మునుగోడు తీర్పు దేశ పురోగమనానికా? తిరోగమనానికా? దేనికి సంకేతమవుతోందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నదీ దేశం. మునుగోడులో తలపడుతున్న మూడు పార్టీల తీరిదీ.
బీజేపీ: కోటీశ్వరులను కుబేరులుగా, పేదలను నిరుపేదలుగా రూపొందిస్తూ భారత్‌ను బడా కుబేరులున్న దేశంగా ప్రపంచంలో మూడోస్థానంలో, నిరుపేదల దేశాల్లో ప్రథమ స్థానంలో నిలబెట్టింది.
కాంగ్రెస్: తమ తాతల ఘనకార్యాలే తప్ప, తాముగా దేశానికి చేసిందేమిటి? ఏం చేస్తే, ఈ దేశం బాగుపడుతది? నేడు దేశానికి, తమ పార్టీకి ప్రధాన శత్రువులెవరు? ఆ శత్రువును ఢీకొనడానికి ఎవరెవరితో కలసినడవాలో అవగాహన అనే ‘చుక్కానీ’ లేని నావలా పయనిస్తున్నది.
టీఆర్ఎస్: ‘మిషన్ కాకతీయ’, ‘మిషన్ భగీరథ’ల ద్వారా తాగు, సాగునీరందిస్తూ వ్యవసాయాభివృద్ధిని, తద్వారా పారిశ్రామిక ప్రగతిని ఏడేండ్లలో స్థూల జాతీయోత్పత్తి, తలసరి ఆదాయాల్లో తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన నిలబెట్టింది.
మునుగోడు ముందస్తు ఎన్నికలకు బీజేపీయే కారణమన్నది దేశమెరిగిన సత్యం. ప్రజలకు తాము చేసింది చెప్పి, వాళ్ల అభిమానంతో అభ్యర్థులను గెలిపించుకోవడం కాదు, ఈడీ, ఐటీ సీబీఐలతో ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరించి, ప్రలోభపెట్టి లొంగదీసుకొని తన బలాన్ని పెంచుకోవడానికి అలవాటుపడింది బీజేపీ. కులమేదైనా కోటీశ్వరులే బీజేపీ లక్ష్యం. ఎందుకంటే… తాము ప్రజలకు చేసిందేమీ లేనందున ప్రజాభిమానంతో గెలవటం కష్టం. కోటీశ్వరులైతే కోట్లు వెదజల్లి గెలుస్తారన్నది బీజేపీ నమ్మకం. అందుకే ‘డబ్బుతో అధికారం-అధికారంతో డబ్బు’ అన్న సూత్రాన్ని కాంగ్రెస్ యాభై శాతం పాటిస్తే; బీజేపీ వంద శాతం పాటిస్తున్నది.
ఐతే తానుగా ఒక్క రూపాయి అంటని మోదీని బీజేపీ తురుఫుగా వాడుకుంటున్నది. తమది అవినీతిరహిత పార్టీ అనటానికి మోదీయే నిదర్శనమంటున్నది. అంతేకాదు, ఆయనకున్న అసాధారణ శక్తియుక్తులను కూడా ఇంధనంగా వినియోగించుకుంటున్నది. అసాధారణమైన శక్తియుక్తుల్ని కార్పొరేట్ల కోసం కాకుండా, కష్టజీవుల ప్రగతి కోసం వినియోగించి ఉంటే, దేశ చరిత్రలో భారతీయుల హృదయాల్లో ‘నరేంద్రుని’లా కొలువుదీరి సార్థక నామధేయుడై ఉండేవారు నరేంద్ర మోదీ. భారతీయుల ఆయనకిచ్చిన సదవకాశాన్ని రెండు పర్యాయాలు జారవిదుల్చుకొని, చరిత్ర చెత్తబుట్ట దిశగా పయనిస్తున్నారు పాపం మోదీ. తాను చాయ్ అమ్ముకొని బతికిన కష్టజీవినంటూ గద్దెనెక్కిన మోదీజీ మనసా, వాచా, కర్మణా కార్పొరేట్ల కోసం పరిశ్రమిస్తున్నారు. అందువల్లనే కరోనా సమయంలో కూడా దేశ ఆర్థిక వనరులు, ప్రజలు పాతాళానికి పడిపోయినా, అదానీ, అంబానీల సిరిసంపదలు ఆకాశానికి ఎగసినయి. ఎలాగంటే..
1. లక్షల కోట్ల ప్రజాధనంతో దేశదేశాలు పర్యటిస్తూ అదానీ, అంబానీలకు కోటానుకోట్ల కాంట్రాక్టులు, బిజినెస్ డీల్స్‌ను తెచ్చిపెట్టారు. 2. లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ సంస్థలను వేల కోట్లకే కట్టబెట్టారు. ‘కష్టజీవుల కోసం కానే కాదు, కార్పొరేట్ల కోసమే పరిశ్రమిస్తుంది బీజేపీ!’ అనటానికింతకన్నా నిదర్శనమేం కావాలి? దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన ‘కాంగ్రెస్’ను చూద్దామంటే? అది బీజేపీ మీద గెలవటం అటుంచి, తన ఉనికిని కాపాడుకోవటమెలాగో తెలియక ఆత్మరక్షణలో పడింది! నావికుడు లేని నావలా కొట్టుమిట్టాడుతుంది కాంగ్రెస్. ‘అధ్యయనశీలి అయిన కేసీఆర్’ నాయకత్వాన తెలంగాణ రూపొందటమే కాక, ఏడేండ్లలో అన్ని రంగాల్లోనూ దేశంలో అగ్రభాగాన నిలిచింది తెలంగాణ. ఇది దేశమెరిగిన సత్యం. గిన్నీస్ రికార్డుతో సహా తెలంగాణకు లభించిన పలు జాతీయ అవార్డులు, రివార్డులే అందుకు నిదర్శనం.
అట్టి ప్రగతిశీల నాయకుడు దేశానికే అవశ్యమన్న భావనతో ‘దేశ్ కీ నేత కేసీఆర్’ అంటూ ఆదరాభిమానాలతో ఆయన్ను స్వాగతిస్తున్నది దేశం’. ఎందుకంటే ‘దేశాన్ని వెనక్కు నెట్టేస్తూ ఇతర ప్రభుత్వాలను కూల్చుతూ, కాంగ్రెస్‌తో సహా పార్టీలన్నింటినీ విచ్ఛిన్నం చేస్తూ.. రాష్ర్టాల హక్కులను హరిస్తూ.. అడవులు-ఓడరేవులు, విమానాలు, రైల్వేలు, ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ తెగనమ్ముతూ రక్షణరంగంతో సహా, అన్నింటినీ ప్రైవేటీకరించి, రిజర్వేషన్లకు తావులేకుండా చేసి, సామాజిక సమతుల్యతను దెబ్బతీస్తూ- మత విద్వేషాలు రగుల్చుతూ ప్రపంచంలో తలవంచుకునేలా చేస్తున్న బీజేపీని ద్వేషించని పార్టీలు గానీ, నేతలు గానీ, ప్రజలు గానీ లేరన్నది నిశ్శబ్ద సత్యం. అయినా సరే బీజేపీని నిలదీయటానికి ఏ ఒక్కరూ సాహసించలేకపోతున్నారన్నదీ నిజం. ‘ఈ నేపథ్యంలో తన పని తాను చేసుకుపోతున్నా, వెంటాడి వేధిస్తూ గాండ్రిస్తున్న ‘బీజేపీ పెద్దపులి’ మీద, ‘టీఆర్ఎస్ దుక్కిటెద్దు’ హటాత్తుగా తిరగబడింది’. అందుకే ‘మునుగోడు’లో టీఆర్ఎస్ విజయం దేశ ప్రగతికి, కాంగ్రెస్ గెలుపు దేశ అయోమయానికి, ‘బీజేపీ గెలుపు దేశ పతనానికి సంకేతంగా’ భావిస్తూ, ఆసేతు హిమాచల పర్యంతం ఆసక్తితో ఎదురుచూస్తున్నది !
‘ప్రజల కోసం మంచిని అన్వేషించటం, ఆ మంచి కోసం పరిశ్రమించటం, అందుకోసమే జీవించటం, ప్రజా నాయకుని లక్షణాలు’ అన్నారు అబ్రహం లింకన్. ఈ లక్షణాలు పుష్కలంగా ఉన్న ‘కేసీఆర్’కు అవే లక్షణాలతో కొనసాగుతున్న, వామపక్ష పార్టీల సహకారం లభించటాన్ని శుభ సంకేతంగా భావిస్తున్నారు భారతీయులు. టీఆర్ఎస్, వామపక్షాల సహాయ సహకారాలు, మునుగోడుతోనే కాదు, దేశవ్యాప్తంగా కొనసాగటం, దేశానికే గాదు, బీఆర్ఎస్, వామపక్షాలకూ శ్రేయస్కరం. బీఆర్ఎస్, వామపక్షాల జోడీ, కాంగ్రెస్‌తో సహా బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఒక్కటిగా కదం తొక్కిస్తే ‘బీజేపీ-ముక్త్ భారత్’ సుసాధ్యమేనంటూ అశేష భారతీయులు ఆశగా ఎదురుచూస్తున్నరు!
గీత 18-78: యత్ర యోగీశ్వరః కృష్ణో… నీతిర్మతిర్మమ ‘జ్ఞానియైన శ్రీకృష్ణుడు-కార్య సాధకుడైన అర్జునుడు ఉన్నచోట విజయం అభ్యుదయం, రాజనీతి, సిరి, ధర్మం, వర్ధి ల్లుతయి’ అంటున్నది భగవద్గీత!- అలాగే అర్జున-శ్రీకృష్ణుల్లాంటి బీఆర్ఎస్-వామ పక్షాల ‘జైత్రయాత్రతో బీజేపీపై విజయం’ భారతదేశానికి అభ్యుదయం. ‘రాజ్యాంగ పరిరక్షణ’ ఆసేతు హిమాచల పర్యంతం సిరి సంపదలు ‘సుస్థిర ఫెడరల్ వ్యవస్థ’ ప్రవర్ధిల్లు గాక! తథాస్తు! భరతమాతకు శుభమస్తు.
(వ్యాసకర్త: పాతూరి వెంకటేశ్వరరావు , 98490 81889, ప్రజామార్గదర్శిని శ్రీమత్భగవద్గీత రచయిత)