దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఉత్సవాలను దేశ ప్రజలు విజయవంతం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. యావత్ దేశం ముక్త కంఠంతో జాతీయ గీతాలాపన చేయడం ముదావహం.
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ తర్వాత జాతీయ జెండాను భద్రపరిచే విధానాన్ని కేంద్రం దేశ ప్రజలకు సూచించకపోవడం విడ్డూరం. దీంతో జాతి సమున్నత కీర్తిబావుటా అయిన త్రివర్ణ పతాకానికి గౌరవం తగ్గిందా అనిపించింది. యావత్ భారతజాతి ఆత్మగౌరవం, మర్యాద, కీర్తిప్రతిష్ఠల నిలువెత్తు కేతనమైన జాతీయ జెండా గౌరవ మర్యాదలు తగ్గకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ‘ఫ్లాగ్ కోడ్’ నిబంధనలు తెలిసో, తెలువకో ఎక్కడపడితే అక్కడ, ఎలా పడితే అలా జాతీయ జెండాను పడేయడం బాధాకరం. దేశ ప్రజలకు జాతీయజెండాపై అవగాహన కల్పించి జెండాను భద్రపరిచే కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, సవరించిన ఫ్లాగ్ కోడ్ నిబంధనావళిపై చైతన్యం, ప్రజల్లో అవగాహన లేకపోవడంతోనే జెండాకు గౌరవం తగ్గిందని భావించాలి. ఈ మూడు రంగుల జెండా సుమారు 140 కోట్ల భారతీయుల విజయ దీపిక. అది సగౌరవంగా ఎగరడమే ప్రతి భారతీయుడి కోరిక. తరాలు మారినా ఆ జెండా జాతిలో కలిగించే ప్రేరణ, పవిత్రత, స్ఫూర్తి తగ్గదు, తగ్గించలేరు.
అమరుల త్యాగాలు, రక్త తర్పణాలతో ఆంగ్లేయుల నుంచి దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను తేవడంలో ఈ మువ్వన్నెల జెండా దేశంలోని ప్రతి పౌరుని చేతిలో ఆయుధమైంది. అలాంటి జెండాకు గౌరవం తగ్గకుండా ఫ్లాగ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. జాతీయజెండాను ఆవిష్కరించేటప్పుడు, అవనతం చేసేటప్పుడు, పునర్వినియోగించలేని పక్షంలో ప్రతి ఒక్కరూ ఆ నిబంధనలను పాటించాలి.
కేంద్ర ప్రభుత్వం 2022, జూలై 20న ఫ్లాగ్ కోడ్ నిబంధనలకు సవరణలు చేసింది. సవరించిన నిబంధనలు చాలాచోట్ల అతిక్రమించబడ్డాయి. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ లోపంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నది. ఆ నిబంధనల పట్ల కేంద్రం ప్రజల్లో అవగాహన కల్పించకపోవడం విషాదం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేవలం ప్రచారం కోసమే ‘ఆజాదీ కా అమృతోత్సవ్’ నిర్వహించిందనీ, ఆ తర్వాత ఫ్లాగ్ కోడ్ నిబంధనలూ పాటించలేదని దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటికీ అక్కడక్కడా కాగితపు, ప్లాస్టిక్ జెండాలున్నాయి. వస్ర్తాల జెండాలు కూడా వన్నె తగ్గి చిన్నబోతున్నాయి. ఆ జెండాలను ఫ్లాగ్ కోడ్ను పాటించకుండా అడ్డదిడ్డంగా ఎగరేస్తున్నారు. ఇలాంటి వాటన్నింటిని ప్రభుత్వం వెంటనే పునర్వినియోగించలేనివిగా భావించి గౌరవంగా పరిహరించే కార్యక్రమానికి పూనుకోవాలి. అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత శాఖలను అప్రమత్తం చేయాలి. పరిహరించే నిబంధనల ప్రకారం దహనం, ఖననం తప్పనిసరి అనేది విస్మరించకూడదు. జెండా దహనం, ఖననం అయ్యేవరకు సావధానంగా నిలబడి మౌనం పాటించాలి. జాతీయ జెండా నేలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
2002లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ‘ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా’ను అమల్లోకి తెచ్చింది. జాతీయ జెండాను వినియోగించుకోవడానికి వీలుగా మూడు భాగాలు చేశారు. మొదటిభాగంలో జాతీయ జెండా వినియోగానికి సాధారణ నిబంధనలున్నాయి. రెండో భాగంలో ప్రజలు, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు జెండా ఎగురవేయడంలో పాటించాల్సిన నిబంధనలను పేర్కొన్నారు. మూడో భాగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ఆధ్వర్యంలోని సంస్థలు పాటించాల్సిన విధానాలను ప్రస్తావించారు. 1974 ఆగస్టు 15 నుంచి రాష్ర్టాల ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అధికారిక ఉత్సవాల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం మొదలైంది. అలా పంద్రాగస్టు నాడు ముఖ్యమంత్రులు, జనవరి 26న గవర్నర్లు జాతీయ జెండాను ఎగురవేసే విధానాన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అమల్లోకి తీసుకువచ్చారు.
దేశ స్వాతంత్య్ర పోరాటంలో జాతిని ఏకంచేసి పరాయి పాలనను అంతమొందిచింది మన త్రివర్ణ పతాకం. శాంతికి, సహనానికి, సత్యానికి పరాక్రమానికి ప్రతిరూపమైన మన జెండా ఫ్లాగ్ కోడ్ నిబంధనలకు అనుగుణంగా, గౌరవం తగ్గకుండా నిత్యం పరిరక్షించబడాలి. ఈ సమష్టి బాధ్యత పాలకులు, పౌర సమాజానిదే. ఆ దిశగా అడుగులు పడాలని ఆశిద్దాం.
(వ్యాసకర్త: మేకిరి దామోదర్ , 95736 66650 సోషల్ అనలిస్ట్)