యుద్ధోన్మాదం పెచ్చరిల్లుతున్న నేటి రోజుల్లో మరో సైనిక కూటమి అవసరమా? అని ఎవరికైనా అనిపిస్తుంది. ఓవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రావణకాష్టంలా మండుతున్నది. మరోవైపు అమెరికా-ఇరాన్ యుద్ధంలో పీటముడి పడింది. ఇది చాలదన్నట్టు టర్కీ-సౌదీ అరేబియా-పాకిస్థాన్ దేశాలు సైనిక కూటమిగా ఏర్పడాలని ఈ నెల 7న ఒప్పందం చేసుకున్నట్టు వార్తలు వెలువడటం ఆందోళనకరం. ఒప్పందం మక్కాలో కుదిరింది కనుక దీనిని మక్కా ఒప్పందం అంటున్నారు. ఏతావతా మక్కా సైనిక కూటమి అనే పేరు స్థిరపడవచ్చు. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏదో ఒక దేశంపై సైనిక దాడి జరిగితే, దాన్ని మిగతా దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించి సమిష్టిగా స్పందించాలనే సూత్రం ఉన్నది. టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ స్వయంగా దీనిని నాటో ఆర్టికల్ 5తో సాంకేతికంగా సమానమైన పరస్పర రక్షణ వ్యవస్థగా అభివర్ణించడం గమనార్హం. ఈ కారణంగానే దీనిని ‘ఇస్లామిక్ నాటో’గా ముద్ర వేస్తున్నారు. ఒప్పందంలోని సైనిక వ్యవస్థలు, కమాండ్ నిర్మాణం, బలగాల సమీకరణ, ఏ సందర్భంలో ఎవరు ఎంత మేరకు సైనిక సాయం అందించాలి? వంటి కీలక అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ పరిణామాన్ని భారత్ అంత తేలిగ్గా తీసుకునే పరిస్థితి మాత్రం లేదు. ఎందుకంటే ఈ కూటమిలోని మూడు దేశాలకు భారత్ భద్రతతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉన్నది. ఇక భారత్‌కు పాకిస్థాన్ ప్రత్యక్ష ప్రత్యర్థి అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణలు చోటుచేసుకున్నాయి కూడా. టర్కీ కొన్నేండ్లుగా కశ్మీర్ అంశంపై పాక్ వైఖరికి తందానా అంటోంది. అంతేకాకుండా ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు టర్కీ ఆయుధాలు సమకూర్చినట్టు వార్తలు కూడా వెలువడ్డాయి. కాగా సౌదీ అరేబియా మాత్రం భారత్‌కు అత్యంత ముఖ్యమైన ఇంధన, వాణిజ్య భాగస్వామి. ప్రవాస భారతీయుల ముఖ్యమైన గమ్యస్థానం కూడా కావడం మాత్రమే కాకుండా, పాకిస్థాన్‌తో దీర్ఘకాలిక సైనిక సంబంధాలు కలిగిన దేశం. వీటన్నిటి దృష్ట్యా ఈ కొత్త కూటమి భారత్‌కు ఓ తలనొప్పి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
పాకిస్థాన్‌కు ఇది కేవలం మరో రక్షణ ఒప్పందం కాదు. ఆర్థికంగా బలహీనమైన, దౌత్యపరంగా ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్న ఇస్లామాబాద్‌కు సౌదీ ఆర్థిక బలం, టర్కీ రక్షణ సాంకేతికత, తన సైనిక అనుభవం.. మూడూ కలిసి ఒక కొత్త వ్యూహాత్మక బలం సమకూరుస్తాయి. ఇది భారత్‌కు ముఖ్యంగా రెండు కారణాల వల్ల ఆందోళన కలిగించే అంశం. మొదటిది, పాకిస్థాన్‌కు అంతర్జాతీయ పలుకుబడి పెరిగే అవకాశం ఏర్పడటం. రెండోది, సంక్షోభ సమయంలో ఇస్లామాబాద్‌కు రాజకీయ, ఆర్థిక లేదా సైనిక సహకారం అందించే దేశాల పరిధి పెరుగడం. అంతమాత్రాన ఇల్లలుకగానే పండుగ అయినపోయినట్టు భావించలేం. కూటములకు ముఖ్యంగా కావాల్సింది ఉమ్మడి శత్రువు. సౌదీ అరేబియా పాకిస్థాన్ కోసం భారత్‌తో తన సంబంధాలను త్యాగం చేసే స్థితిలో లేదు. ఈ సమీకరణంలో టర్కీ పాత్రను ప్రత్యేకంగా గమనించాలి. నాటో సభ్యదేశమైన టర్కీ రష్యా, గల్ఫ్ దేశాలు, పాకిస్థాన్‌తో స్వతంత్ర వ్యూహాత్మక సంబంధాలను విస్తరిస్తున్నది. తన ప్రభావ పరిధిని పెంచుకోవాలన్న టర్కీ ప్రయత్నంలో ఈ ఒప్పందం కీలకమైనదే.
మక్కా కూటమి వెనుక ప్రధానంగా కనిపించేది మతప్రాతిపదిక. పైగా మూడూ ఇస్లాంలో ఒక తెగ అయిన సున్నీ దేశాలు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కూటమి ఏర్పాటును సమర్థిస్తున్నట్టు ప్రకటించడం విడ్డూరం. గతంలో వియత్నాంలో, ఇరాక్, అఫ్ఘనిస్థాన్‌లో పిచ్చిపిచ్చి ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న అమెరికా సైనిక వ్యూహాల మీద పశ్చిమాసియా దేశాలకు నమ్మకం పోయింది. అమెరికా సాగిస్తున్న ఇరాన్ యుద్ధం పశ్చిమాసియా దేశాలకు తలనొప్పిగా మారడం తెలిసిందే. అవి అమెరికాను దూరం పెట్టడంపై ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే మక్కా ఒప్పందం భారత్‌కు ఒక సవాల్ గానే చూడాలి. మన ఇంధన సరఫరాలు, సముద్ర వాణిజ్యం, ప్రవాస భారతీయుల భద్రత, పశ్చిమ తీర రక్షణ.. ఇవన్నీ ఈ ప్రాంత భద్రతతో ముడిపడి ఉన్నాయి. అందువల్ల వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూ, కూటమి ప్రాబల్యాన్ని తగ్గించడానికి భారత్ దౌత్యపరమైన కృషి చాలానే చేయాల్సి ఉంటుందని చెప్పకతప్పదు.