హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలకు గండికొట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తున్నదా? కరువు భత్యం (డీఏ) బకాయిలకు ఎగనామం పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందా? అంటే ఉద్యోగులు అవుననే అంటున్నారు. దీనికి ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు వంతపాడుతున్నారని మండిపడుతున్నారు. ఉద్యోగులకు నష్టం కలిగించేలా, సర్కార్కు మేలు చేసేలా సంఘాల నాయకులు ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు 5 డీఏలు చెల్లించాల్సిన ప్రభుత్వం.. రెండో పీఆర్సీని సైతం ప్రకటించాల్సి ఉన్నది. దీంతో పెండింగ్ డీఏలను పీఆర్సీలో విలీనం చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పీఆర్సీ అమలు తేదీ తర్వాత గల డీఏలను ఎలా విలీనంచేస్తారని జేఏసీలోని కొన్ని సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. పెండింగ్ డీఏలను పీఆర్సీలో విలీనం చేస్తే ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమని, చట్ట ప్రకారం చెల్లుతుందా? అన్న ప్రశ్నలొస్తున్నాయి. సాధారణంగా పీఆర్సీ ప్రకటించినప్పుడు అప్పటి వరకు ఉన్న కరువు భత్యాన్ని మూలవేతనంలో విలీనం చేస్తారు. దీనిని డీఏ మెర్జర్ అంటారు.
పీఆర్సీ గడువు తేదీకి ముందున్న డీఏలను మాత్రమే ఇలా విలీనం చేసే అవకాశముంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 33.67% డీఏ ఉన్నది. దీన్ని విలీనం చేసిన తర్వాతే పీఆర్సీ కమిటీ ఫిట్మెంట్ను కలిపి కొత్త వేతన స్కేళ్లను ఖరారు చేస్తుంది. కొత్త పీఆర్సీ ప్రకటించి వేతన స్కేళ్లు ఖరారయ్యాక గల పెండింగ్ డీఏలను పీఆర్సీలో విలీనం చేయడం కుదరదు.
రాష్ట్రంలో ప్రతి ఐదేండ్లకోసారి కొత్త పీఆర్సీ ప్రకటించే సంప్రదాయం ఉన్నది. ఈ ఐదేండ్ల కాలంలో ఉద్యోగులకు 10 డీఏలు అందుతాయి. కొత్త పీఆర్సీ ప్రకటించే సమయంలో ఈ 10 డీఏలను బేసిక్ పేలో విలీనం చేస్తారు. అనంతరం ఖరారు చేసిన ఫిట్మెంట్ను కలిపి కొత్త వేతన స్కేళ్లను నిర్ణయిస్తారు. పీఆర్సీ ప్రకటించిన తర్వాత వచ్చే నూతన డీఏలు ఎప్పుడూ విడిగానే ఉంటాయి. వాటిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేయాలి. కొత్త పీఆర్సీ వర్తింపజేసిన తర్వాత వచ్చే డీఏలను పీఆర్సీలో విలీనం చేసే సంప్రదాయమే లేదు.
రాష్ట్రంలో 2023 జూలై 1 నుంచి కొత్త వేతన స్కేళ్లు అమలు చేయాల్సి ఉన్నది. ఇప్పుడు పీఆర్సీ ప్రకటించినా 2023 నుంచే వర్తింపజేయాలి. అప్పటి నుంచి పీఆర్సీ బకాయిలను ప్రభుత్వం సర్దుబాటు చేయాలి. కానీ, 2023 జూలై 1కి ముందున్న డీఏలను ప్రభుత్వం క్లియర్ చేసింది. ప్రస్తుతం వాటిలో ఒక్కటి కూడా పెండింగ్లో లేదు. 2024 జనవరి నుంచి ఈ ఏడాది 2026 జనవరి వరకు ఇవ్వాల్సిన 5 డీఏలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కలిపితే మొత్తం 12.74% అవుతుందని అంచనా.
ఉద్యోగ సంఘాల జేఏసీలోని కొందరు నా యకులు పెండింగ్ డీఏలను పీఆర్సీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఇటీవలే డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించి, ప్రభుత్వానికి వంతపాడినట్టు సమాచారం. దీన్ని సాధారణ ఉద్యోగులతోపాటు జేఏసీలోని కొన్ని సంఘాల నాయకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. వారు ఎందుకు అలా మాట్లాడుతున్నారో? అర్థం కావడంలేదని ఓ ఉద్యోగ సంఘం నేత పేర్కొన్నారు.