గురువింద గింజ తన నలుపెరుగదన్నట్లు బీజేపీ వ్యవహరిస్తున్నది. విపక్ష పాలిత రాష్ర్టాల్లో ప్రభుత్వాలపై, పార్టీలపై ప్రతి చిన్న విషయానికీ దర్యాప్తు సంస్థల ద్వారా వెంటబడి వేధించే కేంద్ర సర్కారు తమ పార్టీ పాలనలో ఉన్న రాష్ర్టాలపై మాత్రం కాలు కదపటం లేదు. నోరు మెదపటం లేదు. దీనికి తాజా ఉదాహరణ.. మధ్యప్రదేశ్. చిన్న పిల్లల పోషకాహార పథకంలో వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై ఆరోపణలు వచ్చాయి. స్వయంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆడిటింగ్లోనే ఈ కుంభకోణం బట్టబయలైంది. కానీ ఇప్పటి వరకూ మధ్యప్రదేశ్‌కు ఈడీ, సీబీఐ, ఐటీలలో ఏదీ దర్యాప్తు కోసం వెళ్ళలేదు. బీజేపీ పాలనలోనే ఉన్న మరో రాష్ట్రం కర్ణాటకలోనూ ఇదే తీరు. రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసే నిధుల్లో కమీషన్లు ఇస్తే తప్ప తమకు అవి వచ్చే పరిస్థితి లేదని ఆధ్యాత్మిక సంస్థలైన మఠాల అధిపతులు చెబుతున్నా చర్యలు ఉండవు.
బీజేపీ చేస్తున్న ‘అవినీతిపై పోరు’ ప్రహసనంగా మారింది. విపక్షాల్లో బలమైన నేతలను భయపెట్టి తమ పార్టీలో చేర్చుకోవటానికి కూడా దీనినొక సాధనంగా వాడుకుంటున్నది. బీజేపీలో చేరేంతవరకూ వారిపై అనేక ఆరోపణలు చేయటం, చేరగానే ఆ ఆరోపణల సంగతి వదిలేయటం పరిపాటిగా తయారైంది. బెంగాల్లో ముకుల్‌రాయ్, మహారాష్ట్రలో నారాయణ్ రాణె, అస్సాంలో హిమంత బిశ్వ శర్మ వంటి ఎన్నో ఉదాహరణలు. ప్రస్తుతం అస్సాం సీఎంగా ఉన్న హిమంత బిశ్వ శర్మ గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు బీజేపీ అనేక అవినీతి ఆరోపణలు చేసింది. ఆయన ఆ పార్టీని వదిలిపెట్టి బీజేపీలో చేరగానే అన్నీ మాయమైపోయాయి. దీనిపై విలేకర్లు ప్రశ్నిస్తే అమిత్‌షా నోరు మెదపకపోవటం ఆ పార్టీ ద్వంద్వప్రవృత్తికి నిదర్శనం.
ఈడీ, సీబీఐ, ఐటీ తదితర సంస్థలన్నీ నిర్దిష్టమైన బాధ్యతల నిర్వహణ కోసం ఏర్పాటైనవి. కానీ, మోదీ హయాంలో అవి వాటి అసలు లక్ష్యాన్ని మర్చిపోయి.. ప్రతిపక్షాలను వేధించటానికి పరిమితమైపోయినట్లుగా కనిపిస్తున్నది. బీజేపీ, మోదీ సర్కారు ఆడుతున్న ఈ ఆట దేశానికి తీరని నష్టం చేస్తుంది. వివిధ రాష్ర్టాల ప్రజలు పార్లమెంటరీ పరిధిలో తమ ఆకాంక్షలను వ్యక్తం చేసే వేదికలే భిన్న రాజకీయ పక్షాలు. ప్రజలకు పార్లమెంటరీ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లేలా చేయడం ప్రమాదకరం. ఇప్పటికే సీబీఐకి పలు రాష్ర్టాలు అనుమతులను నిరాకరించాయి. భిన్నత్వాన్ని, సమాఖ్య స్ఫూర్తిని కేంద్రం గౌరవించక పోవడం వల్ల ఏర్పడిన పరిస్థితి ఇది. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ సర్కారు ఇటువంటి అల్పమైన పనులకు పాల్పడటం తగదు. రాజ్యాంగ విలువలను, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోతే బీజేపీకి పాలించే అర్హత లేదని ప్రజలు గ్రహించే రోజు వస్తుంది.