వికారాబాద్, జూలై 1 : జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా, ప్రజా జీవనానికి ఎలాంటి విఘాతం కలగకుండా చూసేందుకు పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం.. జూలై 1 నుంచి 31 వరకు జిల్లావ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని వికారాబాద్ ఎస్పీ స్నేహమెహ్రా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు నిర్వహించరాదన్నారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మందితో కూడిన జనసమూహాలుగా ఏర్పడకూడదని స్పష్టం చేశారు.
ప్రజలకు తీవ్ర ధ్వని కాలుష్యం, అసౌకర్యం కలిగించేలా, నిబంధనలకు విరుద్ధంగా డీజే, సౌండ్ సిస్టమ్స్‌ను ఉపయోగించడంపై పూర్తిగా నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని కోరారు.