కొన్ని నెలల నుంచి జాతీయ రాజకీయాలు గమనిస్తున్న మేధావి వర్గాలకు నిరాశ, నిర్వేదం కలుగుతున్నాయి. ఎనిమిదేండ్ల కిందటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ధరలు తగ్గించటంలో, అవినీతిని అరికట్టడంలో, దేశ ప్రజలకు రక్షణ కల్పించడంలో- నిజానికి అన్ని రంగాల్లోనూ విఫలమైందని, తమ పార్టీ దేశాన్ని ఉద్ధరిస్తుందని ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ తాము చెప్పిన ఒక్క నీతినైనా పాటించిందా? ఒక్క మాటనైనా నిలబెట్టుకుందా? అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కనిపించనంత విధ్వంసం, విద్వేషాలు ఈ ఎనిమిదేండ్ల పాలనలో పెరిగాయా, తరిగాయా? ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం నిరాశాజనకంగానే ఉంది.
ఒకే జాతీయ పార్టీ దేశాన్నంతా ఒక్కగాటలో కట్టి పరిపాలించడం సాధ్యమా? పైగా ప్రపంచంలో ఏదేశంలోనూ లేనన్ని వైవిధ్యాలు మన దేశంలో ఉన్నాయి. ఇటువంటి నిరంకుశ పాలన అసాధ్యమని 75 ఏండ్ల అనుభవం నిరూపించింది. మొదటి నుంచీ భారతావని ఒక్కదేశంగా లేదు. మనకు అందినంత చరిత్రలోతుల్లోకి వెళ్లినా, ఈ భూమి చిన్న చిన్న రాజ్యాలుగా విలసిల్లి, ప్రతిప్రాంతం తన సంస్కృతి, భాష, ఆచార వ్యవహారాలు తనవిగా పరిఢవిల్లి మసిలాయి. వెయ్యేండ్ల పరాయి పాలనలో మగ్గినా, వారివారి సంస్కృతులను కాపాడుకుంటూ కాలక్షేపం చేశారు భారతీయులు. స్వాతంత్య్రానంతరం స్వేచ్ఛ వచ్చిందని, ఇంకా వస్తుందనీ భావించారు కానీ, అనుభవం దానికి వ్యతిరేకంగా ఉంది. ఏ ఒక్క రాష్ట్రం నుంచో అయిన ప్రధాని- నెహ్రూ కాలం నుంచీ మోదీ కాలం దాకా దేశాన్నంతా అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. విశాల భావనలు లేని పరిపాలకులతో ప్రతి రాష్ట్రం వెనుకబడింది. అందు కే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అయిదవ ర్యాంకు సంపాదించామని పరిపాలకులు బీరాలు పలికినా, 130 కోట్ల ప్రజలకు దాని ఫలాలు అందకుండా పోయాయి.
భారతదేశ రాష్ర్టాలు అమెరికా దేశ రాష్ర్టాలను పోలివుంటాయి. యూరోప్‌లోని వివిధ దేశాల వారు వలసలు పోయి ఒక్కో ప్రాం తంలో స్థిరపడి రాష్ర్టాలుగా మారిన అమెరికా, వారి వైవిధ్యాలను గుర్తించి ప్రతి రాష్ర్టానికి దానికి తగిన రాజ్యాంగం, కావలసిన స్వేచ్ఛనిచ్చి, మొత్తంగా ఒక దేశంగా నిలిచి, గత శతాబ్దం నుంచీ సాంకేతికంగా, రాజకీయంగా ఎంతో ప్రబల శక్తిగా ఎదిగింది. మరి అటువంటి ప్రగతి చారిత్రక, సాంస్కృతిక బలం ఉన్న మన దేశం ఎందుకు సాధించలేకపోయింది? దీనికి ఒకే ఒక్క సమాధానం ఒక్క జాతీయ పార్టీ గుప్పిటలో అధికారం మొత్తం కేంద్రీకృతమవడమే! ఆరు దశాబ్దాలు తమ అనుకూల వర్గాలను బుజ్జగిస్తూ, ఓట్లు సంపాదించి ప్రజా ప్రగతిని పట్టించుకోని పార్టీ కాంగ్రెస్ అయితే, అధికారం సంపాదించి తమ అనుకూల వ్యాపార దిగ్గజాలకు జాతి సంపదను దోచిపెడుతూ, సామాన్య ప్రజా జీవితాన్ని నరకం చేస్తున్న పార్టీ బీజేపీ. తల పగలడానికి అమెజాన్ అయితే ఏమిటి? అంబానీ, అదానీ అయితే ఏమిటి? ఏం తేడా? సామాన్యుల జీవితాలు ఇంత అతలాకుతలంగా మారినప్పుడు ఏం చేయాలి?
దేశానికి ఇప్పుడు అత్యవసరంగా కావాల్సినది ఒక్కటే! అదే రాష్ర్టాల సమాఖ్య ఏర్పడి కేంద్రంలో అధికారం సంపాదించడం. దానికి అద్భుత మేధ కలిగిన రాజకీయ నాయకుడు కేసీఆర్ శ్రీకారం చుట్టడం చాలా సంతోషించదగిన విషయం. పధ్నాలుగేండ్ల సుదీర్ఘ పోరాటంలో తన పట్టుదల, మేధ, వాక్చాతుర్యం నిరూపించుకున్న కేసీఆర్, ముఖ్యమంత్రిగా తన ప్రజ్ఞను కూడా నిరూపించుకున్నారు. ప్రజల అవసరాలను తీర్చి, వారికి సంక్షేమం సమకూర్చారు. రాష్ట్ర ప్రజలను నిష్పక్షపాతంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా ప్రజాభద్రతను సుస్థిరపరిచారు. వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, అన్నివర్గాల వారికి సంతృప్తికరంగా తన పాలనా సామర్థ్యాన్ని కూడా చూపించారు. చతుర్వేదాలలో సనాతన ధర్మాన్ని పాలకుడు ఏ విధంగా కాపాడాలో చెప్పారు. అటువంటి పాలన తెలంగాణలో రాష్ట్రంలో నెలకొన్నది.
బీజేపీ అసమర్థ పాలనతో అతలాకుతలమైన ప్రజా జీవనాన్ని గాడిలో పెట్టాలంటే కేసీఆర్ ప్రతిపాదించిన భారత్ రాష్ట్ర సమితి, మిగతా రాష్ర్టాలలోని ప్రాంతీయ పార్టీల నేతల సహకారంతో కేంద్రంలో అధికారంలోకి రావాల్సిందే. ఒక రాష్ర్టానికి సంబంధించిన విషయాలపై ప్రాంతీయ పార్టీలకు తప్ప మిగతా రాష్ర్టాల నేతలకు అవగాహన ఉండదు. అందుకే అల్లూరి సీతారామరాజు తెలంగాణ అమరవీరుడనీ, కొమురంభీం బ్రిటిష్ పాలకులతో కొట్లాడాడనీ చరిత్రలు పుట్టిస్తారు. ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం ప్రగతి సాధించాలంటే దేశం సమాఖ్యగా ఉండాల్సిందే. కేంద్రీకృత అధికారం కుదరని పని. దేశంలోని ప్రాంతీయ పార్టీల నేతలు తమ దృష్టిని విశాలం చేసుకొని కేసీఆర్ లాంటి మేధావి సలహాలు పాటించి, వారివారి రాష్ర్టాలకు కావలసిన విధానాలు రూపొందించుకొని, భారత్ రాష్ట్ర సమితిలో భాగస్వామ్యం పొంది, ఈ దేశాన్ని ప్రగతిపథంలో నడపాలి.
ప్రస్తుత ప్రధాని మోదీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యుద్ధం చేస్తున్నారు… నిజమే, కానీ ఎవరితో? అంతర్జాతీయ స్థాయి లో కొన్ని దేశాలతో అయితే, జాతీయ స్థాయి లో సామాన్య ప్రజలతో యుద్ధం చేస్తున్నాడు. ఎదురునిలిస్తే అణచివేయడం విధానంగా మారింది. మళ్లీ ప్రజా జీవనం సరిగ్గా మారాలంటే భారత్ రాష్ట్ర సమితి వంటి సమా ఖ్య అవసరం. ప్రజలు దీన్ని గుర్తించి ప్రవర్తిస్తే భవిష్యత్తు నందనవనం అవుతుంది.
-కనకదుర్గ దంటు 89772 43484