బడిగంట మళ్లీ గణగణమని మోగుతున్నది! కరోనా రెండేండ్ల పాటు కకావికలు చేసిన తర్వాత సోమవారం బడులు మళ్లీ తెరుచుకొని విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 41,392 పాఠశాలల్లో 59 లక్షలకు పైగా విద్యార్థులు బడిబాట పట్టారు. సాంకేతికంగా ఎంత అభివృద్ధి సాధించినా ఆన్లైన్ విద్య ఉపాధ్యాయుల ప్రత్యక్ష బోధనకు సాటిరాదు. పాఠశాలల ద్వారా విద్యాబోధన మాత్రమే సాగదు. బాలల సామాజికీకరణతోపాటు, ప్రజాస్వామ్య పౌరులుగా తీర్చిదిద్దడం పాఠశాలల ప్రత్యేకత. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులు మళ్ళీ ప్రారంభం కావడం బాలల భవిష్యత్తు, సమాజ సంక్షేమం దృష్ట్యా హర్షణీయం.
ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాద్యమం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కావడం మరో ప్రాధాన్యం గల అంశం. ఆంగ్ల మాధ్యమంలోకి హటాత్తుగా మారడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడకుండా బ్రిడ్జ్ కోర్సు నిర్వహిస్తున్నారు. పాఠ్య పుస్తకాలను తెలుగు-ఇంగ్లిష్ భాషలతో కలిపి ముద్రించడం వినూత్న ఆలోచన. ఆంగ్ల బోధనలో ఉపాధ్యాయులకు కూడా ఇప్పటికే తర్ఫీదు అందింది. కొత్తగా ఇంగ్లిషు మీడియంలోకి వచ్చిన విద్యార్థులు పాఠ్యాంశాలను అర్థం చేసుకోవటం, వ్యక్తీకరించటం, రాయటంలోనూ అవసరమైన నైపుణ్యాలు సంతరించుకోవడానికి కొంతకాలం పడుతుంది. ఏదీ ఒక్కరోజులో సాధ్యం కాదు. కొత్త విధానం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని సాధక బాధకాలుంటాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కృషిచేస్తే గ్రామీణ పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో అభ్యసనం పెద్ద సమస్యగా ఉండబోదు.
‘న చోర హార్యం న చ రాజ హార్యం న భ్రాతృ భాజ్యం న చ భారకారీ/ వ్యయే కృతే వర్ధతి ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం’ అంటూ విద్య ప్రాధాన్యాన్ని వివరించారు మన పూర్వీకులు. విద్యా ధనాన్ని చోరులు, రాజులు హరించలేరు, సోదరులు పంచుకోలేరు, బరువు కూడా కాదు. వ్యయం చేసే కొద్దీ వృద్ధి చెందే విద్యాధనం అన్ని ధనాల కన్నా ప్రధానమైంది. అందుకే తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విద్యాబోధన మీద చూపిన శ్రద్ధ గణనీయమైనది. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి రూపకల్పన చేయడంతో పాఠశాలలకు మహర్దశ వచ్చింది. దాతల ప్రోత్సాహంతో సకల సౌకర్యాలు, అధునాతన భవనాలను నిర్మించడంతో బడుల రూపురేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికే కోట్ల రూపాయల వ్యయంతో పలు జిల్లాల్లో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే సౌకర్యాలు ఏర్పడి ప్రభుత్వ బడులు కాంతులీనుతున్నాయి. తెలంగాణ విద్యార్థులు సాధించిన విజయాలు రాష్ర్టానికి గర్వకారణంగా ఉన్నాయి. పాఠశాలలు ఇకముందూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. వ్యవసాయం, పరిశ్రమల వంటి రంగాల్లో అద్భుత ప్రగతిని సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ విద్యారంగంలోనూ అదేస్థాయిలో నిలుస్తుందనటంలో సందేహం లేదు.