ప్రధాని మోదీకి ఒక విషయం బాగా అర్థమైంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా, నిరుద్యోగం ఎంత పెరిగినా, యువతను మోసగించేందుకు అగ్నిపథ్ వంటి పథకాలు తెచ్చినా, బ్యాంకులను దోచి లక్షల కోట్లు తనవారికి అప్పజెప్పినా, ఎన్నికల హామీలు అమలుపరచకున్నా, ఇతర పార్టీల ప్రభుత్వాలపై నగ్నంగా వివక్ష చూపినా, వాటిని వరుసగా పడగొట్టినా, విభేదించేవారిపై సీబీఐ, ఈడీ దాడులు జరిపినా, ఫెడరలిజాన్ని దెబ్బతీసినా తన అధికారం నిలబెట్టుకునేందుకు ఒకే ఒక్కటి చాలు. అది, ప్రజలను మతం పేరుతో నిరంతరం రెచ్చగొడుతూ తప్పుదారి పట్టించటం.
రెండేండ్లలో తిరిగి ఎన్నికలు వస్తున్న స్థితిలో, ప్రశ్న అంతా ఒక్కటే. ‘సమస్యలు కాదు, అభివృద్ధి కాదు, మతమే ప్రధానం’ అనే మోడల్‌ను మోదీ మరొకసారి ప్రజల ముందుకు తెస్తారా? లేక ప్రజలు, యువతరం వాస్తవాలను వివేకంతో గ్రహించి తమ జీవితాలను, దేశాన్ని బాగుపరుచుకుంటారా అనేదే. అందుకోసం మోదీ ‘మోడల్’ను, రహస్యాన్ని ప్రజలు భంగపరచటం అవసరం.
నరేంద్ర మోదీకి గుజరాత్ కాలం నుంచి తెలిసిన రహస్యమే ఇది. రాష్ట్ర రాజకీయాలలో ఉన్నంతకాలం ఇదే మంత్రాన్ని పాటించారు. ‘గుజరాత్ మోడల్’ అంటూ ప్రచారం చేసుకున్న దానిలో నిజమైన అభివృద్ధి సూచికలు, మానవాభివృద్ధి సూచికలు ఏవీ లేవని, ఆ విషయాలలో ఆయన రాష్ట్రం కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ర్టాలకు ఎక్కడా సరిపోలేదని త్వరలోనే అందరికీ తెలియవచ్చింది. కాకపోతే ఆయన ‘మోడల్’ ధనిక వర్గాలకు మాత్రం బాగా ఉపయోగపడింది. వారి ప్రయోజనాల కోసం తను అధికారంలో కొనసాగేందుకు, పైన చెప్పినట్లు, ప్రజలను మతం పేరిట రెచ్చగొట్టే ‘మోడల్’ను ఆయన విజయవంతంగా అనుసరించారు. సామాన్య ప్రజల సమస్యలపై మాత్రం ఏమీ చేయలేదు.
తర్వాత జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించినప్పుడు ఆరంభంలోనే అటువంటి ‘మోడల్’ను తేవటం వీలుకాదు గనుక, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వపు వైఫల్యాలను తన ప్రచారానికి ఒక సాధనంగా మార్చుకున్నారు. గుజరాత్ ప్రజల కోసం చేయని అభివృద్ధిని చేశానని చెప్పుకుంటూ ఒక ‘మోడల్’గా చూపటం రెండవ సాధనమైంది. ఈ రెండు సాధనాలు కలిసి 2014లో విజయాన్ని తెచ్చిపెట్టాయి. తన ‘అభివృద్ధి మోడల్’లో ప్రజలకు అవసరమైన అభివృద్ధి అన్నది నేతిబీరలో నెయ్యి వంటిదని తెలిసిపోయేందుకు ఎక్కువ కాలం పట్టలేదు. అన్ని అభివృద్ధి సూచీలలోనూ ఇండియా ర్యాంకు పతనం కావటం మొదలైంది. ‘గుజరాత్ మోడల్’ అన్నది సరుకులేని నకిలీ ప్రచారమని దేశం గ్రహించసాగింది. పరిస్థితి అదేవిధంగా కొనసాగి ఉంటే 2019 ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చేవారో ఊహించటం కష్టం కాదు.
సరిగా ఆ సమయంలో మోదీ తన ‘గుజరాత్ మోడల్’ రెండవ అంకాన్ని జాతీయస్థాయిలో ఆవిష్కరించారు. అది, ప్రజలను మతం పేరిట రెచ్చగొట్టడం. 2014లో వలెనే ఈసారి కూడా తనకు ఒక పరిస్థితి అదనంగా కలసివచ్చింది. అది, ప్రతిపక్షాల బలహీనత 2014 కన్న మరింత పెరగటం. ఆ బలహీనత వల్ల వారిలో కొందరు స్వప్రయోజనాల కోసం బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధపడటం. మరికొందరు, తాము అధికారంలో ఉండగా చేసిన తప్పుల కారణంగా సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీలకు భయపడి బీజేపీకి లొంగిపోవటం. ఇవి అదనంగా కలిసిరావటం ఒకటైతే, ప్రజలను ఒక పద్ధతి ప్రకారం, నిరంతరం, దేశమంతటా మతం పేరిట రెచ్చగొట్టడం అన్నింటికి మించిన ముఖ్య సాధనంగా మారింది.
మతం ఒక సున్నితమైన అంశమన్నది వాస్తవం. ఎందుకనే వివరణలు ఇక్కడ ఇవ్వనక్కరలేకుండానే అది అందరికీ తెలిసిన విషయం. మనిషి సంస్కృతి, చరిత్ర, మనోభావనలతో ముడిపడిన ఈ అంశం మనసును పట్టివేసినప్పుడు, నిత్యజీవిత సమస్యలు సర్వసాధారణంగా ఒక అడుగు వెనుకకు వేస్తాయి. అట్లా జరగకుండా చూడటం అసాధ్యం కాదుగాని, అందుకు కూడా ఒక పద్ధతి ప్రకారం నిరంతర ప్రయత్నం అవసరం. అటువంటి ప్రయత్నం చేయగలవారు 2014-19 దశలో మన దేశంలో లేకపోయారు. లేదా అతి కొద్దిమంది ఉన్నారు. పార్టీలకు తమ పాలనా వైఫల్యాల వల్ల, నిజాయితీ రాహిత్యం వల్ల, ప్రజలలో విశ్వసనీయత లేకపోయింది.
ఇవన్నీ బీజేపీకి అనుకూలంగా మారాయి. మోదీ పరిపాలనా వైఫల్యాలు ప్రజలలో కలిగించిన నిరాశలను కప్పిపుచ్చేందుకు, వాటినుంచి దృష్టిని మత సంబంధ ప్రచారపు హోరు వైపు మళ్లించేందుకు ఇవి కలిసివచ్చాయి. ఆ విధంగా, ఒకవైపు మతం అనే అంశపు సున్నితత్వం, మరొకవైపు ప్రతిపక్షాలు విఫలం కావటం, లేదా వారి లోపాలు కలిసి మోదీ వ్యూహాన్ని నెరవేర్చాయి. లేనట్లయితే ప్రజల దృష్టిలో మతం వ్యక్తిగత అంశంగా పరిమితమై, నిత్యజీవిత సమస్యలు, ఇతర ప్రాపంచిక విషయాలు, మోదీ ప్రభుత్వ వివిధ వైఫల్యాలు, దేశం వెనుకబాటుతనం, మోదీ తన హామీలను అమలుపరచకపోవటం, అభివృద్ధిరాహిత్యం, ఆర్థిక క్షీణత, తీవ్ర నిరుద్యోగం, వ్యవసాయం, పారిశ్రామికరంగాల వెనుకబాటు, అభివృద్ధి సూచీలు అన్నింటిలో ఏయేటికాయేడు పతనం, రూపాయి విలువ చారిత్రక పతనం వంటివన్నీ ప్రధానంగా మారి ముందుకువచ్చేవి. అపుడు మోదీ ఓడిపోయేవారేమో.
రెండేండ్లలో తిరిగి ఎన్నికలు వస్తున్న స్థితిలో, ప్రశ్న అంతా ఒక్కటే. ‘సమస్యలు కాదు, అభివృద్ధి కాదు, మతమే ప్రధానం’ అనే మోడల్‌ను మోదీ మరొకసారి ప్రజల ముందుకు తెస్తారా? లేక ప్రజలు, యువతరం వాస్తవాలను వివేకంతో గ్రహించి తమ జీవితాలను, దేశాన్ని బాగుపరుచుకుంటారా అనేదే. అందుకోసం మోదీ ‘మోడల్’ను, రహస్యాన్ని ప్రజలు భంగపరచటం అవసరం.
-టంకశాల అశోక్