‘రాజకీయ నాయకులను గవర్నర్లుగా నియమించవద్దు. ముఖ్యంగా ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో, కేంద్రంలో అధికారం ఉన్న పార్టీకి చెందిన రాజకీయ నేతలను గవర్నర్‌గా అసలే నియమించవద్దని సర్కారియా కమిషన్ స్పష్టంగా చెప్పింది. కానీ.. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు వెతికి మరీ తమ పార్టీ వాళ్లనే గవర్నర్లుగా నియమిస్తున్నారు’- ఈ మాటలన్నది ఎవరో కాదు. సాక్షాత్తూ నరేంద్ర మోదీనే. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన ఈ మాటలను ప్రధాని అయిన తర్వాత ఆయనే కాలరాశారు, రాస్తున్నారు.
2014, మేలో అధికారంలోకి రాగానే మోదీ 26 మంది గవర్నర్లను, ఏడుగురు లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించారు. వీరిలో అత్యధికులది బీజేపీ నేపథ్యమే. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్, గోవా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లో గవర్నర్లు రాజ్యాంగ వ్యవస్థను ఎంతగా అపహాస్యం చేశారో యావత్ దేశ ప్రజానీకం చూసింది. ఇందిరాగాంధీ హయాంలో 39 సార్లు వివిధ రాష్ర్టాల్లో రాష్ట్రపతి పాలన విధించారు. గవర్నర్ల అధికారాన్ని ప్రజాస్వామ్య పరిపాలనపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా అమలుచేస్తే, నేడు మోదీ ప్రభుత్వం ఆ పరిస్థితిని తారాస్థాయికి తీసుకువెళ్లింది.
తమిళనాడులో బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసైని కేంద్రం తెలంగాణ గవర్నర్‌గా నియమించింది. మొదట్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించినట్లు కనిపించిన ఆమె, రాజ్‌భవన్‌ను క్రమంగా రాజకీయాలకు వేదికగా మార్చారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, విద్య, వైద్యరంగాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, డ్రగ్స్ మాఫియా పేట్రేగిపోతున్నదని, వాటిని కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించడం హాస్యాస్పదం. డ్రగ్స్ మాఫియా యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. దేశ సరిహద్దులు దాటి మన భూ భాగంలోకి తరలిస్తున్న డ్రగ్స్‌ను అరికట్టడంలో కేంద్రం విఫలమైంది. తమ వైఫల్యాన్ని రాష్ర్టాల మీదికి నెట్టివేయడం గర్హనీయం. గవర్నర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ‘నేను తలచుకుంటే ప్రభుత్వం కూలిపోతుంద’ని తమిళిసై వ్యాఖ్యానించడం తెలంగాణ సమాజాన్ని కించపర్చడమే.
దేశంలో ఏ ప్రభుత్వం అమలుచేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణను తీర్చిదిద్దుతున్న కేసీఆర్ పాలనను విమర్శించడం గర్హనీయం. కరోనా కాలంలోనూ ప్రజలకు నాణ్యమైన, ఉచిత వైద్యసాయం అం దించిన రాష్ట్ర ప్రభుత్వం అందరి ప్రశంసలందుకున్నది. ఆ క్రమంలోనే ప్రజలకు అన్నివేళలా మెరుగైన వైద్యం అందించటం కోసం మండల, జిల్లా కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, జిల్లా దవాఖానలను ఆధునీకరించింది. శాశ్వత ప్రాతిపదికన వైద్యులను, సిబ్బందిని నియమించింది. ఈ స్థాయిలో వైద్యరంగంపై కృషి జరుగుతున్నా రాష్ట్రంలో వైద్యరంగం పరిస్థితి బాగాలేదనటం కేవలం రాజకీయ విమర్శే తప్ప మరొకటి కాదు.
రాజ్యాంగ విలువలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన గవర్నర్లు, విపక్ష పార్టీ ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం, కూలదోయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మోదీ హయాంలో గవర్నర్లు తమకున్న పరిమితమైన అధికారాలను అపరిమితంగా ఊహించుకొని రాజ్యాంగపరమైన వివాదాలను సృష్టిస్తున్నారు. ఇలాంటి కుట్రలను భగ్నం చేయడం, కేంద్రం మెడలు వంచడం తెలంగాణ ప్రజలకు కొత్తేమీ కాదు. గవర్నర్ వ్యవస్థ అధోగతి పాలుకావటం రాజ్యాంగ విలువలకే అపకీర్తి. దానికి మోదీ, తమిళిసై కారకులు కావటమే విషాదం.
(వ్యాసకర్త: డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి , చైర్మన్, తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్)