భోపాల్ : అపఖ్యాతి పాలైన 90 డిగ్రీల ఐష్బాగ్ వంతెన, చర్చనీయాంశమైన చిన్న మెట్రో స్టేషన్ తర్వాత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని వింతల జాబితాలో మరో విచిత్ర కట్టడం చేరింది. కరోడండ్లోని వినాయక్ కాలనీలో ఈఫిల్ టవర్ని పోలిన హైటెన్షన్ విద్యుత్తు టవర్ స్థానికుల గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాని కింద నుంచి నడిచేలా చేస్తున్నది.
వార్డు నంబర్ 14లో ఉన్న ఈ విద్యుత్తు టవర్ను రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆ ప్రాంతంలో జనసంచారం అంతగా ఉండేది కాదు. క్రమేణా కాలనీలు ఏర్పడడంతో ప్రస్తుతం ఆ ప్రాంతం జనావాసాలతో నిండిపోయింది. ఆ విద్యుత్ టవర్ కింది నుంచి రోడ్డు నిర్మించడంతో నిత్యం వందలాది కార్లు, బైకులు, పాదచారులు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం ఓ బాలిక ఆ ప్రాంతంలో వచ్చే హైటెన్షన్ కరెంట్ కారణంగా గాయాలపాలైంది.