కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందన్న సంకేతాలు కనిపించినా అది నిజం కాదని తేలిపోయింది. ఎక్కడ చూసినా ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. దేశంలో 12 నెలలకు సరిపడా మాత్రమే మారక ద్రవ్య నిల్వలున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, శ్రీలంక, భూటాన్‌లు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. మన ఆర్థిక వ్యవస్థ కూడా పతనం దిశగా వేగంగా దిగజారుతున్న పరిస్థితుల్లో భవిష్యత్తు పట్ల ప్రజల్లో భయాలు పెరిగిపోతున్నాయి.
రూపాయి విలువ ఇంత పతనం కావటం ఆందోళనకరం. దీని ప్రభావం పలు రంగాలపై తీవ్రంగా ఉంటోంది. ముఖ్యంగా సామాన్యుడి జీవన చక్రానికి కీలకమైన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు మరింతగా పెరగడం ఖాయంగా కనిపిస్తున్నది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరుగుతాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బీఐ తీసుకున్న రెపో రేటు పెంపు నిర్ణయం కూడా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వం ఇంధనంపై పన్నులతోపాటు జీఎస్టీని తగ్గించి, పేదలకు ఉచిత ఆహార పథకాలను విస్తరించాలి. ఎంఎస్ఎంఈ రంగానికి నగదు బదిలీ చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధికి ఊపునివ్వాలి. దానివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కేంద్రం ఇంతవరకు ఆ దిశగా చొరవ తీసుకోవడం లేదు. కరోనా తర్వాత దేశంలోని శ్రామిక శక్తిలో 40 శాతం మంది పని వివరాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. మిగిలిన 60 శాతం మంది ఏం చేస్తున్నారో లెక్కల్లేవు. అటు వ్యవసాయ రంగంలో ఉన్న వారి ఆదాయాలు అంతంత మాత్రమే.
దేశంలో ధనికులు, పేదల మధ్య అంతరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రాష్ర్టాల తలసరి ఆదాయంలోనూ విపరీతమైన తేడాలున్నాయి. దేశంలో రాజకీయంగా పెరుగుతున్న సంక్లిష్టతలు కూడా పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి. చాలా విషయాల్లో రాష్ర్టాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కేంద్రం ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలేవీ ఫలితాన్నివ్వడం లేదు. రాష్ర్టాలు సహకరించకుండా భాగస్వామ్యం చేయకుండా చేసే ఏ సంస్కరణలతోనూ ఉపయోగం ఉండదు. మరోపక్క దేశంలో విద్యుత్ సంక్షోభం కూడా తరుముకు వస్తున్నది. చాలా రాష్ర్టాల్లో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయం చూడకుండా హడావుడిగా పునరుత్పాదక ఇంధనాల నుంచి వచ్చే విద్యుత్ వైపు మళ్లాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. ఇప్పటికే పలు రాష్ర్టాలు బొగ్గు సంక్షోభంలో కూరుకుపోయాయి. తలాతోకా లేని నిర్ణయాలతోనే కేంద్రం కొంప ముంచుతున్నది. సజావుగా సాగుతున్న ఆర్థిక రథానికి పెద్ద నోట్ల రద్దు పెద్ద వినాశనాన్నే తెచ్చింది. అప్పట్నుంచీ ఆర్థిక వ్యవస్థ నేల చూపులే చూస్తున్నది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఆర్థిక తిరోగమనానికే దారి తీస్తున్నాయి. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నా ఫలితం కనిపించడం లేదు. పైకి ఎన్ని గొప్పలకు పోతున్నా ఆర్థిక వ్యవస్థ మేడిపండు చందమేనని తేటతెల్లమవుతున్నది.
మన దేశంలో ఎగుమతుల కన్నా, దిగుమతుల పరిమాణం చాలా పెద్దది. దిగుమతుల భారం పెరిగే కొద్దీ ఆర్థిక సూచీలన్నీ పతనమవుతాయి. సంక్షోభం ముదురుతున్న కొద్దీ దాన్ని చక్కదిద్దటం కూడా కష్టసాధ్యమవుతుంది. వివేకంతో ముందే మేలుకోవాల్సిన ప్రభుత్వాలు, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కొవిడ్ ప్రభావంతో చాలా నష్టపోయిందని, ఆ లోటు పూడ్చుకోవడానికి కనీసం 12 ఏండ్లు పడుతుందని ఆర్బీఐ నివేదిక తేల్చింది. ఆ నివేదిక ప్రకారం కరోనా కారణంగా దేశానికి రూ.52 లక్షల కోట్ల ఉత్పత్తి నష్టం వాటిల్లింది. 2020-21 తొలి త్రైమాసికంలో భారీ క్షీణత నమోదు చేసిన ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుండగా, 2021-22 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కొవిడ్ రెండో దశ పరిణామాలు మళ్లీ దెబ్బ తీశాయని నివేదిక వివరించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం చుట్టుముడుతున్నది. నిత్యావసరాల ధరలు పెరగడం, అంతర్జాతీయ సరఫరాలో అంతరాయాలు ఇందుకు కారణమని కేంద్రం వివరించింది. కొవిడ్‌కు ముందు దేశంలో వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదైంది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం శ్రీలంక బాటలో ఉందంటూ గణాంకాల ఆధారంగా అనేక మంది అంచనా వేస్తున్నారు. 2023లో 14 శాతం వృద్ధి రేటు సాధిస్తే తప్ప ఆర్థిక రథం ముందుకుపోయే పరిస్థితి లేదు. ఆర్థిక వ్యవస్థ పరుగు పెట్టాలంటే ధరలను నియంత్రించడమే తొలి మెట్టు.
ఉత్పత్తి సామర్థ్యం పెరగకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడవు. ఉత్పత్తి పెరగాలంటే సరకులకు గిరాకీ పెరగాలి. గిరాకీ పెరగాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. అదే ఇప్పుడు లోపించింది. అన్ని వైపులా మోపుతున్న భారాల నుంచి ప్రజలకు ఊరట కలిగించడానికి బదులు కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచుతూ వారి నడ్డి విరుస్తున్నది. అయితే పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని నివారించే మార్గాలున్నాయి. వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలి. పంటలకు కనీస మద్దతు ధర అందించి రైతుల ఆదాయం పెరిగేలా చూడాలి. బ్యాకింగ్, బీమా లాంటి కీలక రంగాలను ప్రైవేటీకరించకూడదు. ప్రభుత్వ రంగ పెట్టుబడులను పెంచాలి. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ప్రజలందరికీ ఉచిత వైద్యం, ఉచిత విద్య అందించడం ద్వారా వారు వాటికి చేస్తున్న ఖర్చును ఇతర అవసరాలకు మళ్లించాలి. కార్పొరేట్ల లాభం కోసం కాకుండా సామాన్యుల కేంద్రంగా ఆర్థిక విధానాలు కొనసాగించాలి.
-నాదెండ్ల శ్రీనివాస్ 96764 07140