కేసీఆర్ ప్రారంభించనున్న జాతీయపార్టీ స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త ముందడుగు కానున్నది. దేశ వర్తమాన- భవిష్యత్తులనూ, సమాజాన్నీ కేంద్రంగా చేసుకుంటూ, గుణాత్మకమైన మార్పుల కోసం సరికొత్త విధానాల ప్రాతిపదికగా కేసీఆర్ పార్టీ ఉండబోతున్నదనే గుర్తింపు ఇప్పటికే క్రమంగా వ్యాపిస్తున్నది. ఈ భిన్నమైన విధాన ప్రాతిపదికల కారణంగానే ఈ పార్టీ ఆవిర్భావం దేశ రాజకీయాలను మలుపు తిప్పనున్నది.
దేశానికి ఇటువంటి పార్టీ అవసరమని కేసీఆర్ కొంతకాలంగా చెప్తూ, ఆ అవసరమేమిటో వివరంగా, గణాంకాలతో సహా పేర్కొంటున్నప్పటికీ మొదట కొంతకా లం ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. జాతీయస్థాయిలో కూడా ఇదంతా కేవలం అధికా రం కోసం ప్రయత్నం అనుకున్నారు. కేసీఆర్ ప్రసంగాలను, ఆయన చెప్పే గణాంకాలను జాగ్రత్తగా వింటూ ఆలోచించినవారికి మాత్ర మే అందులో గల లోతు, సీరియస్‌నెస్ అర్థమవుతూ వచ్చాయి. ఇక్కడ ప్రతిపక్షాలు, సినిక్స్ ఎంత వ్యతిరేక ప్రచారాలు చేసినా ఈ మార్పు మొదలు కావటం గమనించదగినది. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి, తన ఆలోచనలను, ఫిలాసఫినీ కేసీఆర్ పట్టువిడవని విక్రమార్కుని వలె పదే పదే చెప్తూపోవటం. ఎప్పటికప్పుడు మరింతగా ప్రజలకు అర్థమయేవిధంగా వారి మెదళ్లకూ మనస్సులకూ హత్తుకునే విధంగా గణాంకాలతో సహా వివరిస్తుండటం. ఇందుకు తన భాష, శైలి, సూటిదనం, స్పష్టత తోడవటం సరేసరి.
పైన అనుకున్న మార్పునకు ఇది ఒక కారణం కాగా, ప్రధాని మోదీ పరిపాలనపై, బీజేపీ తీరు తెన్నులపై క్రమంగా వ్యతిరేకత, విసుగు పెరుగుతుండటం రెండవ కారణం. ఇక్కడ, ఇతర రాష్ర్టాలలో, జాతీయస్థాయిలో కూడా ఇది కనిపించటం మొదలైంది. ఈ రెండు కారణాల వల్ల సాధారణ ప్రజలు, చదువుకున్నవారు, అంతకన్న పై స్థాయిలో ఉన్న వివిధ రంగాల వారు కూడా కేసీఆర్ ప్రసంగాల వైపు చెవి ఒగ్గటం పెరిగింది.
సరిగా ఇదే సమయంలో మరొక గమనించదగిన స్థితి కన్పించసాగింది. మోదీకి, బీజేపీకి ప్రత్యామ్నాయం ఇక ‘అవసరమేమో’, ‘అవసరమే’ అన్న భావన మొదలై, అందుకు తగిన నాయకుడు ఎవరని చుట్టూ తేరిపార చూడటం మొదలుపెట్టినవారు, ఒక్కొక్క నాయకుడినే పరిశీలించసాగారు. కారణాలు ఏవైతేనేమి ఆ నాయకులలో కొందరు అసలు మాట్లాడటం లేదు, లేదా పొడిపొడిగా మాట్లాడుతున్నారు. నిన్నటివరకు ఫైర్ బ్రాండ్స్‌గా ఉండిన మరికొందరు ఎందుకైతేనేమి చప్పబడుతున్నారు. తమ వైఖరితో రాజీ పడకుండా గట్టిగానే ఉన్న ఇంకొందరికి జాతీయస్థాయికి వచ్చేందుకు తమ పరిమితులు తమకున్నాయి. మొత్తం మీద ఈ పరిస్థితుల మధ్య వెనుకడుగు లేకుండా నిలిచి ప్రతి అంశంపై బలంగా, నిర్భయంగా, నిరంతరం వినిపించే గొంతు ఒక్క కేసీఆర్‌దే అవుతున్నది. అదే ఒక ఆకర్షణ కాగా, దేశ వర్తమాన-భవిష్యత్తుల పట్ల, గతంలో ఎవ్వరూ మాట్లాడనివిధంగా, ఒక గుణాత్మకమైన మార్పు కోసం, దీర్ఘకాలిక దార్శనికతను ప్రదర్శించటం, ఈ అంశాలపై తన అపరిమితమైన పరిజ్ఞానం, వాగ్ధార అదనపు ఆకర్షణగా మారాయి. తన పాలనలో తెలంగాణలో ఇప్పటికే సాధించిన అనేకానేకం, ఆయన సమర్థతకు అద్దం పడుతున్నాయనే అవగాహన అంతటా ఏర్పడసాగింది.
ఈ వివిధ పరిస్థితుల కారణంగా కేసీఆర్ ప్రతిపాదిత జాతీయపార్టీ పట్ల దృష్టిపెట్టడం, సానుకూలంగా ఆలోచించటం ఇటీవల ప్రజల్లో క్రమంగా పెరుగుతున్నది. ఇక కొత్త పార్టీ పట్ల ఆదరణ ఏ విధంగా ఉంటుందనే ప్రశ్నకు ఒక వివరణ అవసరం. సమాజం మూడు స్థాయుల్లో ఉంటుంది. నాయకులు, వారి వర్గాలు, ఉన్నత తరగతుల వారు ఒకటి. మధ్య తరగతి, పట్టణవాసులు, విద్యావంతులు, ఉద్యోగులు, వివిధ వృత్తులవారు, వ్యాపారులు వగైరా రెండు. గ్రామీణులు, రైతులు, కూలీలు, గ్రామీణ వృత్తులవారు, పేదలు వగైరా మూడు. గత చరిత్రను సమీక్షిస్తే, సమస్యల పట్ల అసంతృప్తి, దానితో శాంతియుత లేదా హింసాత్మక ఉద్యమాలు, లేదా తమ ఓటుతో ప్రభుత్వాలను పడగొట్టడం వంటి భూకంపాలు సృష్టించింది ప్రతిసారీ ఈ రెండవ, మూడవ తరగతులే. కనుక, మొదటి తరగతిలోని పార్టీలు వగైరా తొలుత ఏ వైఖరి తీసుకున్నా, అంతిమంగా కింది రెండు తరగతుల వైఖరే నిర్ణయాత్మకం అవుతూ వస్తున్నది. దానినిబట్టి మొదటి తరగతి తన వైఖరిని మార్చుకోక తప్పదు. కనుక, కేసీఆర్ పార్టీకి సంబంధించి అజెండా, దానిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవటం, తను రాజీ పడకుండా నిలిచే ధీరుడనే నమ్మకాన్ని వారికి కలిగించటం కొత్త పార్టీ విజయానికి కీలకమవుతాయి.
టంకశాల అశోక్