ఒక సామాజిక సంక్షుభిత సమయంలో ఒక సమున్నత శాస్త్రీయ ఉద్యమపథం లేకుంటే ఆ సమాజం హింసాత్మకమవుతుంది. అందుకు తెలంగాణనే ఒక ఉదాహరణ. టీఆర్ఎస్ ఉద్యమపార్టీగా ముందుకురాకుంటే.. అప్పటికే ఉద్యమాలతో రక్తాన్నోడుతున్న తెలంగాణ మరింత రక్తసిక్తమయ్యేది. ఆ కాలంలో టీఆర్ఎస్ శాంతియుత మార్గంలో రాష్ట్ర సాధనోద్యమాన్ని పార్లమెంటరీ పంథాలో ముందుకు తీసుకుపోకుంటే.. తెలంగాణ సమాజం ఎంతో మూల్యం చెల్లించాల్సి వచ్చేది. ఆ అర్థంలో తెలంగాణ సమాజానికి టీఆర్ఎస్ ఒక సంజీవని.
సీమాంధ్ర వలస పాలకుల నుంచి తెలంగాణ విముక్తి చెందిన తర్వాత తెలంగాణ ఏయే రంగాల్లో ఏమేం సాధించిందో చాలా చెప్పుకొంటున్నాం. కండ్లముందే సాధించిన అభివృద్ధి ఫలాలను చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు ఒక ఎత్తు అయితే.. టీఆర్ఎస్ ఆవిర్భావమే ఒక తరానికి బతుకునిచ్చిందన్న విషయం అన్నింటికన్నా మహత్తరమైనదని మరువరాదు. ఆ కాలంలో టీఆర్ఎస్ పురుడు పోసుకోకుంటే.. నాలాంటి వారెందరితో కూడిన ఒక తరం మిగిలి ఉండేదా..? అంటే అనుమానమే. అందుకు నేనే సాక్ష్యం. ఉద్యమపార్టీగా టీఆర్ఎస్ జెండా అందకుంటే.. నా లాంటి యువత ఉద్యమబాటలో అసువులుబాసే వారమే అనటంలో అతిశయోక్తి లేదు. నాటి పరిస్థితులు అంత భయంకరమైనవి. అవి యాదికొస్తేనే మనసంతా అతలాకుతలమైతది. ‘జై తెలంగాణ’ అన్నందుకే రాజ్యం వెంటాడి వేటాడే కాలమది. అప్పటికే.. భువనగిరిలో ‘దగాపడ్డ తెలంగాణ సభ’ తర్వాత సీమాంధ్ర ప్రభుత్వం ఎందరినో ఉపాధ్యాయులను, కార్యకర్తలను అరెస్టు చేసి జైలు పాల్జేసింది. ఉద్యోగాలు పోయేట్లు చేసింది. తెలంగాణ పాట పాడినందుకు బెల్లి లలిత లాంటి గాయకురాలిని పొట్టన పెట్టుకోవటమే కాదు, వరంగల్ జిల్లాలో ఇద్దరు తెలంగాణ ఉద్యమ ముఖ్య కార్యకర్తలను సీమాంధ్ర వలసపాలక ప్రభుత్వం కాల్చిచంపింది. సరిగ్గా అలాంటి అల్లకల్లోల సమయంలో టీఆర్ఎస్ పార్టీ రాకుంటే.. యువత ఏమైపోయేదో ఊహించుకుంటేనే భయమేస్తున్నది.
ఆ కాలంలో నేను తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని ఊరూరా తిరిగేటోన్ని. నిధులు, నియామకాల్లో సీమాంధ్ర పాలకులు అనుసరిస్తున్న వివక్ష, దోపిడీ పీడనలను వివరిస్తూ ఊరూరా ప్రచారం చేసేది. తెలంగాణ అంటే చాలు నక్సలైట్ అని ముద్రవేసి అరెస్టులు, చిత్రహింసలకు గురిచేసేవారు. రోజుల తరబడి హింసించి మళ్లీ తెలంగాణ అనకుండా ఉంటేనే జైలుకు పంపకుండా ఇంటికి పంపేవారు. ఆ సమయంలో నేను కూడా తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొన్న. సరిగ్గా ఆ సమయంలో 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినట్లు వచ్చిన ప్రకటన నాకు, నాలాంటి ఎందరో తెలంగాణవాదులకు పునర్జన్మనిచ్చింది. మే 17న కరీంనగర్లో పార్టీ ఆవిర్భావ ప్రకటన సభ ‘సింహగర్జన’ జరిగింది. లక్షలాదిగా తరలివచ్చిన ఆ సభ తెలంగాణవాదులకు ఏనుగంత బలం ఇవ్వటమే కాదు, లక్ష్యసాధనకు మార్గం చూపింది. అప్పటిదాకా అనేక భయాలతో, దొంగచాటుగా తెలంగాణవాదాన్ని ప్రచారం చేస్తున్న యువత చేతిలో గులాబీ జెండా రక్షణ ఇచ్చి భరోసానిచ్చింది.
టీఆర్ఎస్ ఆవిర్భావంతో తెలంగాణవ్యాప్తంగా పల్లెలన్నీ ‘జై తెలంగాణ’ నినాదంతో కదం తొక్కినయి. రాష్ట్ర సాధనోద్యమానికి అంకితమై యువత, ముఖ్యంగా విద్యార్థులు తమ జీవితాలను పణంగా పెట్టి పోరు మార్గంలో నడిచారు. పార్టీ ఆవిర్భవించిన రెండునెలల కాలంలోనే జూలైలో జరిగిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయపతాక ఎగురవేసింది. 100 ఎంపీపీ, 85 జెడ్పీటీసీ, రెండు జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుంది. 2001 ఆగస్టులో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 3 వేల మంది సర్పంచ్‌లు, 12 వేల మంది వార్డు సభ్యులు గెలుపొందటం తెలంగాణవాదానికి జవసత్వాలు నింపింది. టీఆర్ఎస్కు రాజకీయ పార్టీగా గుర్తింపు రావటం, 2002 సెప్టెంబర్‌లో కేసీఆర్ ‘పల్లెబాట’కు పిలుపునివ్వటం తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపు. ఈ నేపథ్యంలోంచే.. సామాజిక స్థితిగతులు, సమస్యలపై అవగాహనతో ఉన్న యువత అంతా నాడు గులాబీ జెండా పట్టుకొని మనగలిగిందంటే అతిశయోక్తి కాదు.
రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ చేసిన సుదీర్ఘ అలుపెరుగని శాంతియుత పోరాటం ఆధునిక సమకాలీన చరిత్రలో ఒక చారిత్రక ఘట్టమైతే, పార్టీ ఆవిర్భావం నుంచీ అది సాధించిన ఘన విజయాలు అంతకన్నా విశిష్టమైనవి. గతంలో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించి… ఏడు నెలల కాలంలోనే అధికారంలోకి రావటం ఓ చారిత్రక అంశంగా చెప్పుకొంటారు. కానీ అనేకానేక ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి, తట్టుకొని పార్టీ ఆవిర్భవించిన నెలరోజుల్లోనే ఎన్నికల బరిలోకి దిగి విజయపరంపర కొనసాగించటం కేసీఆర్ నాయకత్వ తీరుకు, ఉద్యమ వ్యూహాత్మకతకు ప్రతీక. తొలి నుంచి అనేక ప్రత్యేకతలు, విశిష్టతలతో ముందుకుసాగి రాష్ర్టాన్ని సాధించించి టీఆర్ఎస్. పార్టీ అప్రతిహత విజయపథాన్ని మరింత అర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత ఉన్నది.
(వ్యాసకర్త: గోసుల శ్రీనివాస్ యాదవ్ , 98498 16817, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు)