రాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు పెట్టుబడులు రావని, పారిశ్రామికాభివృద్ధి ఇక ఖాయిలా పడ్డట్టేనని ఉమ్మడి వలస పాలకులు ఎగతాళి చేశారు. కానీ వారి ఊహలను తుత్తునియలు చేశారు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్). నాడు విమర్శించిన నోళ్లతోనే నేడు ‘వహ్వా కేటీఆర్..’ అని అనిపిస్తున్నారు. స్వరాష్ట్రంలో నేడు తెలంగాణకు వచ్చిన, వస్తున్న పెట్టుబడులు, రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధే దానికి ప్రత్యక్ష ఉదాహరణ.
కేటీఆర్ ఇదంతా తన తండ్రి పేరు చెప్పుకొని సాధిస్తున్న ఘనత కాదు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అనుభవం. తెలంగాణ రాజకీయ, ఆర్థిక, సామాజిక చిత్రం మీద తాను చేసిన అధ్యయనం. ఆ అనుభవమే నేడు ఆయనను దేశంలోకెల్లా ‘యంగ్ అండ్ డైనమిక్ లీడర్’గా నిలబెట్టింది. ఇటు ఆధునిక వ్యవహారాల పట్ల అవగాహన, అటు ముందుకు దూసుకువెళ్లగల జోరు కలగలసిన ఇలాంటి యువనేతల అవసరం దేశానికి ఎంతో ఉన్నది.
ఉద్యమకారుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కేటీఆర్ 2009లో మొదటిసారి సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాటి నుంచి సిరిసిల్ల పట్టణాభివృద్ధిపై ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో.. నేడు మంత్రిగా ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగానూ రాష్ర్టాభివృద్ధి పట్ల అంతే శ్రద్ధను కనబరుస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటు ముఖ్య ఉద్దేశం ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే కదా? 2021-22 అదనపు స్థూల విలువలో రాష్ట్ర పారిశ్రామికరంగం వాటా 20.4 శాతం, కల్పించిన ఉపాధి 18.23 శాతం. గతంతో పోలిస్తే 20.23 శాతం వృద్ధి సాధించినట్టు పలు నివేదికలు తెలుపుతున్నాయి. కేటీఆర్ భేష్ అనడానికి ఇది కదా నిదర్శనం.
కరోనా మహమ్మారి కారణంగా అభివృద్ధి చెందిన దేశాలే అతలాకుతలమయ్యాయి. వాటి ఆర్థికవ్యవస్థ కుప్పకూలినా, తెలంగాణకు మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లలేదు. సీఎం కేసీఆర్ సారథ్యంలో మంత్రి కేటీఆర్ అవలంబించిన పారిశ్రామిక విధానాలే దానికి ముఖ్య కారణం. రాష్ట్రం ఉద్యోగ భద్రతనూ సాధించింది. జాతీయ వృద్ధిరేటుతో పోలిస్తే తెలంగాణ సాధించిందే ఎక్కువని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. పెట్టుబడుల విషయానికి వస్తే.. 2014-15 నుంచి 2021-22 జనవరి వరకు రాష్ట్రం టీఎస్ఐపాస్ కింద 18,761 పారిశ్రామిక అనుమతులిచ్చింది. దాదాపు రూ.2,26,806 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులు దాదాపు 16.32 లక్షల మందికి ఉద్యోగావకాశాలను కల్పించాయి. 2015-16తో పోలిస్తే టీఎస్ఐపాస్ వల్ల 2021-22లో పొందిన అనుమతులు రెండింతలు ఎక్కువ. అలాగే 2021-22లో సూక్ష్మ పారిశ్రామిక యూనిట్ల అనుమతులూ 70 శాతం అని గణాంకాలు చెప్తున్నాయి. టీఎస్ఐపాస్ ద్వారా అనుమతి పొందిన పరిశ్రమలలో 2016-17, 2020-21 మధ్యకాలంలో ఐటీ రంగం 50 శాతం కంటే ఎక్కువ ఉద్యోగాలను కల్పించింది.
కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నట్లే.. కేటీఆర్ దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారు. టీ-ఐడియా,టీ-ప్రైడ్ వంటి పథకాలు అందులో భాగమే. ఈ రెండు పథకాలూ పరిశ్రమలకు రాయితీలు కల్పిస్తూ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడేవే. ‘టీ-ప్రైడ్’ దళిత పారిశ్రామికవేత్తలకే కాదు, రాష్ట్రంలోని గిరిజనులు, స్త్రీలు, దివ్యాంగుల్లో ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకూ చేయూతనిస్తున్నది. దీనిద్వారా 2022 నాటికి 12,602 మంది దళితులు, 11,694 మంది గిరిజనులు మొత్తం రూ.1,150.5 కోట్ల రాయితీలు పొందడం విశేషం. ఇక పారిశ్రామిక పార్కుల ఏర్పాటు, అభివృద్ధికి కేటీఆర్ చేస్తున్న కృషి అనిర్వచనీయం.
దేశాభివృద్ధికి మహిళా సాధికారతే కొలమానం అని నమ్మే వ్యక్తుల్లో కేటీఆర్ ఒకరు. అందుకే విమెన్ ఎంట్రప్రెన్యూర్షిప్ కోసం ఆయన 2017లోనే ‘వీహబ్’ను ప్రారంభించారు. ఇది ప్రపంచస్థాయి సంస్థలతో మహిళా పారిశ్రామివేత్తలను అనుసంధానం చేస్తున్నది. ముఖ్యంగా ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లోని మహిళా పారిశ్రామికవేత్తలకు శాస్త్ర, సాంకేతిక, ఇంజినీరింగ్ రంగాల్లో అవసరమైన నైపుణ్యాలను అందిస్తున్నది. యువతులకు ఎంట్రప్రెన్యూర్షిప్ పట్ల అభిరుచిని పెంచేందుకు పలు కార్యక్రమాలను చేపడుతున్నది. వీహబ్ మొదలైన ఈ కొద్దికాలంలో 1,495 స్టార్టప్‌లలో రూ.56.8 కోట్ల నిధులను సమకూర్చుకొని 2,800 ఉద్యోగాలను సృష్టించింది. దీనివెనుక కేటీఆర్ అవిరళమైన కృషి ఉన్నది.
యావత్ ప్రపంచం టెక్నాలజీతోనే నడుస్తున్నదని, ఇకముందూ నడుస్తదని కేటీఆర్ గ్రహించారు. అందుకే 2015లో టీ-హబ్ స్థాపనకు కృషిచేశారు. రాష్ట్ర ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ల్యాబ్ 32 ద్వారా 22 స్టార్టప్‌లకు కావలసిన సేవలను టీ-హబ్ అందించింది. టీ ఫండ్‌కు అనుబంధమైన టీ-హబ్‌కు రాష్ట్ర బడ్జెట్ నుంచి ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. మూడు దఫాలుగా ఇచ్చిన ప్రోత్సాహకాల్లో 52 స్టార్టప్ సంస్థలను ప్రభావితం చేసింది.
నేటి ఆధునిక కాలంలో అత్యంత వేగంగా సమాచారాన్ని జనాలకు చేరువ చేసేవి సామాజిక మాధ్యమాలే అని నమ్మిన కేటీఆర్ వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నారు. ఆపత్కాలంలో ట్విటర్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. తన ముందు కు ఏ సమస్య వచ్చినా క్షణాల్లో పరిష్కరిస్తున్నారు. ఎంతైనా యువనాయకుడు కేటీఆర్ దృష్టికోణం వేరు. ఆయన ఆలోచనాపరిధి విస్తృతం. రాష్ట్రంలోనే కాదు, విదేశాల్లోనూ ఆయన పొందుతున్న పేరు ప్రతిష్ఠలను చూస్తే తెలిసిపోతున్నది మన కేటీఆర్ ఇంట మాత్రమే కాదు.. రచ్చ కూడా గెలుస్తున్న నాయకుడని!
(వ్యాసకర్త: డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు , 92465 26899, మాజీ ప్రధాన సమాచార కమిషనర్)