న్యూఢిల్లీ, జూలై 1: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ తమ 71వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రిటైల్, బిజినెస్ బ్యాంకింగ్ బలోపేతానికి కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత డిజిటల్ సదుపాయాలను బుధవారం ఆవిష్కరించింది. రిటైల్ కస్టమర్ల కోసం యోనో సేవలను విస్తరించినట్టు ఓ ప్రకటనలో బ్యాంక్ తెలిపింది.
అలాగే కొత్త ఖాతాదారులు.. ఓ సింగిల్ 3-ఇన్-1 డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ ద్వారా ఎస్బీఐక్యాప్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌తో డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లు కలగలిసిన సేవింగ్స్ అకౌంట్‌ను తెరుచుకునే అవకాశాన్ని కల్పించింది. ఇక అర్హత కలిగిన కస్టమర్లు తమ సేవింగ్స్ ఖాతాను ఆన్లైన్లోనే కార్పొరేట్ సాలరీ అకౌంట్‌గా మార్చుకోవచ్చు. డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీల ద్వారా ఖాతాదారులు కర్బన ఉద్గారాలను ఎంత మేరకు ఆదా చేశారో తెలుసుకోవచ్చు.
ఇలా నెలవారీ గ్రీన్ స్కోర్‌నూ చూసుకోవచ్చు. ఏజెంటిక్ ఏఐ ఆధారిత ‘యోనో జీ’ని పరిచయం చేసింది. యోనో బిజినెస్ వెబ్, మొబైల్ వేదికల్లో నిరంతరం అందుబాటులో ఉంటుంది. డిజిటల్ ఇన్నోవేషన్, ఏఐ ఇంటెలిజెన్స్‌ల వినియోగంతో బ్యాంకింగ్ సేవలను మరింత సరళతరం చేయాలన్నదే తమ లక్ష్యమని ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి అన్నారు.