బండి సంజయ్ చెప్పులు మోశారు. ఎవిరివి? అమిత్ షావి. ఎవరాయన? కేంద్ర హోంశాఖ మంత్రి. బీజేపీకి బాస్ కాని బాస్! కేంద్రంలో, బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత పెద్ద పవర్ సెంటర్. అలాంటాయన చెప్పులను ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మోస్తే.. అది కచ్చితంగా ఆక్షేపణీయమే. అమిత్ షా కంటే బండి సంజయ్ వయసులో చిన్నవాడు కావొచ్చునేమో కానీ పదవిలో మాత్రం కాదు.
అమిత్ షా, బండి సంజయ్‌లు ఇద్దరూ భారతదేశ అత్యున్నత చట్టసభ పార్లమెంట్‌కు సమాన హోదాలో ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు. వారి ప్రవర్తన హుందాగా ఉండాలి. హోదాకు తగ్గట్టుగా నడవడిక ఉండాలి. వారి మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ అంతర్గత శిబిరాల్లో ఎవరు ఎవరి చెప్పులు మోసినా, బూట్లు తుడిసినా, పాదపూజలు చేసుకున్నా ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రులుగా, పార్టీ అధ్యక్షులుగా ప్రజా జీవనంలో తిరుగుతున్నప్పుడు ప్రజాస్వామిక విలువలను కచ్చితంగా పాటించి తీరాల్సిందే. ప్రజాస్వామిక స్ఫూర్తికి వన్నె తెచ్చే విధంగా ప్రవర్తించాల్సిందే. తమకు ఓట్లేసి.. గెలిపించి.. అత్యున్నత చట్టసభలకు పంపించిన ప్రజల గౌరవ మర్యాదలను, ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా మసలుకోవాల్సిందే. ఒకరు దొరతనాన్ని, మరొకరు బానిస బుద్ధిని ప్రదర్శిస్తూ ‘భారతీయ సంస్కృతి’ ముసుగులో దాక్కుంటామంటే కుదరదు. ఈ సోయే ఇప్పుడు బండి సంజయ్‌లో, అమిత్ షాలో లోపించింది. లోక్‌సభలో సహచర ఎంపీ, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తన చెప్పులను మోసుకొస్తుంటే వద్దని అమిత్ షా వారించి ఉంటే హుందాగా ఉండేది. ఆయన గౌరవం పెరిగేది. బహుశా అధికార దర్పం అడ్డువచ్చిందేమో.. ఆయన ఆ పని చేయలేదు.
సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద అమిత్ షాకు చెప్పులను అందించడం, దానిని సమర్థించుకోవడం, అమిత్ షా తనకు తండ్రి లాంటివారు, రాజకీయ గురువు అని చెప్పుకోవడం వెనుక బండి సంజయ్‌కు కొన్ని నిర్దిష్ట లక్ష్యాలున్నాయి. బీజేపీలో పవర్ సెంటర్‌గా, అగ్ర నాయకుడిగా వెలుగొందుతున్న అమిత్ షాను ప్రసన్నం చేసుకోవాలన్న వ్యూహం దాగి ఉన్నది. అమిత్ షాను ప్రసన్నం చేసుకుంటే.. ఆయన ఇగోను సంతృప్తి పరిస్తే.. పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చునని, రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పేరును ప్రకటింపజేసుకోవచ్చునని భావించి ఉండవచ్చు. తాను చెప్పులు మోయడమే కాకుండా తమ పార్టీలోని ఇతరులు కూడా తనతో పోటీ పడి చెప్పులు మోయాల్సిన పరిస్థితి సృష్టించిన ఘనత బండి సంజయ్‌కే దక్కుతుంది.
నిజానికి తెలంగాణకు సంబంధించినంత వరకు బీజేపీలో ఇలా చెప్పులు మోసే సంస్కృతి గతంలో లేదు. ఇప్పుడిప్పుడే రాజకీయంగా వృద్ధిలోకి వస్తున్న బండి సంజయ్ ఈ స్థితికి దిగజారడానికి ఏదోరకంగా అధికారం అనుభవించాలన్న కాంక్షనే కారణమై ఉండవచ్చు. గతం లో వివిధ రాష్ర్టాల కాంగ్రెస్ నాయకులు కూడా తమ అధిష్ఠానాన్ని సంతృప్తి పరిచేందుకు సూట్‌కేసులు మోయడం, చెప్పులు మోయడం లాంటి పనులు చేసేవారు. అలా మోసి మోసి ఉన్నత పదవులు పొందినవారు చాలామందే ఉన్నారు. ఇప్పుడు బీజేపీలోకీ కాంగ్రెస్ సంస్కృతి విస్తరిస్తున్నది. పదవుల కోసం సూట్‌కేసులు, చెప్పులు మోసే నాయకులు రాష్ట్ర ప్రయోజనాల పట్ల, ప్రజల పట్ల ఎంత దారుణంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించేవారో గతంలో చూశాం. ఢిల్లీకి సలాం కొట్టిన నాటి పాడు రోజులను మళ్లీ ఆహ్వానిద్దామా? కందిబండ కృష్ణప్రసాద్, 91827 77010