కోడి ఎంత ఎత్తుకు ఎగరగలదు?, కాకి ఎంత ఎత్తుకు ఎగరగలదు?గద్ద ఎంత ఎత్తుకు ఎగరగలదు?, కాకిలా ఎగరాలని కోడి ప్రయత్నిస్తే? గద్దలా ఎగరాలని కాకి ప్రయత్నిస్తే?..ఆరు లక్షలు చేతిలో ఉన్నవాడు మారుతి ఆల్టో కోసం చూడాలి తప్ప బెంజ్ కారు కొనాలని చూస్తే సాధ్యం అవుతుందా?
ఓటమిని అంగీకరించలేని హుందాతనం లోపించినవారు ఎదుటివారి మీద పనికి మాలిన ఆరోపణలకు, అసత్య ప్రచారాలకు తెగబడతారు. తనది కాకి శక్తే అని తెలుసుకోలేక, గండభేరుండాన్ని అని బలాన్ని అతిగా అంచనా వేసుకుని, మూతి పగలగొట్టుకుంది బీజేపీ. ఇక మళ్ళీ అలాంటి సాహసం చేయకపోవచ్చు. చేసినా మళ్ళీ ఇలాంటి చేదు ఫలితాలే వస్తాయి.
సరిగ్గా బీజేపీ అలాగే చేసి మునుగోడులో నిండా మునిగిపోయింది. దుబ్బాకలో రఘునందన్‌రావును అభ్యర్థిగా నిలబెట్టి, ఆపసోపాలు పడి వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలిచింది. నిన్న మునుగోడులో టీఆర్ఎస్కు దక్కిన మెజారిటీ పదివేలకు పైగా. అయినప్పటికీ, అప్పట్లో రఘునందన్‌రావు విజ యం టీఆర్ఎస్ పతనానికి పునాది అంటూ కేసీఆర్ మీద విషం చిమ్మిన కొన్ని విష పత్రికలు నిన్న టీఆర్ఎస్కు వచ్చిన మెజారిటీని తక్కువ చేసి చూపించడానికి నానా తంటాలు పడ్డాయి. రాజగోపాల్ రెడ్డి లాంటి సహస్ర కోటీశ్వరుడు, సామాజికంగా, రాజకీయంగా శక్తి సామర్థ్యాలు కలిగినవాడు, వందల కోట్ల రూపాయలను మంచినీళ్లలా కుమ్మరించగలిగిన సమర్థత కలిగినవాడు ఒకవంక, మాజీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడి కుమార్తె స్రవంతి రెడ్డి మరొక వంక విరుచుకుపడినపుడు రాజగోపాల్ రెడ్డితో పోల్చితే పెద్దగా ప్రభావం లేని కూసుకుంట్ల ప్రభాకర రెడ్డి పదివేల ఓట్ల ఆధిక్యం సాధించడం విజయం కాదా? ప్రభాకర రెడ్డి నమ్ముకున్నది కేసీఆర్‌ను, ఆయన సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను మాత్రమే. ఈ నమ్మకమే ఆయనను విజయ తీరాలకు చేర్చింది.
దుబ్బాక, హుజూరాబాద్‌లో మాదిరిగానే టీఆర్ఎస్ను డబ్బుబలంతో ఓడించడం సులభమని అంచనా వేసింది బీజేపీ. ప్రజలంతా తాము సృష్టించిన భ్రమల్లో ఉన్నారని, బండి సంజయ్, అరవింద్ మత విద్వేష మాటల మంటలతో ప్రజల మనసులను భగభగ మండిస్తున్నారని, ఆ మంటల్లో చలికాచుకోవడం సాధ్యమేనని బీజేపీ నమ్మింది. రెండు ఉప ఎన్నికల ఓటమితో కేసీఆర్ మానసికైస్థెర్యం కోల్పోయారని, జాతీయ రాజకీయాల్లోకి ఆయన ప్రవేశాన్ని అడ్డుకోవాలంటే మునుగోడులో గెలుపు ఒక్కటే మార్గమని గుడ్డిగా నమ్మేసింది. సాధారణ అభ్యర్థులైతే ఎన్నికల్లో భారీ వ్యయాన్ని భరించలేరని, రాజగోపాల్ రెడ్డి అయితే ఎన్ని వందల కోట్లయినా ఖర్చు చేయగలరని, అవసరమైతే కాంట్రాక్టులు ఇచ్చి ఆదుకోవచ్చని బీజేపీ లెక్కలు కట్టింది. కానీ, ఆ పార్టీ వేసుకున్న అంచనాలు, లెక్కలు, వ్యూహాలు అన్నీ చివరకు అడ్డం తిరిగాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, వందల మంది ప్రజాప్రతినిధులు మునుగోడులో ప్రచారం కోసం అక్కడే మోహరించారంటూ పనికిమాలిన ఆరోపణలు చేస్తారు కొందరు. పాము చిన్నదైనా చంపాలంటే పెద్ద కర్ర ఉండాల్సిందే. జానెడు పొడవు పామే కదా అని మూరెడు పొడవున్న కట్టెతో కొడతారా ఎవరైనా? ఒక్క అభిమన్యుడిని ఎదుర్కోవటానికి ఏకంగా వేలాదిమంది సైన్యంతో పద్మవ్యూహం పన్నాల్సివచ్చింది ద్రోణాచార్యుడు. ఇక్కడ బీజేపీ అభిమన్యుడు అని నా ఉద్దేశం కాదు. కౌరవుల దృష్టిలో అతనొక బలమైన శత్రువు. అతనికి శ్రీకృష్ణుడి అండదండలున్నాయి. అతడిని ఎదుర్కోవాలంటే సర్వశక్తులు వినియోగించాల్సిందే. పద్మవ్యూహం అనేది ఒక యుద్ధతంత్రం. వైరిపక్షం వాడు చిన్నవాడా పెద్దవాడా అనేది ప్రధానం కాదు. వివిధ రాష్ర్టాల్లో కీలకమైన ఎన్నికలు ఉన్నప్పుడు కేంద్రం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, నడ్డా లాంటి బీజేపీ అగ్రనేతలు వెళ్లడం లేదా? ప్రచారం చెయ్యడం లేదా? మునుగోడులో కూడా వారు తక్కువ ప్రచా రం చేశారా? కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నెలరోజుల పాటు రాష్ట్రంలోనే తిరుగుతూ ప్రచారం చెయ్యలేదా? జేపీ నడ్డా రాలేదా? అమిత్ షా రాలేదా? వందలాది మంది బీజేపీ నాయకులు మునుగోడు చుట్టూ తిరగలేదా? తమకు చెప్పిన హామీల మేరకు డబ్బులు, బంగారం పంచలేదని రాజగోపాల్ రెడ్డిని కొన్ని గ్రామాల్లో ప్రజలు ముఖం మీదనే నిలదీయలేదా? భారీ డబ్బు మొత్తాల్ని పోలీసులు ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నారు కాబట్టే పంచడం లేదని రాజగోపాల్‌రెడ్డి తప్పించుకోలేదా? రాజగోపాల్‌రెడ్డికి చెందిన తొమ్మిది కోట్ల రూపాయల మొత్తాన్ని పోలీసులు పట్టుకోలేదా? అన్నిరకాల అనైతిక కార్యాలకు దిగి చివరికి ప్రజలతో ఛీత్కారాలు కొట్టించుకుంది బీజేపీ. అయినప్పటికీ, టీఆర్ఎస్ మీద పస లేని ఆరోపణలు చేసి తన స్థాయిని మరింత దిగజార్చుకుంటున్నది.
ఓటమిని అంగీకరించలేని హుందాతనం లోపించినవారు ఎదుటివారి మీద పనికి మాలిన ఆరోపణలకు, అసత్య ప్రచారాలకు తెగబడతారు. తనది కాకి శక్తే అని తెలుసుకోలేక, గండభేరుండాన్ని అని బలాన్ని అతిగా అంచనా వేసుకొని, మూతి పగలగొట్టుకుంది బీజేపీ. ఇక మళ్లీ అలాంటి సాహసం చేయకపోవచ్చు. చేసినా మళ్ళీ ఇలాంటి చేదు ఫలితాలే వస్తాయి.
మునుగోడు విజయంతో టీఆర్ఎస్ ఆత్మవిశ్వాసం పెరిగింది. కేసీఆర్ వ్యూహచతురత, నైపు ణ్యం మరొకసారి అందరికీ తెలిసివచ్చింది. టీఆర్ఎస్ శ్రేణులకు లక్ష ఏనుగుల బలాన్ని ఇంజెక్ట్ చేశారు ఆయన. బీఆర్ఎస్ పార్టీగా మరొక నెల రోజుల్లో రూపాంతరం చెందుతున్న టీఆర్ఎస్ పార్టీకి నైతిక బలాన్ని సమకూర్చింది మునుగోడు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న కేసీఆర్‌కు శుభారంభాన్నిచ్చింది.
(వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)
-ఇలపావులూరి
మురళీ మోహనరావు