కొర్రీలు వేయటమే కేంద్ర ప్రభుత్వ విధానంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా, తమ పార్టీ అధికారంలో లేని రాష్ర్టాల్లో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అడ్డుపుల్లలు వేస్తున్నది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం మోకాలడ్డుతున్న తీరు ఈ వివక్షపూరిత వైఖరికి తాజా ఉదాహరణ. కృష్ణా, గోదావరి నదుల మీద కట్టి న, కడుతున్న అన్ని ప్రాజెక్టులను తన పరిధిలోకి ఏకపక్షంగా తీసుకుంటూ గతేడాది కేంద్రం గెజిట్ జారీచేసింది. దీనిపై రాష్ట్ర ప్రభు త్వం, జలవనరుల నిపుణులు, రాజ్యాంగ నిపుణులు లేవనెత్తిన అభ్యంతరాలను కేంద్రంలోని మోదీ సర్కారు తనకు అలవాటైన రీతి లో అలక్ష్యం చేసింది. పుండు మీద కారం చల్లినట్లుగా, ఆపై మరింత క్రూరంగా వ్యవహరిస్తూ ఉద్యమ పురిటిగడ్డ అయిన తెలంగాణ సహనానికి పరీక్ష పెడుతున్నది.
సాగునీటి ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవడానికి కేంద్ర ప్రభు త్వం ఆరునెలల గడువు విధించింది. మరి ఆలోగా అనుమతులు మంజూరు చేయాలి కదా! రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అర్జీలు పెట్టుకు న్నా, ఎన్ని వివరాలను అందించినా అనుమతి ఇవ్వడం లేదు. ఆం ధ్రప్రదేశ్ అభ్యంతరాలు చెబుతున్నదని సాకులు చెప్పడం, అసలు ఆ అభ్యంతరాలేమిటో వెల్లడించకపోవటం, పక్కరాష్ర్టాన్ని వెనకేసు కురావటం దేనికి సంకేతం? గోదావరి నది మీద కట్టిన ప్రాజెక్టుల విషయంలో వివాదాలే లేవు. అయినా కూడా ఆ అంశాన్నీ సంక్లిష్టం చేస్తున్నది మోదీ సర్కారు. కేంద్రంలో తమకు బలం ఉన్నది కాబ ట్టి.. చట్టాలకు తూట్లు పొడిచి, నిబంధనలను తుంగలో తొక్కి, ఇష్టారీతిన వ్యవహరిస్తామని చెప్పదల్చుకున్నారా? బీజేపీ నిరంకుశ రాజకీయాలపై దేశవ్యాప్త పోరాటానికి కదులుతానని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్పై అక్కసుతోనా ఇదంతా? పరిపాలన సం బంధాలు వేరు, రాజకీయ విభేదాలు వేరు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ధైర్యముంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి. అంతేగానీ, ఈ కుట్రలేమిటి? 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహించే బాధ్యత ఉన్న కేంద్రం వ్యవహరించే పద్ధతేనా ఇది!
ఉమ్మడి ఏపీలో సాగునీటి కోసం తెలంగాణ చేసిన అర్తనాదా లు, అనుభవించిన దుఃఖం మరిచిపోలేని చేదు జ్ఞాపకాల పరంపర. ఊర్లకు ఊర్లు, తరతరాలు ఆ వేదనలో మునిగిపోయిన దైన్యం. అది ప్రకృతి శాపం కాదు, నాటి పాలకుల పాపం. అప్పటి ప్రభుత్వాల ఘోరమైన వివక్ష కారణంగా యావత్ తెలంగాణ భూములు బీైళ్లెన దారుణమది. దాన్నించి బయటపడి, ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ పంట భూములు పచ్చ గా కళకళలాడుతుంటే.. మోదీ సర్కారుకు, బీజేపీకి ఎందుకింత కడుపు మంట? విభజనచట్టం ప్రకారం ఇవ్వాల్సింది ఇవ్వరు. సరే, మేమే నిర్మించుకుంటాం అంటే అనుమతులంటూ పేచీలు పెడతారు. ఎనిమిదేండ్లవుతున్నా ఇప్పటికీ.. తెలంగాణ-ఏపీ మధ్య నీటి వాటాలు తేల్చకుండా చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీకి ప్రజలే గుణపాఠం చెబుతారు.