కరెంటు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల పట్ల ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష సాధింపు, అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సత్సంబంధాల్లో అగ్గి రాజేస్తున్నది. అసలు సమస్య ఏమిటో, దానిలో ఉన్న లోటుపాట్లను ఈ వ్యాసం ద్వారా విశ్లేషించుకుందాం.
ఇటీవల బహిరంగ సభలో ఒక బీజేపీ నేత మాట్లాడుతూ.. ‘దుబ్బాక ఎన్నికల నుంచి రైతులకు మీటర్లు బిగించనున్నారని కేసీఆర్ బెదిరిస్తున్నారు, మరి మీటర్లు బిగించారా?’ అని అడుగుతున్నారు. కేసీఆర్ ఉన్నరు కాబట్టే తెలంగాణ రైతులకు మీటర్లు బిగించలేదు. గత ఐదారు నెలలుగా ఏపీ, యూపీ, గుజరాత్ తదితర రాష్ర్టాల్లో మీటర్లు బిగించే కార్యక్రమం జరుగుతూనే ఉన్నది.
రాజ్యాంగం ప్రకారం ‘విద్యుత్’ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి అంశం. ఆయా రాష్ర్టాల స్థానిక, భౌగోళిక ఆర్థిక, సామాజిక, వ్యవసాయిక పరిస్థితులను బట్టి స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు తగు నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పంచవర్ష ప్రణాళికలు, పలురకాల గ్రామీణ విద్యుదీకరణ, పట్టణ అభివృద్ధి పథకాలు చేదోడు కాగా దేశంలోని విద్యుత్ సంస్థలు గణనీయమైన అభివృద్ధిని సాధించాయి. కానీ, అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా ఎదగలేకపోయాం. విద్యుత్ లభ్యత, పంపిణీ విషయాల్లో ఇంకా భారీ లోటును ఎదుర్కొంటూ వినియోగదారులకు, రైతులకు అవసరమైన విద్యుత్‌ను అందించడంలో విఫలమయ్యాం. ఈ విషయాన్ని అందరూ అంగీకరించవలసిదే.
రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని జెన్కోలు, కేంద్ర సంస్థలైన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ తదితర సంస్థలే కాకుండా, ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. సరఫరా రంగంలో ఆయా రాష్ర్టాల ఆధీనంలోని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్లు, కేంద్ర రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లు సమర్థవంతంగానే పనిచేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తి చేసుకున్న డిచ్పల్లి-వార్ధా 765 కేవీ లైన్ ఏర్పాటు తర్వాత దేశవ్యాప్తంగా విద్యుత్‌ను సరఫరా చేసుకోవడానికి అవసరమైన దేశీయ గ్రిడ్ అందుబాటులోకి వచ్చింది. అంతర్రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కీలకపాత్ర పోషిస్తున్నది.
వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండి విద్యుత్ పంపిణీ వ్యవస్థలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే కొనసాగుతున్నాయి. విద్యుత్ సరఫరా చట్టం-2003 వచ్చిన తర్వాత ప్రయోగాత్మకంగా చాలాచోట్ల ప్రైవేట్ పెట్టుబడిదారులకు ద్వారాలు తెరిచినప్పటికీ ముంబై, ఢిల్లీ లాంటి నగర ప్రాంతాల్లో తప్ప ప్రైవేట్ డిస్కంలు విజయవంతం కాలేకపోయాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం సరళీకృత విధానాలతో ప్రైవేట్ విద్యుత్ పంపిణీ లైసెన్సుల మంజూరీకి అనుకూలంగా తీసుకురానున్న ‘విద్యుత్ సవరణ బిల్లు-2022’ దేశవ్యాప్తంగా, ఉద్యోగ వర్గాల్లో, రైతుల్లో, ప్రజా సంఘాల్లో ఆందోళనకు కారణమైంది. ఆగస్టు 8న పార్లమెంటులో ప్రవేశపెట్టబడిన బిల్లు దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 26 లక్షల విద్యుత్ ఉద్యోగుల సమ్మె హెచ్చరికలు, రైతుసంఘాల ఆందోళనల నేపథ్యంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి నివేదించబడింది. ఇదే సమయంలో యూపీలోని పూర్వాంచల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ప్రాంతాల్లోని రైతుల పంపుసెట్లకు, ఏపీలోని విజయనగరం జిల్లాలోని రైతుల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడంతో రైతుల్లో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి.
పీవీవీఎన్‌ఎల్ పరిధిలోని 4 లక్షల 70 వేల పంపు సెట్లకు గాను 20 శాతం మేర అంటే.. లక్షా ఇరవై వేల మీటర్లు బిగించారు. రైతులకు వేలల్లో బిల్లులు రావడంతో మీటర్లను రైతులే స్వయంగా తీసివేసి మీరట్ పరిసర విద్యుత్ కార్యాలయాల్లో కుప్పపోశారు. భారతీయ కిసాన్ యూనియన్ పంచాయతీలు, ధర్నా నేపథ్యంలో ప్రభుత్వాలు వెనుకడుగు వేసినట్లుగా అర్థమవుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 26 లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 24 గంటల విద్యుత్‌ను రైతులకు అందిస్తున్నది. ఇలాంటి పథకాన్ని కొనసాగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అందుకుగాను వేల కోట్ల రూపాయల పెట్టుబడులను వెచ్చించి ఉత్పత్తి, పంపిణీ, సరఫరా రంగాలను తీర్చిదిద్దుకున్న తీరు ప్రశంసనీయం. నాలుగేండ్లుగా 24 గంటల ఉచిత విద్యుత్‌ను అనుభవిస్తున్న రైతులు రాబోయే ‘విద్యుత్ సవరణ బిల్లు-2022’, ఇతర రాష్ర్టాల్లోని మీటర్ల బిగింపు వంటి చర్యలను చూసి వణికిపోతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి చేపట్టిన చర్య లు తెలంగాణ రాష్ట్రం పట్ల కక్షపూరితంగా ఉన్నట్లు విద్యుత్‌రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్లు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్‌కు విడుదల చేయాల్సిన నిధులను నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్ కాంట్రాక్టుతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా భాగస్వామిని చేస్తూ త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సంస్థలు పేచీ పెడుతున్నాయి. పనులు పూర్తికావస్తున్న దశలో అగ్రిమెంట్లను తిరగదోడటం కక్షపూరితమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క బాకీలు లేకున్నా ఉన్నట్లుగా చూపించి ఇండియన్ పవర్ ఎక్సేంజీలో క్రయవిక్రయాలు జరపకుండా అక్రమ నిషేధం విధించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నాయి. హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ లేని అధికారాలతో ఉద్దేశపూర్వకంగా (ఎన్ఎల్డీసీ) నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు ఆదేశాలివ్వడం వేధింపు చర్యలకు పరాకాష్టగా పేర్కొంటున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాలకు, వాటి ఆధీనంలోని విద్యుత్ సంస్థలకు ఫెసిలిటేటర్‌గా వ్యవహరించాల్సిన ఎన్ఎల్డీసీ, పీఎఫ్సీ, ఆర్ఈసీ, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖలు
వ్యవహరిస్తున్న తీరు సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతంగా భావించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ తన బొందిలో ప్రాణమున్నంత వరకు రైతుల బోర్ల దగ్గర మీటర్లు పెట్టనిచ్చే ప్రసక్తే లేదని భావోద్వేగంగా ప్రకటించారు.
గత ఐదేండ్లలో వివిధ కార్పొరేట్ సంస్థలకు రూ.9,91, 640 కోట్ల విలువ గల రుణాలను మాఫీ చేసినట్లు ఇటీవల రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నది. మరి అలాంటప్పుడు దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థలకు లక్షా ఇరవై వేల కోట్ల (రుణాలను) బకాయిలను మాఫీ చేయడానికి లేదా సర్దుబాటు చేయడానికి కేం ద్రానికున్న అభ్యంతరాలేమిటని ప్రశ్నిస్తున్నారు. డబ్బు ఏం డ్లుగా విద్యుత్ సంస్థలు నిర్మించుకున్న లక్షలాది కోట్ల రూపాయలు విలువ గల ఆస్తులు, సేవలను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం ఉన్న అప్పులు నామమాత్రమే. నిర్మాణాత్మకమైన పద్ధతుల ద్వారా విద్యుత్‌రంగాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా మలచుకోవాల్సిన గురుతర బాధ్యత కేంద్రానిదే. ‘ఎద్దు ఏడ్చిన ఎవుసం-రైతు ఏడ్చిన రాజ్యం’ బాగుపడవని కేసీఆర్ తరచూ వాడే నానుడిని కేంద్రం గుర్తుపెట్టుకుంటే వారికే మంచిది.
(వ్యాసకర్త: అధ్యక్షులు, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్, టీఎస్ఎస్పీడీసీఎల్)
-తుల్జారాంసింగ్ ఠాకూర్
78930 05313