సుప్రసిద్ధ జర్నలిస్ట్ కేఎల్ రెడ్డి ఇక లేరన్న వార్త మనసు చివుక్కుమనిపిస్తున్నది. ఇన్నాళ్లుగా ఆ పెద్దాయన ఎక్కడున్నారో.. ఓ ఐదారేండ్లయి ఉంటుంది సార్ కనిపించక. నాగోల్‌లో ఉండేరోజుల్లో ప్రతి రోజు పొద్దున్నే ఆరుగంటల కల్లా ఠంచన్‌గా బండ్లగూడలో హరి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ షాప్ వద్ద పేపర్లు చదువుతూ కనిపించేవారు. అక్కడ వార్తా పత్రికలతో పాటు పాల ప్యాకెట్లు కూడా లభించేవి. అక్కడికొచ్చే తెలుగు పత్రికలన్నీ ఓ అరగంట పాటు తిరగేసి, ఆ రోజు వచ్చిన ఆర్టికల్స్ బట్టి మూడు, నాలుగు పేపర్లు మడిచి ఒక చేతిలో, మరో చేతిలో వెంట తెచ్చుకున్న సంచిలో పాల ప్యాకెట్ వేసుకునేవారు. సమీపంలోని తన గదికి వెళ్లేవారు.
ఓ చిన్న గదిలో కేఎల్ రెడ్డి సార్ అద్దెకుండేవారు. ఆ గదిలో ఓ మూలన పాత పేపర్లు, గూట్లో పుస్తకాలు, మరో మూలన పొయ్యి, రెండు మూడు వంట పాత్రలు, ఇంకో మూలన మంచం. ఇవే ఆయన ఆస్తి. షాప్ అతనితో తప్ప ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. పరిచయస్తులు కనిపిస్తే చిరునవ్వు, కళ్లతోనే పలకరించి తన దారిన తాను వెళ్లిపోయేవారు. తెల్లని లాల్చి, లూజు పైజామాతో అచ్చం పాతకాలపు కవిలా అగుపించేవారు. ఇంటికెళ్లి టీ తాగాక ఓ గంట పాటు తెచ్చుకున్న పేపర్లు చదవడంలో లీనమయ్యేవారు. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ రోడ్డంటా నడుచుకుంటూ వెళ్లి కూరగాయలు తెచ్చుకునేవారు. స్వయంగా వంట చేసుకొని తిన్నాక మళ్లీ 11 గంటలకల్లా బస్టాప్‌లో నిలబడి కనిపించేవారు. బస్సులో ఎక్కడికి వెళ్లేవారో, తిరిగి ఎప్పుడు వచ్చేవారో కానీ మళ్లీ మరుసటి రోజు పొద్దున్నే కనిపించేవారు. ఇదీ, కేఎల్ రెడ్డి సార్ దినచర్య.
కేఎల్ రెడ్డి సార్ నిరాడంబర జీవితం, పత్రికారంగంలో ఆయనకున్న అపార అనుభవం, తొలి దశ తెలంగాణ ఉద్యమానికి (1969) తన వంతుగా అందించిన అక్షరాయుధాలు, ఫలితంగా అనుభవించిన జైలుశిక్ష, వృద్ధాప్యంలో బతుకుబండి లాగడానికి ఆయన పడుతున్న పాట్లు వీటన్నింటిని వివరిస్తూ (2016) సీనియర్ జర్నలిస్ట్ గోవిందరాజుల చక్రధర్ ఆంధ్రభూమి దినపత్రికలో ‘తెలంగాణ అక్షర యోధుడు’ శీర్షికతో వ్యాసం రాశారు. ఆ ఆర్టికల్ చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించారు. కేఎల్ రెడ్డి గారు ఎకడ ఉంటున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఆరాతీసి అదే రోజు సాయంత్రానికల్లా ప్రగతిభవన్‌కు కేఎల్ఆర్ను రప్పించుకున్నారు. యోగక్షేమాలు తెలుసుకున్నాక… ‘మీరీ వయసులోనూ కష్టపడి ఉద్యోగం చేయనవసరం లేదు. మీకేం కావాల్నో చెప్పండ’ని కేసీఆర్ అడిగారు. ‘ఏముంది తినడానికి తిండి, ఇంటి కిరాయి, మందులకు (వైద్యానికి) నెలకింత ఇస్తే చాల’న్నారు. ‘ఓ పది లక్షలు ఇస్తాను సరిపోతుందా?’ అని కేసీఆర్ అడిగారు. ‘ఆ లచ్చలు ఇస్తే నేనేం చేసుకుంటా.. నెలకో పది, పన్నెండు వేలు వచ్చేటట్టు చూడండ’ని కేఎల్ రెడ్డి సార్ నిర్మొహమాటంగా చెప్పారు. సీఎం వెంటనే అకడున్న తన ఓఎస్డీని పిలిచి ‘నెలకు 12 వేలు రావాలంటే ఎంత డిపాజిట్ చేయాలో లెక్కేసి చెప్పండ’ని ఆదేశించారు. ఆయన లెక్కలేసి రూ.15 లక్షలు బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నెలకు 12 వేలు వస్తాయని చెప్పారు. అప్పటికపప్పుడు కేఎల్ రెడ్డి పేరు మీద రూ.15 లక్షలకు చెక్కు రాసిచ్చారు కేసీఆర్. ఆ రూ.15 లక్షల మొత్తం తన తదనంతరం తిరిగి సీఎం సహాయ నిధికే చేరాలని, ఈ మేరకు వీలునామా రాస్తానని కేఎల్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన రాశారు కూడా.
కేఎల్ రెడ్డి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కనబర్చిన ఔదార్యంపై సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనను అప్పుడు ఆంధ్రభూమి తరఫున సీఎంఓ బీట్ రిపోర్టర్‌గా నేనే కవర్ చేశాను. ప్రతిరోజు నాకు నాగోల్ దగ్గర పొద్దున్నే షాప్ దగ్గర కనిపించే ఆయనే ప్రముఖ జర్నలిస్ట్ కేఎల్ రెడ్డి అనే విషయం అప్పటిదాకా నాకు తెలియదు. అయితే అప్పటికే ఆయన గురించి సీనియర్లు చెప్పగా విన్నాను. ఈనాడు పత్రికలో ఏదైనా మంచి బ్యానర్ స్టోరీని పొందికగా కూర్చి రాయాలంటే ఆ పనిని కేఎల్ రెడ్డికి అప్పగించేవారని విన్నాను. చాలా మంది సీనియర్ జర్నలిస్టులకు, ఎడిటర్లుగా ఎదిగిన ఎందరికో ఆయన గురువు అనే విషయం కూడా తెలుసు కానీ ముఖ పరిచయం లేదు.
సీఎం కేసీఆర్ ఆయనకు చెక్కు అందజేసిన మరుసటిరోజే కేఎల్ రెడ్డిని కలువాలని పొద్దున్నే హరి షాప్ వద్దకు వెళ్లాను. ఎప్పటి మాదిరిగా ఆరు గంటలకు ఆయన అక్కడికి వచ్చారు. ‘సార్ ఇంతకాలంగా రోజూ మిమ్మల్ని చూస్తున్నాను కానీ మీ గురించి తెలియదు’ అని చెప్పి పరిచయం చేసుకున్నాను. ఆ తర్వాత ఆయన గురించి ఆంధ్రభూమిలో వచ్చిన వ్యాసం, సీఎం కేసీఆర్ చేసిన ఆర్థిక సహాయం గురించి మాట్లాడుకుంటూ ‘మీ పరిచయం నా అదృష్టం’ అన్నాను. ఆయన ఏ మాత్రం స్పందించలేదు. మౌనంగా విన్నారంతే. ‘మీ ఇంటి పక గల్లీలోనే నేనుంటాను, మీకేదైనా పని ఉంటే నాకు చెప్పండి’ అన్నాను. ‘ఇతరులకు చెప్పి చేయించుకునే పనులేమీ నాకు ఉండవ’ని ఖరాఖండిగా తేల్చేశారు. ఆయనతో నడుచుకుంటూ వెళ్లే సందర్భంగా ఆయన చేతిలోని పాల ప్యాకెట్ ఉన్న సంచిని నేను పట్టుకుంటానని చెప్పి తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఒక్కసారిగా చేతిని విదిలించి నా సంచి నీవు మోయడమేమిటని గుర్రుగా చూడటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నా. కేఎల్ రెడ్డి వ్యక్తిత్వం, నిరాడంబరత్వం, నిర్మొహమాటం గురించి అప్పటివరకు వినడమే కానీ, స్వయంగా చూడటం అప్పుడే. సమాజంలో ఇప్పటికీ జర్నలిస్టులకు అంతో ఇంతో గౌరవం మిగిలి ఉందంటే అది కేఎల్ లాంటివారి వల్లనే అనిపించింది.
-వెల్జాల చంద్రశేఖర్ , 98499 98092