నిజమైన గ్రామీణ వైభవాన్ని చూడాలనుకునే వారికి.. రాజస్థాన్‌లోని ‘మండావా’ ఓ అద్భుతమైన గమ్యస్థానం. ఎడారి దేశపు సంస్కృతిని, సంప్రదాయ కళాత్మకతను ఇష్టపడే వారికి మంచి విహార కేంద్రం. సాయంత్రం వేళల్లో ఇక్కడి ఇసుక తిన్నెలు, గ్రామీణ వీధుల్లో
ఒంటెలపై తిరగడం.. జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభవం. సుప్రసిద్ధ హవేలీలు, అందమైన పెయింటింగ్స్‌తో.. ‘ఓపెన్ ఆర్ట్ గ్యాలరీ’గా పేరు తెచ్చుకున్నది. గత కాలపు సామాజిక, సాంస్కృతిక వాతావరణాన్ని రాజస్థానీ పల్లె ప్రతిబింబిస్తున్నది. ఫలితంగా, దేశవిదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్నది.
మండావా.. రాజస్థాన్‌లోని ఝున్ఝును జిల్లాలో షెకావతి ప్రాంతంలోని అందమైన చారిత్రక గ్రామం. ఇక్కడ 18, 19వ శతాబ్దాలకు చెందిన పురాతన హవేలీలు.. వీధివీధినా కనువిందు చేస్తాయి. సంప్రదాయ రాజస్థానీ చిత్రకళలో ఈ హవేలీల గోడలపై వేసిన రంగురంగుల చిత్రాలు ప్రధాన ఆకర్షణ. ఇక్కడి చౌఖానీ హవేలీ, లక్ష్మీనారాయణ్ లాడియా హవేలీ, మోహన్‌లాల్ సరాఫ్ హవేలీ లాంటివి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇక 18వ శతాబ్దంలో ఠాకూర్ నవాల్ సింగ్ నిర్మించిన మండావా కోట.. మరో ప్రత్యేక ఆకర్షణ. ఇందులోని మిర్రర్ వర్క్, అందమైన పెయింటింగ్స్.. వీక్షకుల చూపు తిప్పుకోనివ్వవు. స్థానిక గైడ్‌తో కలిసి, ఒంటెలపై ఇక్కడి వీధుల్లో విహరిస్తూ.. ప్రతి హవేలీ వెనుక ఉన్న కథలను, చరిత్రను తెలుసుకోవడం ఓ జీవితానుభవం.
దేనికదే ప్రత్యేకం..
ఇక్కడి హవేలీలు దేనికదే ప్రత్యేకమైనవి. మురార్కా హవేలీలోని పెయింటింగ్స్ అత్యంత అద్భుతంగా ఉంటాయి. ఇందులో కృష్ణ లీలలు, పాతకాలపు రైళ్లు, రాచరిక ఊరేగింపుల చిత్రాలను చూడవచ్చు. రెండు పెద్ద ప్రవేశ ద్వారాలతో గోయెంకా డబుల్ హవేలీ.. మరింత ప్రత్యేకం. ఇక్కడి గోడలపై రాజస్థానీ సంస్కృతితోపాటు, బ్రిటిష్ కాలం నాటి జీవనశైలి చిత్రాలు కూడా కనిపిస్తాయి. ఝున్ ఝున్‌వాలా హవేలీలో.. బంగారు రంగుతో చేసిన లీఫ్ పెయింటింగ్స్ ప్రత్యేక ఆకర్షణ.
ఇదీ చరిత్ర..
ప్రాచీన కాలంలో చైనా, మధ్యప్రాచ్య దేశాలను అనుసంధానించే సుప్రసిద్ధ ‘సిల్క్ రూట్’లో మండావా ముఖ్యమైన వ్యాపార కేంద్రంగా ఉండేది. ఇక్కడి నుంచి వస్తువుల రవాణా పెరగడంతో.. కొందరు ధనిక వ్యాపారులు మండావాలోనే స్థిరపడ్డారు. వ్యాపారుల రక్షణ, సైనిక ప్రయోజనాల కోసం షెకావతి పాలకుడైన ఠాకూర్ నవాల్ సింగ్.. మండావా కోటను నిర్మించాడు. ఈ క్రమంలో సంపన్నులైన కొందరు వ్యాపారులు.. తమ వైభవాన్ని చాటుకోవడానికి కోట చుట్టుపక్కల హవేలీలను నిర్మించారు. ఈ భవనాల లోపలి, వెలుపలి గోడలపై రాజస్థానీ జానపద కథలు, పురాణాలు (ముఖ్యంగా రాధా-కృష్ణుల లీలలు), నాటి బ్రిటిష్ కాలపు సాంస్కృతిక ఘట్టాలను అద్భుతమైన రంగుల చిత్రాలుగా మలిచారు. అవి ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిలిచి.. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
ఏడాదంతా షూటింగ్స్..
వింటేజ్ లుక్, రాజరిక వైభవం కారణంగా.. సినిమా షూటింగ్‌లకు మండావా ప్రధాన కేంద్రంగా మారింది. అందుకే, ఇక్కడ ఏడాది పొడవునా సినిమా షూటింగ్‌లు జరుగుతూనే ఉంటాయి. ఆమిర్ ఖాన్ ‘పీకే’, సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయిజాన్’ లాంటి ఎన్నో చిత్రాల్లోని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు.
ఇలా చేరుకోవాలి :
రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి సుమారు 170 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే మండావా చేరుకోవచ్చు. ఈ గ్రామానికి సమీప రైల్వే స్టేషన్.. ఝున్ఝును. ఇక్కడి నుంచి మండావాకు వాహనాలు అందుబాటులో ఉంటాయి. జైపూర్, ఢిల్లీ, బికనీర్ నగరాల నుంచి కూడా మండావాకు రోడ్డు కనెక్టివిటీ ఉంది. ఇక, మండావాను సందర్శించడానికి అక్టోబర్ నుంచి మార్చి వరకు మంచి సమయం. ఈ కాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పగటిపూట వీధుల్లో నడుస్తూ హవేలీలను చూడటానికి వీలుగా ఉంటుంది. ఎండకాలంలో ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది.