జెన్ జీ తీరు గురించి చాలా విశ్లేషణలు, వ్యంగ్యాలు వినిపిస్తుంటాయి. కానీ ఈ నాణాలకి మరోవైపు కూడా ఉంది.
వీళ్లు పరమ బద్ధకిష్టులు: ఉదయాన్నే లేవడం, పొద్దుపోకముందే నిద్రపోవడం లాంటి దినచర్య వీళ్లలో కనిపించకపోవచ్చు. ఎక్కువసేపు ల్యాప్టాప్ ముందే కూరుకుపోవచ్చు. అన్నిటి కోసం ఇన్స్టంట్ పరిష్కారాలు చూడవచ్చు. అది బద్ధకం అనుకోలేం. జెన్ జీ కాయకష్టం కంటే నేర్పు, నైపుణ్యాలకీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. మనసు నచ్చింది తోచిన సమయానికి చేయడానికీ, ప్రాధాన్యం లేని పనులు సులువుగా అయిపోవడానికి ఇష్టపడుతుంది.
పెద్దలంటే గౌరవం లేదు: ప్రశ్నించి తెలుసుకోవడం, తన ఆలోచనలు నిర్భయంగా వినిపించడం.. జెన్ జీ తీరు. కాబట్టి ఒకరి హోదా, అధికారం, కులం, వయసుని బట్టి అసంకల్పితంగా గౌరవం ఇచ్చే అలవాటు వారికి ఉండదు. వారి నుంచి వినయం ఆశించి భంగపడటం నిరాశగానే ఉండవచ్చు. కానీ, ఆ ముక్కుసూటి తత్వంతోనే స్పష్టత వస్తుంది.
ఫోన్లకి బానిసలు: డిజిటల్ పరికరాల మధ్య పుట్టినవాళ్లు. చదువు, స్నేహాలు, వార్తలు, సినిమాలు.. అన్నీ ఫోన్లలోనే సాగించాల్సిన తరం వాటి వైపే మొగ్గుచూపడం సహజమే. దీన్ని సాకుగా తీసుకుని సామాజిక మాధ్యమాల్లోని అల్గారిథమ్స్ అన్నీ కూడా వారిని బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ సమస్యని గమనించిన జెన్ జీ.. డిజిటల్ డీటాక్స్ దిశగా అడుగులు వేస్తున్నది.
స్థిరమైన కెరీర్ ఉండదు: ఏదో ఓ ఉద్యోగంలో దశాబ్దాల తరబడి పనిచేయడం, ఎట్టి పరిస్థితుల్లోనూ సంస్థ పట్ల విశ్వాసంగా ఉండటం జెన్ జీలో కనిపించకపోవచ్చు. కానీ, అందుకు వాళ్లు చెప్పే కారణాలను తీసిపారేయలేం. తమ నైపుణ్యానికి తగిన ప్రతిఫలం, ఎదుగుదల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలో తప్పేముందని చెబుతారు. ఓ రూపాయి మిగుల్తుందని తెలిసినా దశాబ్దాల తరబడి సేవ చేస్తున్న ఉద్యోగులను తొలగించడానికి సిద్ధపడిపోయే సంస్థలకు లేని విశ్వాసం, ఉద్యోగులకు ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తారు.
సామాజిక నైపుణ్యాలు లేవు: సోషల్ మీడియాలో మునిగిపోయే జెన్ జీలు ముఖాముఖిలో నిలబడలేరన్నది ఓ అపోహే. వాళ్లు నేరుగా కలుసుకునేందుకే తొలి ప్రాధాన్యం ఇస్తారనీ, అవసరమైన ఇతరుల్ని నడిపించే నాయకులుగానూ ఉండగలరనీ చాలా సర్వేలు చెబుతున్నాయి. స్టార్టప్స్ పెట్టడం దగ్గర నుంచి, ఉద్యోగాలు మారడం వరకూ.. జట్టును నడిపించే నాయకుడిగా ఎదగడం కూడా ఓ లక్ష్యమే.
ఇవే కాదు జెన్ జీలు విమర్శలను తట్టుకోలేరు, ఆఫీసులకి రావడానికి ఇష్టపడరు, ఇంట్లోవాళ్ల కష్టాన్ని గుర్తించరు, ప్రతి సవాలునీ తేలికగా తీసుకుంటారు, వ్యాపారం చేతకాదు, పొదుపు చేయరు.. ఇలా సవాలక్ష విమర్శల్ని ఎదుర్కొంటూ ఉంటారు. కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఆ తీరు వెనుక కొన్ని స్పష్టమైన దృక్పథాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు మనమెందుకు వాటిని పాటించకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నామా అన్న ఆలోచన కూడా కలగవచ్చు.