నదీ జలాలను బీడు భూములకు మళ్లించి తెలంగాణను సస్యశ్యామలం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతల పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. కేంద్రం మొండిచెయ్యి చూపినా సరే వెనుకాడకుండా యాసంగి పంటను కొంటానని ప్రకటించి రైతుల గుండెల్లో ధైర్యం నింపారు. రైతుల నుంచి వడ్లను కొనడమనేది నిజానికి ఒక రైతుల సమస్య కాదు. అది మొత్తం సమాజ సమస్య. యావత్ దేశానికి సంబంధించిన అంశమిది. ప్రపంచవ్యాప్తంగా పలు సంపన్న దేశాలు వ్యవసాయానికి సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవడానికి కారణం రైతు హితం కోసమే కాదు, మొత్తం సమాజ సంక్షేమం కోసం. మరో రెండు మూడు దశాబ్దాలలో మన దేశం తీవ్ర ఆహార కొరతను ఎదుర్కోబోతున్నదని, ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలని విజ్ఞులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో, వ్యవసాయాన్ని పండుగగా చేయడానికి కేసీఆర్ సాగించిన కృషిని గుర్తించవలసి ఉన్నది.
కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న బీజేపీ బాధ్యతారహిత్యానికి కొంతకాలంగా వడ్ల కొనుగోలుపై అనుసరిస్తున్న వైఖరే నిదర్శనం. అతి తక్కువ కాలంలో భగీరథ యత్నంతో తెలంగాణలో బంగారు పంటలు పండించడాన్ని నిండు హృదయంతో హర్షించాల్సింది పోయి బీజేపీ నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇక్కడి బీజేపీ నాయకులు దొంగ దీక్షలు చేపడుతుంటారు, అక్కడ కేంద్ర నాయకులు ఎకసెక్కాలు చేస్తుంటారు. రైతులను ఈ స్థాయిలో అవమానించడం దేశ చరిత్రలోనే ఎన్నడూ జరిగి ఉండదు. ఆనాడు కాంగ్రెస్ నాయకుల మాదిరిగానే, నేడు బీజేపీ నేతలు కూడా ఢిల్లీలో అధిష్ఠానం ముందు మోకరిల్లుతున్నారు తప్ప, తెలంగాణ ప్రజల పక్షాన నిలువడం లేదు. వడ్లు కొం టామంటూ కేంద్రం నుంచి లేఖ ఇప్పించలేనప్పుడు ఇంకా వీధుల్లో పడి రాద్ధాంతం చేయడమెందుకు?
ఒక్క తెలంగాణ సమస్యనే కాదు, దేశవ్యాప్తంగా రైతుల సమస్యలను పరిష్కరించాలని, వ్యవసాయ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించాలని కేసీఆర్ దీక్ష బూనటం హర్షణీయం. త్వరలో రైతుల సంఘాల నాయకులు, వ్యవసాయ- ఆర్థికవేత్తలతో కార్యశాల నిర్వహించి సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందిస్తామని కూడా ఆయన ప్రకటించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలే కేసీఆర్ను జాతీయ స్థాయిలో చర్చకు కేంద్ర బిందువుగా మార్చాయి. నదీ జలాలు సముద్రాలలో కలుస్తూ ఉంటే, మరోవైపు నీళ్ళు లేక భూములు బీడుపడటమేమిటి అంటూ కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్న దేశవ్యాప్తంగా మేధావులు ఆలోచింపదగినది. ఒక వ్యవసాయ రంగమే కాదు, కేంద్ర రాష్ట్ర సంబంధాలతో సహా దేశానికి అన్ని రంగాలలో కొత్త మార్గాన్ని నిర్దేశించాలని కేసీఆర్ నిర్ణయించారు. వ్యవసాయ విధాన రూపకల్పన కోసం సాగించే మేధోమథనం మొత్తం రాజకీయ పునరేకీకరణకు ప్రేరణ ఇస్తుందనడంలో సందే హం లేదు. కేసీఆర్ తలపెట్టిన ఈ మహాయజ్ఞానికి రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలి.