(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): మూడు సాగు చట్టాలను తీసుకొచ్చి వందలాది మంది రైతుల మరణానికి కారణమైన మోదీ ప్రభుత్వం.. అమెరికాతో వాణిజ్య ఒప్పందం పేరిట ఇప్పుడు అదే అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతున్నది. భారత్-అమెరికా వంటి రెండు సార్వభౌమ దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో పూటకో మార్పు చోటు చేసుకోవడాన్ని చూసి యావత్తు ప్రపంచం నవ్వుకొంటున్నది.
ట్రేడ్ డీల్ ప్రకటన వెలువడగానే.. తామేదో చారిత్రాత్మక విజయాన్ని సాధించినట్టు గప్పాలకు పోయిన కేంద్రప్రభుత్వ పెద్దల చేష్టలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా అమెరికా ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం ఇక్కడి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని నిపుణులు, మేధావులు, విశ్లేషకులు మండిపడుతున్నారు.
భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరిందని గత శుక్రవారం శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాకు చెందిన ఆహార, వ్యవసాయ ఉత్పత్తులను జీరో లేదా నామమాత్రపు సుంకాలతో అనుమతించడానికి మోదీ ప్రభుత్వం ఒప్పుకొన్నట్టు స్పష్టం చేసింది. పొడి ధాన్యం (డీడీజీ), పశువుల దాణాకు వినియోగించే ఎర్రజొన్నలు, ట్రీ నట్స్, ప్రాసెస్ చేసిన తాజా పండ్లు, సోయాబీన్ ఆయిల్ వంటి ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై జీరో టారిఫ్ లేదా నామమాత్రపు సుంకాలతో దిగుమతి చేసుకోవడానికి భారత్ అంగీకరించినట్టు అమెరికా పేర్కొంది.
అయితే, సోమవారం అదే శ్వేతసౌధం విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్‌లో ఈ జాబితాకు పప్పు దినుసులను అదనంగా చేర్చారు. దీంతో మోదీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందంటూ ప్రతిపక్ష పార్టీలు సహా మేధావులు విరుచుకుపడ్డారు. ఏమైందో ఏమో మళ్లీ బుధవారం ట్రేడ్ డీల్ ప్రకటనకు సవరణలు చేస్తూ సుంకాల జాబితా నుంచి పప్పు దినుసులను అమెరికా మళ్లీ తొలగించింది. అంతేకాదు, డీల్‌లో పేర్కొన్న 500 బిలియన్ డాలర్ల వాణిజ్యంపైనా కూడా స్పష్టత లోపించింది. దీంతో అమెరికా-భారత్ వైఖరిపై మేధావులు ధ్వజమెత్తుతున్నారు.
ఏ రెండు సార్వభౌమ దేశాల మధ్య ఒక వాణిజ్య ఒప్పందం కుదిరిందంటే.. ఆ ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులకు సంపూర్ణమైన అవగాహన ఉన్నట్టు అర్థం. అంతేకాకుండా ఆ డీల్ ఎంతో పారదర్శకంగా ఉంటుందని భావిస్తారు. అయితే, అమెరికాతో భారత్ కుదుర్చుకున్న ఈ వాణిజ్య ఒప్పందం విషయంలో ఆ ప్రమాణాలు ఏ కోశానా కనిపించడంలేదు. నాలుగైదు రోజుల వ్యవధిలో ఒప్పందంలో జరుగుతున్న మార్పు చేర్పులే దీనికి ఉదాహరణ. అంతేకాదు, ద్వైపాక్షికంగా ఏదైనా ఓ ఒప్పందం కుదిరితే, దానిపై ఇరు దేశాల అధినేతలు సంయుక్తంగా ప్రకటన చేయాల్సి ఉంటుంది.
కానీ, తాజా ట్రేడ్ డీల్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేదా ఆయన అధ్యక్ష భవనం శ్వేతసౌధం నుంచి ప్రకటనలు వస్తున్నాయి. వాటిపై సామాన్య ప్రజలలాగా మన కేంద్ర మంత్రులు స్పందిస్తున్నారు. దీంతో ట్రంప్‌నకు మోదీ తలొగ్గారా? అనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా, డీల్‌లో కొనసాగుతున్న మార్పుచేర్పులను విశ్లేషిస్తే, మోదీ ప్రభుత్వం ఏదో దాస్తున్నట్టుగా, తప్పు చేయలేదని సమర్థించుకుంటున్నట్టుగా కనిపిస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ట్రేడ్ డీల్‌తో భారత్‌పై 50 శాతంగా ఉన్న సుంకాలు 18 శాతానికి తగ్గాయంటూ కేంద్రప్రభుత్వ పెద్దలు గొప్పగా ప్రచారం చేసుకొంటున్నారు. అయితే, లోతుల్లోకి వెళ్తే, భారత్‌పై కొత్తగా 15.5 శాతం సుంకాలు అదనంగా పడ్డట్టు గమనించొచ్చు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడానికి ముందు భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 2.5 శాతంగా ఉండేవి.
ఆ తర్వాత అవి 25 శాతానికి, ఆపై రష్యా చమురు కొంటున్నారన్న నెపంతో మరో 25 శాతం కలిపి మొత్తంగా టారిఫ్‌లు 50 శాతానికి పెరిగాయి. వాణిజ్య ఒప్పందం పేరిట భారత్‌పై సుంకాలను 18 శాతానికి తగ్గించినట్టు అటు ట్రంప్ సర్కార్, ఇటు మోదీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంది. అయితే, నిజానికి అమెరికా సుంకాల భారం తగ్గకపోగా 2.5 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్టు అర్థం చేసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు.. ట్రంప్ విధించిన టారిఫ్‌లకు చట్టబద్ధత ఉందా? అనే కేసు ప్రస్తుతం అమెరికా సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. దీనిపై తీర్పు సానుకూలంగా రాకపోతే అమెరికాతో అప్పుడు ఒప్పందం చేసుకోవచ్చన్న ఉద్దేశంతో పలు దేశాలు వేచిచూసే ధోరణితో ఉన్నాయి.
ఈ సమయంలోనే హడావుడిగా ట్రంప్ సర్కారుతో మోదీ ప్రభుత్వం ట్రేడ్ డీల్‌ను పూర్తి చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని 70 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ, అనుబంధ రంగాలను నిర్వీర్యం చేయడానికి ఈ డీల్‌తో మోదీ సిద్ధమయ్యారా? అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అమెరికా వ్యవసాయక ఉత్పత్తులను అనుమతిస్తే, దేశీయ ఉత్పత్తుల సంగతేమిటని మండిపడుతున్నారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కశ్మీరు లోయలోని యాపిల్ పండ్ల తోటల పెంపకందారుల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నది. అమెరికా యాపిల్ పండ్లు భారతీయ మార్కెట్‌ను ముంచెత్తితే దాని ప్రభావం స్థానిక మార్కెట్‌పై తీవ్రంగా ఉంటుందని కశ్మీరీ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఒప్పందం తమను నాశనం చేయనున్నదని కశ్మీరు లోయలో అతి పెద్ద పండ్ల మార్కెట్‌గా ప్రసిద్ధి చెందిన సోపోర్ పండ్ల మండి అధ్యక్షుడు ఫయాజ్ అహ్మద్ మాలిక్ తెలిపారు. అమెరికన్ రైతులతో మేము పోటీపడలేము. అక్కడ రైతులకు ప్రతి దశ సాగులో ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తుంది.
వారికి గణనీయ స్థాయిలో సబ్సిడీలు, నగదు బదిలీలు అందుతాయి. కాని, మాకు కనీసం పంట బీమా కూడా అందుబాటులో లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం కశ్మీరు ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయగలదని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. బంగ్లాదేశ్‌కు మన యాపిల్స్ పంపితే 100 శాతానికి పైగా పన్నులను మేము చెల్లించాల్సి ఉంటుంది. అమెరికన్ యాపిల్స్‌కి మాత్రం ప్రభుత్వం ఎలా పన్నులు తగ్గిస్తుంది? ఇది స్థానిక పరిశ్రమను, ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.