బీబీపేట్, అక్టోబర్ 21: అకాల మరణాలతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పెద్దపెద్ద ప్రమాదాల బారిన పడినప్పుడు ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నవారైనా ఆర్థికంగా చితికిపోతున్నారు. దీంతో నేటి కాలంలో బీమా పాలసీలకు ఆదరణ పెరిగింది. చాలామంది సంపాదనలో కొంత పొదుపు చేయడంతోపాటు బీమాకోసం కేటాయిస్తున్నారు. ఇందుకోసం వారివారి స్థోమతనుబట్టి జీవిత, ప్రమాద, ఆరోగ్య పాలసీలను ఎంచుకుంటున్నారు. అన్నివర్గాలవారికోసం ప్రధానంగా పేదల కోసం తపాలా శాఖ చిన్న మొత్తంతో ప్రమాదబీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తె చ్చింది. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గ్రూపు, టాటా ఏఐజీతో కలిసి 399 రూపాయలకే రూ.10 లక్షల యాక్సిడెంట్ పాలసీని అమలు చేస్తున్నారు. అన్నివర్గాల వారికి అందుబాటులో ఉండేలా ఈ పాలసీని తీసుకురావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ప్రయోజనాలెన్నో..
ఏడాదికి రూ.399 ప్రీమియంతో రూ.10 లక్షల బీమా సౌకర్యంతో తీసుకువచ్చిన ఈ పాలసీతో వినియోగదారులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం పొందినా బాధిత కుటుంబానికి రూ.10 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది. ప్రమాదం జరిగితే వైద్య ఖర్చుల కోసం రూ. 60వేల వరకు ఇస్తారు. విద్యా ప్రయోజనాలకు 10 శాతం లేదా రూ.లక్ష వరకు చెల్లిస్తారు. దవాఖానలో ఖర్చుల కోసం పది రోజులపాటు వెయ్యి రూపాయల చొప్పున, రవాణా ఖర్చుల కోసం రూ.25 వేల వరకు చెల్లిస్తారు.
18 నుంచి 65 ఏండ్లవారు అర్హులు..
ఈ ప్రమాద బీమా తీసుకోవాలంటే 18-65 ఏండ్ల మధ్య వయస్సు వారు అర్హులు. బీమా కోసం పోస్టాఫీసులో రూ.100 చెల్లించి ముందుగా ఖాతా తీసుకోవాలి. అనంతరం రూ.399 ప్రీమియం చెల్లిస్తే ఏడాది కాలంపాటు బీమా వర్తిసుంది. ప్రమాదంలో పాలసీదారు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందుతుంది. ఇద్దరు పిల్లల చదువులకు రూ.లక్షవరకు ఇస్తారు.
చాలా మంచి స్కీం..
పేద కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా తపాలాశాఖ అనేక పథకాలను అమలు చేస్తున్నది. అతి తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా కల్పిస్తూ కొత్త స్కీం అందుబాటులోకి వచ్చింది. ఏడాదికి కేవలం రూ.399 చెల్లిస్తే ఆ కుటుంబానికి ఎంతో భరోసా కలుగుతుంది. ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ పాలసీ. ప్రజలందరూ ఈ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
-ముత్యాలయ్య, సబ్ పోస్ట్మాస్టర్, బీబీపేట్