సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. డ్రగ్స్ కేసులో కింగ్‌పిన్‌గా ఉన్న నిందితుడు ఏకంగా పోలీసు స్టేషన్ నుంచే పారిపోయాడంటే అక్కడ పోలీసు వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అ ర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా డ్రగ్స్ విక్రయాలపై ఈగల్ టీమ్ ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా ఇటీవలే నీతుబాయ్ ఇంటిపై దాడులు చేసిన ఈగల్ అధికారులు పలు డ్రగ్స్ కేసుల్లో కింగ్‌పిన్‌గా ఉన్న ముజఫర్‌ను మంగళవారం పట్టుకుని తదుపరి విచారణ నిమిత్తం అదేరోజు రాత్రి నార్సింగి పోలీసులకు అప్పగించారు. పోలీసుల అదుపులో ఉన్న ముజఫర్ తనకు కడుపునొప్పిగా ఉందని పోలీసులను నమ్మించి, విజిటర్స్ బాత్రూమ్కు వెళ్లాడు. బాత్రూమ్ వెంటిలేటర్‌కు గ్రిల్స్ లేకపోవడంతో బాత్రూమ్ వెంటిలెటర్లో నుంచి బయటకు దూకి, తర్వాత పోలీసు స్టేషన్ ప్రహరీ దూకి పరారయ్యాడు. ఈ క్రమంలో స్టేషన్ బయట రోడ్డుపై అటుగా వెళ్తున్న ఓ క్యాబ్‌ను ఆపి అందులో పరారైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.
నిందితుడి పరారీపై పలు అనుమానాలు..!
దాదాపు 30రోజుల పాటు ఈగల్ పోలీసులు శ్రమించి పట్టుకున్న నిందితుడు ముజఫర్ నార్సింగి ఠాణా నుంచి తప్పించుకున్నాడా? లేక ఎవరైన తప్పించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు ఠాణాలో ఉన్న బాత్రూమ్కు కాకుండా విజిటర్స్ హాల్లో ఉన్న బాత్రూమ్కి ఎందుకు వెళ్లాడు? ఆ బాత్రూమ్లో ఉన్న వెంటిలేటర్‌కు గ్రిల్స్ లేవని నిందితుడికి ఎలా తెలుసు? పథకం ప్రకారమే నిం దితుడు తప్పించుకున్నాడా లేక పోలీసులే తప్పించారా?.. అనే అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా నిందితుడు బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి బయటకు దూకి, ఆ తర్వాత పోలీసు స్టేషన్ ప్రహరి దూకి, రోడుపై క్యాబ్ ఆపి ఉడాయించే వరకు స్టేషన్‌లోని పోలీసులు ఏం చేస్తున్నారనే.. ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
రంగంలోకి ప్రత్యేక బృందాలు..
పోలీసు స్టేషన్లో నుంచి పారిపోయిన డ్రగ్స్ డాన్ ముజఫర్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు. నిందితుడి కోసం నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో సైతం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.