జీవనయాత్ర అడుగడుగునా గండంలా కనిపించింది. తెలంగాణ సుడిగుండాల్లో నావలా అనిపించింది.
ఒక సమస్య నుంచి మరొక సంక్షోభానికి, ఒక విపత్తు నుంచి మరొక ఉత్పాతానికి, ఒక విద్వేషం నుంచి మరొక విషానికి.. ఒక్కసారి తల్లడిల్లుతుంది మనసు!
1946 జూలై 4 నుంచి తెలంగాణ కమ్యూనిస్టు సాయుధ పోరాటం
1947 – 1948 రజాకార్ల విధ్వంసం, వందల మంది మృతి.
1949 డిసెంబర్ వరకు మిలిటరీ పాలన.
1956 నవంబర్ 1 నుంచి ఆంధ్ర వలస పాలన.
1969 తెలంగాణ ఉద్యమం- వందలాది మంది మృతి.
1980 – 2004 వరకు నక్సలైట్ తీవ్రస్థాయి ఉద్యమం .
వందలాదిగా మృది 1983 టీడీపీ పాలన: ఆంధ్ర
వలస పాలన తీవ్రతరం
1995 నుంచి 2004 వరకు- దుర్భిక్షం, దుర్భర జీవనం, ఆకలి చావులు, ఆత్మహత్యలు.
2001-2014 వరకు-తెలంగాణ ఉద్యమంపై పాలక్ష పక్షాలు, అధికార యంత్రాంగం దాడి.
2014 నుంచి – స్వతంత్ర తెలంగాణ అభివృద్ధి. కేంద్ర పాలకుల వివక్ష.
ఏం పాపం చేసింది నా తెలంగాణ?
మనకు తెలిసిన మన కాలంలోనే 80 ఏండ్లు వెనక్కు వెళ్దాం. అందరికీ స్వాతంత్య్రం వచ్చినప్పుడు (1947) తెలంగాణకు రాలేదు. ఏడాది (1948) ఆలస్యమైంది. ఏడాదంటే 365 రోజుల, 56 వారాల లెక్క కాదు. పోయిన ప్రాణాల లెక్క! అటు భూస్వాములు- రజాకార్లు, ఇటు సాయుధ పోరాటం, ఏదైతేనేం.. జరిగింది తెలంగాణ జన నష్టం! ఆ తర్వాత ఎనిమిదేండ్ల పాటు మరో చిత్రమైన స్థితి. మనం మనంగా ఉంటమా? లేదా? తెల్వ ని డోలాయమానం. మనకే మాత్రం సంబం ధం లేని అంశం… మన తలరాతను మార్చిన విపరిణామం. మద్రాసు స్టేట్ నుంచి ఆంధ్రా విడిపోవడం, తెలంగాణ ప్రాణం మీదికి తెచ్చిం ది. తెలుగు పేరుతో జరిగిన ఏకీకరణ, తెల్వకుం డా చేసిన నష్టం ఎంతో! ప్రజాస్వామ్య భారతదేశంలో కలిసినామని సంతోషపడినంత సమ యం పట్టలేదు. ఆంధ్రాతో విలీనమైన దుఃఖం ఆవరించడానికి! ఈ దుఃఖం ఒక దుఃఖమా? కాదు; అదొక దుఃఖమాలిక. సుసంపన్న, సుభి క్ష తెలంగాణను వందేండ్లు వెనక్కు తీసుకుపోయిన వివిధ విషాదాల సమాహారం.
తెలంగాణ జీవననాడి అయిన వ్యవసాయం, చేనేత సహా సకల కులవృత్తులూ నాశనమయ్యాయి. మన నదుల నీళ్లు మళ్లిపోయాయి. ఆదరువులైన చెరువులు చెడిపోయాయి. ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి. సంస్కృతి సన్నగిల్లింది. పండుగలు దండుగయ్యాయి. మన యాస మనది కాకుండాపోయింది. ఒకప్పుడు దేశమై విలసిల్లిన తెలంగాణకు దాదాపు ఆరు దశాబ్దాల పాటు నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలూ లేవు… మురిపించిన మాటలు, మరిపించిన మాయలు తప్ప! ముఖ్యమంత్రులు మారిండ్రే తప్ప వారి మనసు మారలేదు. ఎండిన పొలం పక్కన తుమ్మ చెట్టుకు ఎన్ని వందల మంది రైతన్నలు వేలాడిన్రో! అప్పుడు పంటచేల కోసం కాదు; ప్రాణత్యాగాల కోసం పురుగుమందు కొన్నవారే ఎక్కువేమో! ఎంతమంది నేతన్నలు పడుగుపట్టి బడుగులయ్యారో, బలి పశువులయ్యారో! ఫ్లోరైడ్‌తో నల్లగొండ జిల్లా వంకర్లు తిరిగితే, పాలమూరు జిల్లాకు జిల్లాయే వలసపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. మనం పుట్టిన నేల మీద మనమే పరాయి అయినంత అభద్రత!
వలస పాలన గోస అట్లుండగానే, దానికి సమాంతరంగా నక్సలైట్ల ఉద్యమం. అది దైన్యంలోంచి మొలిచిన ధైర్యమా? చెప్పలేం! కానీ ఇటు ధిక్కార తుపాకీ, అటు సర్కారు తుపాకీ! దాదాపు 20 ఏండ్ల పాటు (ఎదురు) కాల్పులు, మందుపాతర్ల మోత! అప్పుడు అడవికి అర్థం వేరు. రాత్రి ప్రయాణం ఒక మురిపెం! ఏడు గంటలకే అర్ధరాత్రి ఆవరించిన సన్నివేశం. పోయిన వందల ప్రాణాల లెక్క ఎన్నటికీ తేలకపోవచ్చు! నక్సలైట్లయినా, పోలీసులైనా, భూస్వాములైనా, ఇన్ఫార్మర్లయినా.. పోయింది తెలంగాణ ప్రాణమే! అటు పరువూ ప్రతిష్ఠతో సంబంధం లేకుండా వలస పాలకుల వివక్ష ఉరుమై ఉరుముతుండగానే, దాదాపు తొమ్మిదేండ్ల పాటు కరువు బరువై బతుకును కమ్ముకున్నది. అప్పటికే పెనం మీద ఉన్న మను షులను ఇది పొయ్యిలోకి దించింది. హైదరాబా ద్ రాజధాని అయింది రాజులు కొలువుదీరేందుకే, కాని ఈ రాజ్యమేలేందుకు కాదు. మనువిక్కడ, మనసక్కడ! అక్కడెక్కడో తుపాను వస్తే, ఇక్కడ ఆవేదనతో ఊగిపోయిన పాలకులకు, కాళ్ల కింద నేల ఎండిపోతున్నా, బతుకు లు మండిపోతున్నా కనికరం కలగలేదు.
కృష్ణా కుడికాల్వకు నీళ్లు విడువకపోతే బ్యానర్ పరుచుకునే పత్రికలకు, తెలంగాణలో కన్నీళ్లు కాల్వ కట్టినా కనిపించలేదు. ఎండిన చెర్వులకు ఏకాని ఇచ్చినవాడు లేడు. దిగువన పారే నదికి కట్ట కట్టినవాడూ లేడు. కానీ మన హైదరాబాద్ నుంచి పైసలు కాల్వకట్టి దిగువకు ప్రవహించేవి. సుత్తి కథలే తప్ప ఎత్తిపోతల లేదు. ఏడ్వకన్నోడు అం తకంటే లేడు. తెలంగాణ మొత్తం తనను తాను తవ్వుకొని, ‘బోరు’మని ఏడుస్తూ, తలకాయ పాతాళానికి పెట్టి చూస్తే, చెమట చుక్కో, కన్నీటి చుక్కో కిందికి రాలిందే తప్ప నీళ్ల చుక్క కనిపించలేదు. కొన్నాళ్లకు 1969లో ఒక ఉద్యమం. వందలాది మంది బలిదానం. 2001 నుంచి 13 ఏండ్ల పాటు మలిదశ ఉద్యమం. ఇది మెజారిటీ ఆధిపత్యాన్ని మైనారిటీవాదం ధిక్కరించిన పోరాటం. భాషా ప్రయుక్త రాష్ర్టాల సిద్ధాంతంపై యాసా ప్రయుక్త ప్రాంతం ప్రకటించిన పోరాటం.
కాదన్న అన్ని పార్టీలను ‘కావాల్సిందే’ అని ఒక పార్టీ శాసించిన పోరాటం. ప్రధాన జాతీయపార్టీలను ఒక ఉప ప్రాంతీయ పార్టీ ఎదిరించిన పోరాటం. యోధానుయోధులైన దేశ, రాష్ట్ర నాయకులను ఒక గండర గండ డు ఢీకొట్టిన పోరాటం. పోరాటం శాంతియుతమే. కానీ వస్తుందో, రాదో తెల్వని తెలంగాణ కోసం, అనుమానాలతో, ఆశాభంగాలతో, ఆవేదనలతో, ఆక్రందనలతో సాగిన బలిదానాలె న్నో. బలిపీఠమెక్కిన భవిష్యత్తులెన్నో! 13 ఏం డ్ల ఉద్యమకాలమొక ఉద్దీపనగా కనిపించినా, సబ్బండ వర్గాలకదీ సంక్షుభిత సమర సన్నివేశమే!
మొత్తానికి 1947 నుంచి తీసుకుంటే 67 ఏండ్లు, 1956 నుంచి తీసుకుంటే 58 ఏండ్లు తెలంగాణ తెలంగాణ కాదు. అదొక సామూహి క, సామాజిక, వ్యావసాయిక సంక్షోభ కేంద్రం. ప్రాంతంగా, ప్రజా సమూహంగా, సాంస్కృతిక సముదాయంగా.. అస్తిత్వ ప్రమాదాన్ని ఎదుర్కొన్న సమయం. సానుభూతి చూపినవారు లేరు. సాయం చేసినవారు అంతకంటే లేరు. భూస్వామి వ్యవసాయం చేయలేక పట్టణాలకు పారిపోయిండు. కూలీ వలసపోయిండు. ఆ కాలమంతా ముంబాయి, దుబాయి మన మజి లీ. కష్టం మన సావాసం. నష్టం మనకు గ్రహచారం. బతుకొక భయం. దైవం కూడా సాథీ ఇవ్వనిచోట దైన్యమే తోడునీడ. ఉరితాడే ఉపశమనం. ఆరోజు గడిస్తే చాలనుకున్న మనిషి. రేపటి గురించి ఆలోచించడమే మరిచిపోయిన మనసు. కారణమేమిటో తెల్వదుగానీ, మనకు తెలిసిన చరిత్రలో తెలంగాణ ఎప్పుడూ ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉంది. ఒకటి కాదు; కొన్నిసార్లు ఏకకాలంలో ఒకటి, రెండు, మూడు పోరాటాలు!
ఇది కాలం కథ. అవునో కాదో ఇంట్ల ఉన్న పెద్దోళ్లను అడిగితే తెలుస్తుంది. తెలంగాణ ఎప్పుడైనా కాస్త కుదుటపడి ఉన్నదీ అంటే అది ఈ తొమ్మిదేండ్లలోనే! అనుభవిస్తున్న వాటిని అక్షరాల్లో రాయడం అవసరమా? కండ్లముందు కనిపించేవాటిని కాలేదని అనగలమా? ఊరికో ఆర్వో వెలిసినచోట ఇంటింటికీ మంచి నీళ్లు రావడం, పాడుబడ్డ చెరువు నిండా ఏడాదంత నీళ్లు నిల్వడం, బీడన్నదే లేకుండా భూమంతా పొలమై గెలువడం, ఊరిపక్క వాగు వంక నిరంతరం పారడం, చేతివృత్తులు మళ్లీ మరాడించ డం.. ఇంకా ఇలాంటివే ఎన్నో! కడుపునిండా మంచినీళ్లు తాగి, చుట్టపక్కాలతో నాలుగు సన్న న్నం ముద్దలు తిని, పిల్లలతో ముద్దూ ముచ్చట గడిపి, ఊళ్లు కళకళలాడి, నాలుగు రాళ్లు బ్యాం కుల దాచుకున్న కాలం ఏదైనా ఉన్నదా అంటే అది ఈ తొమ్మిదేండ్లే కదా! కొంచం ప్రశాంతం గా, రేపటి చింత లేకుండా, గుండె మీద చెయ్యి వేసుకుంటో, గుండు నిమురుకుంటో పండుకుంటున్నది ఈ తొమ్మిదేండ్లలోనే కదా! అవునా కాదా?
తొమ్మిదేండ్ల కింద తెలంగాణ ఎట్లుండె? ఇప్పుడెట్లున్నది? 80 ఏండ్లుగా తెలంగాణ ఎటువంటి కష్టం పడ్డదో తెలిసినవారికి, ఇప్పుడు ఏం బాగైందో అర్థమవుతుంది. నాటి కష్టం తెలిసినవారు ఇప్పుడు లేరు. ఉన్నా మాట్లాడుతలేరు. ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నవారికి అప్పటి కష్టం తెల్వదు. తెలంగాణ ఏందో పిల్లలు తెలుసుకుందామనుకునేలోపే, వారి మెదళ్లలో సోష ల్ విషం నిండుతున్నది. తెలిసినవారు, తెలియజెప్పాల్సిన పెద్దలు ఆ ప్రయత్నం చేయక తికమక పడుతున్నరు. ఆలోచించాల్సిన వాళ్లు, తప్పుడు ఆలోచనలు చేస్తున్నరు. కండ్లముందు కనిపిస్తున్నదాన్నీ అబద్ధమని చెప్తే అదేమని ప్రశ్నించలేని అచేతన మా తెలంగాణలో! ఇప్పటిదాకా, ఈ 80 ఏండ్లలో తెలంగాణ కాలంతో పోరాడింది. కరువుతో పోరాడింది. బతుకు బరువుతో పోరాడింది. ప్రకృతితో, అది సృష్టించిన వికృతితో పోరాడింది. బయటి శత్రువుతో పోరాడింది. అంతర్జీవిని తన మంచితనంతో గెల్చుకుంది. కానీ కాలానికి మళ్లీ తెలంగాణపై కన్ను కుట్టినట్టుంది. మరో సమస్య తరుముకుంటూ వస్తున్నట్టే ఉంది. నేటి ప్రశాంతత దాపున రేపటి తుపాను ఉందా?.
కొంచం కుదురుకొని తొమ్మిదేండ్లయినా కాకముందే ముంచుకొస్తున్న ముప్పు ఇది. ఇకపై జరిగేది చిత్రమైన పోరాటం. ఇందులో మనం మనతోనే పోరాడాల్సి ఉంటుంది. మనవాళ్లతోనే పోరాడాల్సి ఉంటుంది. ఇదొక ఆటోఇమ్యూన్ డిసీజ్ లాంటిది. తెలంగాణ అనడానికే నిరాకరించిన వాళ్లతో అంటకాగినవాళ్లు, నాటినుంచి నేటిదాకా తెలంగాణను అవమానిస్తున్నవాళ్లతో జోడీ కట్టినవాళ్లు, తెలంగాణ కోసం ఏనాడూ పాటుపడనివాళ్లు, తెలంగాణకు ద్రోహం చేసినవాళ్ల వారసులు, ‘మేమూ తెలంగాణ వాళ్లమే, తెలంగాణ కోసమే’ అంటూ మన ముందుకువస్తున్నరు. ఈ ‘నయా వంచక తెలంగాణవాదం’ వెనుక.. భావజాల విస్తరణ ప్రయత్నమున్నది. రాజ్యవిస్తరణ కాంక్ష ఉన్నది. ‘ధిక్కారమున్ సైతునా’ అన్న అహంకారమున్న ది. మన ఔన్నత్యాన్ని తగ్గించి చూపే కుంచితత్వమున్నది. మన నాయకుడిని చిన్నగ చేసే తర్కమున్నది. మన ప్రాభవాన్ని పడగొట్టాలన్న పట్టుదల ఉన్నది. తాము తప్ప తక్కిన వారెవ్వరూ ఉండకూడదన్న నియంతృత్వమున్నది. కానీ ఇవన్నీ లోలోపలే ఉంటయి. పైకి కనబడవు. మరేం కనిపిస్తుంది? మనవాళ్లే కనిపిస్తరు. వాళ్లు మన కోసమే మాట్లాడుతున్నట్టు అనిపిస్తరు. మనకోసమే పోరాడుతున్నట్టు నటిస్తరు.
మనిషి మనవాడే. కానీ మనసు పరాయిది. హి హాజ్ యాన్ ఇంజనీర్డ్ బ్రెయిన్ ఇన్ హిజ్ హెడ్. హి ఈజ్ ఏ మెర్సినరీ. ఎవరి కోసమో తనవాళ్లపైనే పోరాటం చేసి, దాన్ని వీరత్వమనుకునే వికారి. అతడు మన ఇంట్లో పిల్లగాడే కావచ్చు. మన పక్కసీట్లో కూర్చున్న ఉద్యోగే కావచ్చు. మనదేనని చెప్పే మనదికాని పార్టీ నాయకుడు కావచ్చు. వాట్సాప్ వర్సిటీలో చదువుకుంటున్న మన పొరుగింటి మేధావే కావచ్చు. మన ప్రాంత ప్రయోజనం కంటే ‘మహోన్నత కర్తవ్యం’ మరేదో ఉందన్న నైరూ ప్య భావనను మెదడులో నాటించుకున్న మరొకరు కావచ్చు. మన మధ్యే తిరుగుతూ, మనలాగే కనిపిస్తూ, మననే గమనిస్తూ, మెల్లిగా వాదించి, సిద్ధాంత చర్చ చేసి, ఒప్పించి, మార్చివేసే మార్మికుడు కూడా కావచ్చు! బయటివాళ్లు రెచ్చగొడితే రెచ్చిపోయి తన నెత్తిమీద తానే చెయ్యి పెట్టుకునే భస్మాసుర యుద్ధమిది. రూపులు వేర్వేరు. లోపలి శాపం ఒక్కటే. గొం తులు వేర్వేరు. సంయుక్త సందేశం ఒక్కటే. ఇప్పుడు తెలంగాణ ఇలాంటి పోరాటం అంచునే నిలబడి ఉన్నట్టు కనిపిస్తున్నది.
‘నా కొడుకో, మరొకడో చెప్పిండు’ అని అటుంటమా. ‘ఇదిరా సంగతి’ అని కొడుక్కు నిజం చెప్పి ఇటుంటమా? ఇదీ ఈ ఉద్యమం సంధిస్తున్న మొదటి ప్రశ్న!
పోరాటమెప్పుడూ ప్రశాంతతకు భంగమే. కానీ అది మన ఆహ్వానంతో సంబంధం లేకుండా వస్తుంది. మనకు తెలిసిన 80 ఏండ్లలో తెలంగాణ ఇప్పటికి అనేక పోరాటాలను చూసింది. చేసింది. ఒకటి నిజం, సహజం. తెలంగాణ ఎన్నడూ అపజయం పాలుకాలేదు! మోడు నుంచీ అంకురించడం తెలంగాణ అలవాటు. ఈ ప్రాంతానికి ఇప్పుడొక క్రాంత దర్శి రక్షకుడిగా ఉన్నడు. నిధిలాంటి తెలంగాణకు నిరంతరం గస్తీ కాస్తున్న సైనికుడతడు.
నిరాశ నుంచి కొత్త స్వప్నానికి, శిథిలం నుంచి కొత్త భవంతికి,అపజయం నుంచి కొత్త సాహసానికి, ఊరు నుంచి కొత్త మండలానికి, పట్నం నుంచి కొత్త జిల్లాకు, చెరువు నుంచి మహా సాగరానికి, ఒక సంక్షోభం నుంచి కొత్త సంక్షేమానికి, ఒక వైఫల్యం నుంచి కొత్త విజయానికి, ఒకరి ద్రోహం నుంచి కొత్త వ్యూహానికి అతడి ప్రయాణం సాగుతూ ఉంటుంది… కాళేశ్వర ప్రవాహంలా… ఎత్తులు పల్లాలను ఏకం చేసుకుంటూ! తెలంగాణ ఒక దేవాలయం. అతడు చేసేది తెలంగాణ తీర్థయాత్ర. తన బాగు కోసం తెలంగాణ తల్లి కట్టుకున్న ముడుపు అతడు.
అతని దృష్టి కెమెరా కన్నుపై ఉండదు. తాననుకున్నది జరుగుతున్నదా లేదా? అన్నదానిపై ఉంటది. తానొక్కడై బాగుండాలని కోరుకోడు. తన ప్రాంతం సుభద్రంగా ఉన్నదా లేదా? చూస్తడు. నిన్న నాతో బాగున్నాడే అనుకుంటాడొకడు. నేడు బాగా లేడంటాడు ఇంకొకడు. నిందలు వందలు. వాటితో అతనికి నిమిత్తం లేదు. తన వెంట ఎందరున్నారో అతనికి అక్కర్లేదు. ఎవరున్నారో అంతకన్నా! కొన్నిసార్లు కొందరు అతనితో కలుస్తుంటరు. ఇంకొన్నిసార్లు ఇంకొందరు ఎందుకో విడిపోతుంటరు. కలబోతలు, విడదీతలతో సంబంధం లేకుం డా, 45 ఏండ్లుగా అతడి జైత్ర యాత్ర సాగుతూనే ఉన్నది… తెలంగాణ కోసం! 69 ఏండ్ల వయసులో తెలంగాణ జయ పతాకాన్ని భుజాన మోస్తూ, మరో పోరాటానికి నేను సిద్ధమంటూ బయల్దేరిన సాహసి వెంట మనం కదులుదామా? ‘కర్తవ్యపథం’పై నిలబడి, కలబడి మరోసారి మన తెలంగాణను కాపాడుకుందామా?!
నిన్నటి వేదనను, నేటి వెసులుబాటుతో పోల్చి చూసుకునే చైతన్యం మనలో రగిలినప్పుడే రేపటికి భవిష్యత్తు. జై తెలంగాణ!

– తిగుళ్ల కృష్ణమూర్తి